• తాజా వార్తలు

ఈ-స్టార్టప్ లకు కష్టకాలం..

భారత్‌లో పలు ఈ-కామర్స్‌ స్టార్టప్‌ లు ఆదిలోనే భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి.  మార్కెట్‌ బ్రాండింగ్‌లో కళకళలాడుతున్నప్పటికీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని అగ్రశ్రేణి 22 ఆన్‌లైన్‌ విక్రయ సంస్థల నష్టాలు ఏకంగా 293 శాతం పెరిగి రూ.7,884 కోట్లుగా నమోదయ్యాయి. కంపెనీల మధ్య భారీ పోటీ నేపధ్యంలో ప్రకటనలకు భారీగా వ్యయం చేయడం, వ్యాపార అంచనాలు తప్పడంతో ఈ-కామర్స్‌ కంపెనీలు నష్టాలతో బోరుమంటున్నాయి. మొత్తంగా ఈ-కామర్స్‌ కంపెనీల రెవెన్యూ 191 శాతం పెరిగిందని బ్రోకరేజీ సంస్థ కొటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ సెక్యూరిటీస్‌ ఓ పరిశోధనలో తెలిపింది. 

కొటక్ నివేదిక ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమెజాన్‌ కంపెనీల రెవెన్యూ 475 శాతం పెరిగింది. ఈ సంస్థల నష్టాలు మాత్రం 158.4 శాతానికి తగ్గాయి. అంతక్రితం ఏడాదిలో నష్టాల్లో 197.9 శాతం పెరుగుదల ఉంది.హౌసింగ్‌.కామ్‌ భారీ నష్టాలు చవి చూసింది. 2013-14 నష్టాల్లో 325 శాతం పెరిగితే, 2015 మార్చి నాటికి ఇవి ఏకంగా 738.4 శాతానికి చేరాయి. గతేడాది 279 కోట్ల రెవెన్యూతో రూ.12.7 కోట్ల నష్టాలు చవి చూసింది. ప్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌, అమెజాన్‌ సంస్థలు మొత్తంగా రూ.4,984 కోట్ల నష్టాలు మూటగట్టుకున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్స్‌ సంస్థలు సులేఖ, ఆస్క్‌మి, క్విక్కర్‌ సంస్థల ఆదాయం స్వల్పంగా పెరిగినప్పటికీ నష్టాలు చవిచూశాయి. 

ఇక భారత ఈ-కామర్స్‌ రంగం రానున్న 2020 నాటికి ఏకంగా 50 బిలియన్‌ డాలర్ల వ్యాపారానికి చేరుకోనుందని ప్రముఖ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌, ఇండియా రిట్కెల్‌ అసోసియేషన్‌ సంయుక్తగా ఒక్క నివేదికలో అంచనా వేసింది. 2020 కల్లా భారత ఈ-కామర్స్‌ లావాదేవీలు ఐదు రెట్లు పెరిగి 40-50 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని పేర్కొంది.  ఇంటర్నెట్‌ యూజర్లు 26 కోట్ల నుంచి 65 కోట్లకు చేరుకోవడంతో ఆన్‌లైన్‌ అమ్మకాలకు మద్దతు పెరుగనుందని తెలిపింది. 2020లోపు 40 కోట్ల వినియోగదారులు డిజిటల్‌ ప్రభావానికి గురవుతారని పేర్కొంది. వీరిలో 25 శాతం మంది ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో ధరలు పరిశీలించి వస్తువులు కొనుగోలు చేస్తారని ఆ నివేదిక తెలిపింది.

 

జన రంజకమైన వార్తలు