స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలన్నీ పేమెంట్ సర్వీస్‌ల బాట పట్టేస్తున్నాయి. చైనా కంపెనీలు ఒప్పో, వివో, ఎంఐ ఇప్పటికే ఈ రూట్‌లోకి వచ్చేశాయి. లేటెస్ట్‌గా ఇండియన్ మొబైల్ మేకర్ లావా కూడా కాలు పెట్టింది. లావా పే పేరుతో పేమెంట్ సర్వీస్‌ను ప్రారంభించింది. అయితే ఇంటర్నెట్ అవసరం లేని సర్వీస్ కావడం దీని స్పెషాలిటీ.
ప్రపంచంలోనే తొలిసారి
ప్రపంచంలోనే తొలిసారిగా ఇంటర్నెట్ అవసరం లేని మొబైల్ పేమెంట్ యాప్‌ను తామే ప్రవేశపెడుతున్నట్లు లావా ప్రకటించింది. సరిగ్గా వారం రోజుల కిందట లావా ఈ సర్వీస్‌ను ప్రారంభించింది. లావా పేను ప్రారంభించడం ద్వారా తాము కూడా డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లోకి వస్తున్నట్లు ఈ నోయిడా బేస్డ్ కంపెనీ అనౌన్స్ చేసింది. ఇంటర్నెట్ అవసరం లేని మొబైల్ పేమెంట్స్ మోడ్ అని, ప్రపంచంలోనే ఇదే మొదటిదని కంపెనీ చెప్పింది.
ఫీచర్ ఫోన్ యూజర్లకూ పనికొచ్చేలా
ఇంటర్నెట్‌తో పని లేకుండా పేమెంట్స్ చేయొచ్చు కాబట్టి ఇది ఫీచర్ ఫోన్ యూజర్లకు కూడా బాగా పనికొస్తుంది. అంటే యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయాలనుకునే ఫీచర్ ఫోన్ వాడకందార్లకు ఇది మంచి ఆప్షన్. ఇప్పటికీ ఇండియాలో ఫీచర్ ఫోన్ వాడుతున్న 50 కోట్ల మందికి ఇది సంతోషం కలిగించే వార్త అని లావా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ హెడ్ తేజిందర్ సింగ్ చెప్పడం ఆ కంపెనీ ప్లాన్‌ను తెలియజేస్తుంది.
ఎలా పని చేస్తుంది?
లావా కొత్తగా తీసుకురాబోయే ఫోన్లలో ఈ లావా పే యాప్‌ను ప్రీ ఇన్‌స్టాల్ చేసి ఇస్తుంది. ఇప్పటికే లావా ఫోన్లు వాడుతున్నవారు దేశంలోని 800కు పైగా ఉన్న లావా సర్వీస్‌సెంటర్లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చు.
* లావా పే యాప్ ద్వారా పేమెంట్స్ చేయాలనుకునేవారు దాన్ని తమ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేసుకోవాలి
* తర్వాత పేమెంట్ చేయాలంటే రిసీవర్ ఫోన్ నెంబర్ కొట్టి, అమౌంట్ ఎంటర్ చేయాలి.
* ట్రాన్సాక్షన్ పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే పేమెంట్ పూర్తవుతుంది.
* పేమెంట్ పూర్తవగానే సెండర్‌కి, రిసీవర్‌కి కూడా మెసేజ్‌లు వస్తాయి.
* అకౌంట్లో ఎంత బ్యాలన్స్ ఉందో కూడా యాప్‌లో చెక్ చేసుకోవచ్చు.
* లావా పే యాప్‌లో సెక్యూరిటీ కోసం కూడా అన్ని చర్యలూ తీసుకున్నామని కంపెనీ ప్రకటించింది.