ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పేటీఎమ్ ఇప్పుడు ప్రయాణ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇన్ని రోజులు ప్రయాణ వ్యాపారంపై పెద్దగా దృష్టి పెట్టని పేటీఎమ్ ఇకపై పూర్తి స్థాయిలో ఈ రంగంపై కేటాయించాలని నిర్ణయించింది. రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు సులభంగా టిక్కెట్లు బుక్ చేసుకునే విధంగా పేటీఎమ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటిదాకా రోడ్డు ప్రయాణాలకు మాత్రమే ఈ ఈ-కామర్సు సంస్థ సేవలు అందించేది. ఇలా చేయడం వల్ల తమ వెబ్‌సైట్‌కు మరింత ఎక్కువ ట్రాఫిక్‌ను పెంచుకోవాలనేది పేటీఎమ్ యోచన. ఈ ఆలోచనలో భాగంగానే హోటల్ వసతి, విమాన ప్రయాణాలను బుక్ చేసే ఈజీగో-1 సంస్థతో పేటీఎమ్ ఒప్పందం చేసుకుంది. అన్ని ఎయిర్‌లైన్ సర్వీసులు ప్రయాణీకులకు అందుబాటులో ఉండేలా పేటీఎమ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. విమాన ప్రయాణంతో పాటు రైలు ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుని రైల్వే టిక్కెట్లు పేటీఎమ్ ద్వారా సులభంగా బుక్ చేసుకునే వీలు కల్పించడానికి కృషి చేస్తోంది. కేవలం రవాణా సదుపాయాల కల్పన కోసం ఈ ఆర్థిక సంవత్సరం పేటీఎమ్ రూ.120 కోట్లు పెట్టుబడి పెడుతోంది. మిగిలిన ఈ-కామర్స్ సైట్లకు భిన్నంగా వారికి పోటీ ఇస్తూ అన్ని రకాల సదుపాయాలు తమ సైట్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేటీఎమ్ వెల్లడించింది. ప్రయాణ వ్యాపారం ద్వారా ప్రతి బుకింగ్ నుంచి పేటీఎమ్‌కు కమిషన్ రూపంలో లాభం ఉంటుంది. నిజానికి గతేడాదే ప్రయాణ సేవలను పేటీఎమ్ తమ సైట్‌లో ఉంచినా... ఈ ఏడాది నుంచి ఆ సదుపాయాలను మరింత పెంచుకోవాలని అనుకుంటోంది. మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ కూడా తమ సైట్‌లో ప్రయాణ వ్యాపారంపై దృష్టి పెట్టింది. గత నెల బస్, విమానం ప్రయాణ టిక్కెట్ల బుకింగ్ సేవలతో పాటు ఫుడ్ డెలివరీ లాంటి సదుపాయాలను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ వినియోగదారులకు వీలైన్ని ఎక్కువ సదుపాయాలు కల్పించి తద్వారా తమ మార్కెట్‌ను పెంచుకోవాలన్నదే మా ఉద్దేశమని పేటీఎమ్, స్నాప్‌డీల్ చెబుతున్నాయి. ఇలాంటి కొత్త సదుపాయల కల్పన ద్వారా ఆదాయాలను గణనీయంగా పెంచుకోవచ్చనేది మార్కెట్ నిపుణుల మాట. 2014 ఏడాదికి డిజిటల్ కామర్సు మొత్తం విలువ రూ.81525 కోట్లు ఉన్నట్లు ఇంటర్నెట్ మొబైల్ సంఘం తెలిపింది. ఈ మొత్తంలో ఆన్‌లైన్ ప్రయాణ వ్యాపారంపైనే రూ.50,050 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఆ సంఘం తెలిపింది. |