• తాజా వార్తలు

ఇకపై నెఫ్ట్‌ ద్వారా 24 గంటలు నగదు బదిలీలు చేసుకోవచ్చు

డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేలా నగదు బదిలీలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటికే ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ(నెఫ్ట్‌) లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేసిన ఆర్‌బీఐ తాజాగా మరో అడుగు ముందుకేసింది. నెఫ్ట్‌ లావాదేవీలను త్వరలో 24 గంటలూ అందుబాటులో ఉంచనుంది. అంటే ఈ లావాదేవీలను వారంలో ఏ రోజైనా.. ఏ సమయంలోనైనా జరపొచ్చు. ఈ ఏడాది డిసెంబరు నుంచి దీన్ని అమలు చేయాలని ద్రవ్యపరపతి విధాన సమీక్షలో నిర్ణయం తీసుకుంది.  దేశీయంగా రిటైల్‌ చెల్లింపుల వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని పేమెంట్‌ సిస్టమ్‌ విజన్‌ 2021 పత్రంలో ఆర్‌బీఐ పేర్కొంది. 

ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నగదు బదిలీ లావాదేవీలకు నెఫ్ట్, అంతకు మించిన మొత్తానికి రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ సిస్టం (ఆర్‌టీజీఎస్‌) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. రెండో, నాలుగో శనివారం మినహా ప్రస్తుతం నెఫ్ట్‌ సర్వీసులు ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 7 గం.ల దాకా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. 

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ప్రోత్సహించేందుకు నందన్‌ నీలేకని నేతృత్వంలోని కమిటీ ఇటీవల పలు సిఫార్సులు చేసింది. ఛార్జీలను ఎత్తివేయడం, ఎల్లవేళలా ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ సదుపాయం అందుబాటులో ఉండేలా చూడటం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాల దిగుమతులపై సుంకాల తొలగింపు లాంటి అంశాలను ఆ సిఫార్సుల్లో పొందుపరిచింది. ఈ కమిటీ నివేదికను పరిశీలించిన ఆర్‌బీఐ అందుకు అనుగుణంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటికే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌ విధానాల్లో నగదు బదిలీలపై తాను విధించే చార్జీలను ఎత్తివేసింది. మరోవైపు, ఏటీఎం చార్జీలు, ఫీజులన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) సీఈవో సారథ్యంలో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

దీంతో పాటుగా అన్‌సెక్యూర్డ్‌ కన్జ్యూమర్‌ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే దిశగా ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌ కార్డులు మినహా అన్ని రకాల కన్జ్యూమర్‌ రుణాలపై (పర్సనల్‌ లోన్స్‌ సైతం) రిస్క్‌ వెయిటేజీని ప్రస్తుతమున్న 125% నుంచి 100%కి తగ్గించింది. అంతర్‌–రుణదాతల ఒప్పంద (ఐసీఏ) ప్రక్రియలో బీమా సంస్థలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలను (ఏఎంసీ) కూడా చేర్చే క్రమంలో ఆయా రంగాల నియంత్రణ సంస్థలైన సెబీ, ఐఆర్‌డీఏఐతో చర్చలు జరుపుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. మొండిబాకీల పరిష్కార ప్రక్రియలో ఐసీఏని తప్పనిసరి చేస్తూ జూన్‌ 7న సర్క్యులర్‌ ఇచ్చినట్లు ఆయన వివరించారు.
 

జన రంజకమైన వార్తలు