సాధారణంగా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు కొనేటప్పుడు మనకు టిక్కెట్ ఛార్జీలతో పాటు హ్యాండ్లింగ్ ఛార్జీలు, ఇంటర్నెట్ ఛార్జీలు, జీఎస్‌టీ ఇలా చాలా పన్నులు వేసేస్తూ ఉంటారు. దీంతో అసలు టిక్కెట్ కన్నా ఎక్కువ ధర పెట్టి టిక్కెట్ కొనాల్సి ఉంటుంది. కానీ థియేటర్‌కు వెళ్లి క్యూలో నిల్చోవడం కన్నా ఆన్‌లైన్లో అయితే త్వరగా వేగంగా అయిపోతుంది.. సమయం కలిసొస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువమంది ఇంటర్నెట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే టిక్కెట్ల ఒరిజినల్ ధరతో పాటు అదనంగా చెల్లించాల్సిన సొమ్ము వల్ల ప్రతిసారీ కస్టమర్ నష్టపోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్లు హ్యాండ్లింగ్ ఫీజులు కట్టనవసరం లేదని ఆర్‌బీఐ కొత్త రూల్ పెట్టింది. మరి నిబంధనను అనుసరించి మనం టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా?
ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం యూజర్లు ఆన్‌లైన్లో అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఈ ఫీజులను సర్వీస్ ఛార్జ్‌లు లేదా హ్యాండ్లింగ్ ఫీజులు అంటారు. ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన ఫోరం అగనెస్ట్ కరెప్షన్ అధ్యక్షుడు విజయ్ గోపాల్ అనే అతను వేసిర ఆర్‌టీఐ పిటిషన్‌కు జవాబు చెబుతూ ఆర్‌బీఐ ఇలా బదులిచ్చింది. బుక్ మై షో లాంటి సైట్లలో సాధారణంగా మనం టిక్కెట్లు బుక్ చేసుకుంటాం. అయితే ఇలా బుక్ చేసుకునేటప్పడు బుక్ మై షో టిక్కెట్ డబ్బులకు అదనంగా ఛార్జీలు వేయొచ్చా అని ఆర్‌టీఐ.. ఆర్‌బీఐకి అడిగింది. దీనికి సమాధానంగా ఆర్‌బీఐ.. అలాంటి నిబంధన లేదు అని చెప్పింది. ఒక రకంగా చెప్పాలంటే బుక్ మై షో హ్యాండ్లింగ్ ఛార్జీలు ఆర్‌బీఐ మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) నిబంధనలకు విరుద్ధం కూడా.
చాలా ఆన్‌లైన్ కంపెనీలు ఈ ఛార్జీలను యూజర్ల మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. బ్యాంకులు వేసే ఛార్జీలను భరించడానికి ఇష్టం లేని సైట్లు వాటిని హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నాయి. బుక్ మై షో మాత్రమే కాదు ఆన్‌లైన్ క్యాబ్ బుకింగ్, ఫుడ్ డెలివరీ యాప్‌లు కూడా ఇలాగే యూజర్ల మీద ఛార్జీలు వేస్తున్నాయి. ఎవరైనా ఇలా అదనపు ఛార్జీలు కట్టాల్సి వస్తే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయచ్చు. అయితే ఆర్‌బీఐ నిబంధనల మీద మాత్రం బుక్ మై షో నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. వినియోగదారులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటే మాత్రం కచ్చితంగా లీగల్‌గా ప్రొసీడ్ అవొచ్చని ఆర్‌బీఐ, ఆర్‌టీఐ రెండూ ఒక ప్రకటనలో తెలిపాయి.