చైనా వల్లే కరోనా వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. దానికి తోడు నెల రోజుల నుండి సరిహద్దుల్లో చైనా మన సైన్యాన్ని కవ్విస్తోంది. మంగళవారం అయితే ఏకంగా మన సైన్యంలో 20 మందిని దారుణంగా చంపేసింది. ఈ పరిస్థితుల్లో చైనా వస్తువులను బహిష్కరించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ యాంటీ చైనా సెంటిమెంట్ తమకు బాగా కలిసి వచ్చిందని అమెరికన్ టీవీల కంపెనీ వ్యూ (Vu) సంబరపడుతోంది.
50 వేల 4కే టీవీలు అమ్మేసింది
టీవీల మార్కెట్ ఇండియాలో చాలా బాగుందని అమెరికన్ టీవీ కంపెనీ వ్యూ నాలుగేళ్ల ముందే గుర్తించింది. అప్పటి నుంచే ఇండియాలో టీవీలు అమ్ముతోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో రావడంతో వీటికి మంచి ఆదరణే దక్కింది. ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ సైట్లలో మాత్రమే లభ్యమైనా వీటిని జనం బాగానే కొన్నారు. ఇదే ఊపులో ఇటీవల 4 కే టీవీలను తీసుకొచ్చింది. ఇవి కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. ఆ విషయాన్ని వ్యూ టెలివిజన్స్ చైర్మన్ అండ్ సీఈఓ దేవితా షరాఫ్ స్వయంగా చెప్పారు. యాంటీ చైనా సెంటిమెంట్‌తో జనం తమ 4కే టీవీలకు భలే కలిసి వచ్చిందని ఆమె అన్నారు. భారతీయ కొనుగోలుదార్లలో చాలా మంది చైనా వస్తువులను కొనకూడదన్న ఉద్దేశంతో అదే ధరలో మంచి ఆప్షన్లతో వచ్చిన వ్యూ టీవీని కొన్నట్లు తెలుస్తోంది. నెల రోజుల్లో 50 వేల 4కే స్మార్ట్ టీవీలు అమ్మామని షరాఫ్ ప్రకటించడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం.
పుంజుకున్న అమ్మకాలు
లాక్ డౌన్లో వ్యూ టీవీల సర్వీస్ మీద బాగా దృష్టి పెట్టామని, దాదాపు 10 వేల మంది కస్టమర్లకు సేవలు అందించామని ప్రకటించారు. వ్యూ టీవీల క్వాలిటీ, తక్కువ ధరలు, యాంటీ చైనా సెంటిమెంట్ కలిసి తమ టీవీల అమ్మకాలు బాగా పుంజుకున్నాయని షరాఫ్ చెప్పారు