ఇప్పుడు నడుస్తోంది ఆన్‌లైన్ యుగం. ఏ బిల్స్ కట్టాలన్నా జస్ట్ ఒక మీట నొక్కితే చాలు బిల్ పే
అయిపోతుంది. ఒక్క స్టెప్ చాలు మీ సర్వీసెస్ రెన్యూ అయిపోతున్నాయి. దీనికంతటికి కారణం ఆన్‌లైన్ ఆటో డెబిట్. మీరు ఒకవేళ ట్రాన్సాక్షన్ చేయడం మరిచిపోయినా మీతో సంబంధం లేకుండా మీ అకౌంట్ నుంచే డబ్బులు డెబిట్ అవుతాయి. దీని వల్ల అదనపు ఛార్జీలు పడే ప్రమాదం నుంచి బటయపడేవాళ్లు అయితే ఇప్పుడు ఆన్‌లైన్ ఆటో డెబిట్ కు కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. ఈ అక్టోబర్ 1 నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్ ఆటో డెబిట్ ఉపయోగించుకోవాలంటే ఎవరైనా ఈ నిబంధనలు పాటించాల్సిందే. ఈ నిబంధల ప్రకారం ఇప్పటికే మీరు రిజిస్టర్ చేసుకున్న స్ట్రీమింగ్ సర్వీసులు లేదా బిల్ పేమెంట్స్ వంటి వాటిని మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
అప్పటి నుంచి మొదలు
రికరింగ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2019 నుంచి నిబంధనలు పెట్టింది. అయితే ఈ నిబంధనలు అమలు కావడానికి రెండేళ్ల సమయం పట్టింది. నెట్‌ఫ్లిక్స్, అమేజాన్, యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్లతో పాటు యుటిలిటీ బిల్స్ పే చేయడం కోసం ఇప్పుడు ఈ కొత్త ప్రాసెస్‌ను అంతా అనుసరించాల్సి ఉంటుంది. ఈ మార్పు కేవలం దేశవాళీ పేమెంట్స్ కు మాత్రమే కాక క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్‌తో చేసే ఎటువంటి అంతర్జాతీయ పేమెంట్స్‌కు అయినా వర్తిస్తుంది. అయితే ఈ కొత్త నిబంధనలను పాటించడం అంత సులభం కాదని బ్యాంకులు అంటున్నాయి. యాక్సిస్, సిటీ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ, కొటాక్ మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ తదితర బ్యాంకులు ఈ కొత్త ప్రాసెస్‌కు అభ్యంతరం చెబుతున్నాయి. దీనికి కారణం లక్షలాది మంది కస్టమర్లు ఒక ప్రాసెస్‌కు అలవాటుపడ్డారని ఇప్పడు దీనిలో మార్పులు చేయడం వల్ల వాళ్లు ఇబ్బంది పడతారని బ్యాంకులు అంటున్నాయి.
డిక్లయిన్ అవుతాయ్
అయితే కొత్త ఆన్‌లైన్ రికరింగ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌ను పాటించకపోతే మన లావాదేవీలు డిక్లయిన్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు ఈ విషయంపై సందేశాలు పంపుతున్నాయి. రికరింగ్ ట్రాన్సాక్షన్లలో మోసాలు ఎక్కువయ్యాయని అందుకే కొత్త ప్రాసెస్ ద్వారా అడ్డుకట్ట వేస్తున్నామని ఆర్‌బీఐ చెబుతోంది. ఇది కొంచెం కష్టమైనా తర్వాత కస్టమర్లు అలవాటుపడతారని అంటోంది. అందుకే ఆన్‌లైన్ రికరింగ్ ట్రాన్సాక్షన్లకు టూ ఫాక్టర్ అథంటికేషన్ తప్ననిసరి చేస్తున్నామని దీని వల్ల మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉండదని నిపుణుల మాట. రికరింగ్ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత మీ బ్యాంకు నుంచి సందేశం వస్తుంది. మీ ట్రాన్సాక్షన్లు ఎప్పుడు బాకీ ఉన్నా కూడా బ్యాంకు మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తుంది.
కస్టమర్లకు తెలిసేలా
బిల్ డెస్క్, పేయూ, రెజో పే లాంటి పేయింగ్ ఫ్లాట్‌ఫామ్స్ కు కూడా ఆర్‌బీఐ ఇలాంటి నిబంధనలే పెట్టింది. ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ట్రాన్సాక్షన్లు డిక్లయిన్ అవుతాయనే సందేశాన్ని కస్టమర్లకు తెలిసేలా చేయాలని ఆర్‌బీఐ కొత్త నిబందనలు చెబుతున్నాయి. అయితే బ్యాంకులు, మార్చంట్స్, పేమెంట్ గేట్ వేలకు కొత్త నిబంధలను అమలు చేయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడాలన్న విషయంపై మాత్రం ఆర్‌బీఐ స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలే పే యూ పేమెంట్ గేట్ వే తన పాత జియాన్ ఫ్లాట్‌ఫామ్ నుంచి కొత్త ఫ్లాట్‌ఫామ్‌కు మారింది. ఆర్‌బీఐ నిబంధన అమలుకు ప్రయత్నం చేస్తోంది. రికరింగ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లలో ఇ-మాండేట్ కోసం ఈ జులైలో పేయూ, రొజో పే లాంటి గేట్ వేలు మాండేట్ హెచ్‌క్యూని అమల్లోకి తీసుకొచ్చాయి.