• తాజా వార్తలు

ఇక పెట్రోలు బంకుల్లోనూ పేటీఎం ద్వారా పేమెంట్..

చెల్లింపుల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన పేటీఎం యాప్, వ్యాలట్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. మొదట్లో రీఛార్జిలకే పరిమితమైన ఇది అనంతరం వ్యాలట్ గా ఎన్నో సేవలను విస్తరించింది. బస్ టిక్కెట్ల బుకింగ్ వంటి సదుపాయాలను ఆఫర్లతో తీసుకొచ్చి చాలావేగంగా ప్రజల్లోకి దూసుకెళ్లిపోయింది. రెండేళ్ల కిందట కూడా పెద్దగా నమ్మశక్యంగా అనిపించని పేటీఎం ఇప్పుడు ఈకామర్స్ టాప్ ఫైవ్ సైట్లలో ఒకటి. రీఛార్జిలు, పేమెంట్లు, టిక్కెట్ల వంటివాటికైతే ఇప్పుడిది చిరునామాగా మారిపోయింది.  ఇప్పటికే మొబైల్ బిల్లులు, డీటీహెచ్, ల్యాండ్ లైను, గ్యాస్, కరెంటు బిల్లులు కట్టే సదుపాయాలతో పాటు ముంబయి మెట్రో ప్రీపెయిడ్ కార్డులు.. పలు కాలేజిలు, యూనివర్సిటీల ఫీజులు కూడా పేటీఎం నుంచి చెల్లించే అవకాశం ఉంది. ఇన్సూరెన్సు ప్రీమియంలు చెల్లించడానికీ పేటీఎం వ్యాలట్ ఉపయోగపడుతోంది. తాజాగా పేటీఎం వ్యాలట్ మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకుల్లోనూ ఇక పేటీఎంతో డబ్బులు చెల్లించొచ్చట. అయితే... ప్రస్తుతం దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రాలేదు. కొన్నిచోట్ల మాత్రమే పేటీఎం వ్యాలట్ ద్వారా పేమెంట్ ను యాక్సెప్ట్ చేస్తున్నారు. త్వరలో అన్ని బంకుల్లోనూ పేటీఎం వ్యాలట్ తో పేమెంటు చేసుకోవచ్చు.

పేటీఎం మిగతా వ్యాలట్లకు అందనంత వేగంగా కొత్తకొత్త పద్ధతుల్లో సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఢిల్లీ మెట్రో చెల్లింపులకు కూడా పేటీఎం మాధ్యమంగా మారబోతోంది. దేశంలోని పలు దుకాణాల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత క్యాష్ లెస్ పేమెంట్ విధానాన్ని పేటీఎం తీసుకొచ్చింది.

మరోవైపు ఏ అవకాశాన్నీ వదులుకోకూడదు అన్నట్లుగా ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి కార్డు ఆధారిత పేమెంటు ఆప్షన్స్ కూడా తీసుకొచ్చింది పేటీఎం. ఈ కార్డు సహాయంతో ఆఫ్ లైన్లోనైనా, ఆన్ లైన్లోనైనా చెల్లింపులు జరపొచ్చు.వీసా, మాస్టర్ కార్డ్, రూపే కార్డులు యాక్సెప్ట్ చేసే ప్రతి చోటా ఈ పేటీఎం కార్డులూ యాక్సెప్ట్ చేస్తారు.ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచుల నుంచి పేటీఎం వ్యాలట్లో డబ్బులు నింపొచ్చు... ఆ బ్యాంకులో ఖాతా లేకున్నా కూడా పేటీఎం వ్యాలట్లో డబ్బు నింపే అవకాశం ఉంది.

అయితే... పేటీఎం వ్యాలట్లో ఉన్న డబ్బులు తీయాలంటే ఎలా...? అందుకు కూడా పరిష్కారం చూపించడానికి పేటీఎం సిద్ధమవుతోంది. త్వరలోనే డెబిట్ కార్డులు జారీ చాసి వాటి సహాయంతో పేటీఎం వ్యాలట్ లోని డబ్బు తీసుకునే వీలు కల్పించనుంది.

 

జన రంజకమైన వార్తలు