జులై 1 నుంచి... అంటే రేపటి నుంచే అమల్లోకి రానున్న జీఎస్టీ అన్ని రంగాలపై ప్రభావం చూపించనుంది. ఇది సానుకూల ప్రభావం కావొచ్చు.. కొన్ని రంగాలకు ప్రతికూలంగా ఉండొచ్చు. మరి అలాంటప్పు అసలు టెక్నాలజీ రంగంపై జీఎస్టీ ప్రభావం ఏంటి? ఎలా ఉండబోతోంది..? అన్నది విశ్లేషించుకుంటే మిశ్రమ ప్రభావం పడుతుందనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు కొన్ని విషయాల్లో కొంత ప్రతికూలత ఉన్నా కూడా లాంగ్ రన్ లో జీఎస్టీ టెక్ రంగానికి కొత్త ఊపు తెస్తుందని అంటున్నారు.
నిజానికి సెల్‌ఫోన్లపై జీఎస్‌టీ రేటు 12 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం దేశీయంగా తయారు చేస్తున్న సెల్‌ఫోన్లపై, దక్షిణాది రాష్ట్రాల్లో 7 శాతం పన్ను విధిస్తున్నారు.. అంటే జీఎస్టీ వచ్చాక ఇది 12 శాతం అవుతుంది. అంటే ఇప్పుడున్న కంటే 5 శాతం పెరుగుతుందన్నమాట. మరోవైపు దిగుమతి చేసుకుంటున్న మొబైల్స్‌పై బేసిక్ కస్టమ్స్ ఇప్పుడు 12 శాతం ఉండగా, జీఎస్‌టీలో ఇది ఇలాగే ఉంటుందా... పెరుగుతుందా అన్నది చూడాలి.
విదేశాల్లో పూర్తిగా తయారై, దిగుమతి అవుతున్న సెల్‌ఫోన్లపై 12.5 శాతం బేసిక్ కస్టమ్స్‌తో పాటు ఇతర సుంకాలు వసూలు చేస్తున్నారు. ఇది కాక ఆయా రాష్ట్రాలు విధించే వ్యాట్ కూడా ఉంటుంది. దిగుమతి చేసుకునే సెల్‌ఫోన్లకు కస్టమ్స్, వ్యాట్ కలిపితే 18 శాతానికి పైగా పన్నుభారం ఉంటోంది. రేపటి నుంచి సెల్‌ఫోన్లపై జీఎస్‌టీ రేటును 12 శాతం చేయడంతో దిగుమతి చేసుకునే ఫోన్ల ధరలు తగ్గుతాయి. అయితే... మన మార్కెట్ పొటెన్షియాలిటీ బట్టి చాలాసంస్థలు ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తుండడంతో అధికశాతం ఫోన్లపై పన్ను పెరగనుంది.
అయితే... ఈ పన్ను పోటు తమ మార్కెట్ ను దెబ్బతీయకుండా ప్రధాన సంస్థలన్నీ జాగ్రత్త పడుతున్నాయి. ఈ భారం తామే భరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పన్ను భారం వినియోగదారుడికి ట్రాన్సఫర్ కాకుండా తామే భరిస్తామని పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. శాంసంగ్, షియోమీ, ఒప్పో, జియోనీ, ఇంటెక్స్, లావా కంపెనీలు ఈ మేరకు ప్రకటించాయి. అంటే.. ఆ కంపెనీ ఫోన్లపై జీఎస్టీ ప్రభావం లేనట్టే. జీఎస్టీ ప్రభావం తమ కంపెనీ ఫోన్లపై పడదని జియోనీ మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ వోహ్రా తెలిపారు. చైనాకు చెందిన షియోమీ, ఒప్పోతోపాటు భారత్‌కు చెందిన లావా కూడా మొబైల్ రేట్లను పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. తమ కంపెనీ ఉత్పత్తుల కొనుగోలును పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ గౌరవ్ నిగమ్ తెలిపారు. శాంసంగ్ కూడా రేట్లు పెంచబోమని చెప్పింది. అయితే... ఇవన్నీ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లకే వర్తిస్తాయి.. ఇకపై వచ్చే మోఢల్లపై మాత్రం జీఎస్టీ ప్రభావం ఉంటుంది.
మరోవైపు కెమెరాలు, స్పీకర్లు, కొన్ని రకాల ఎలక్ర్టానిక్ వస్తువులు, మానిటర్లు తదితరాలు కూడా 12 శాతం శ్లాబ్ పరిధిలోనే ఉండడంతో వాటి ధరలూ పెరగనున్నాయి.