• తాజా వార్తలు

నగదు రహిత వ్యవస్తకు దారి ఎంత దూరం? ఎంత కష్టం? ఎంత మేలు? మానసికంగా ప్రజలు ఎంతవరకు సిద్ధం? సాంకేతిక

ఇండియా డిజిటల్ రూపం తొడగడానికి ఉరకలెత్తుతోంది. ముఖ్యంగా ఆర్థిక రంగంలో సాంకేతికతే అండగా క్యాష్ లెస్ గా మారడానికి సమాయత్తమవుతోంది. ప్రధాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఈ ఆకస్మిక ఆవశ్యకతను మోసుకొచ్చింది. సాంకేతిక సత్తా ఉన్న నగరవాసులు, కుర్రకారు ఇప్పటికే డిజిటల్ జీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తుండగా కొత్తగా మిగతావర్గాలూ ఈ ‘ఈ-మనీ’పై దృష్టి సారిస్తున్నాయి. బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్లే పనిలేకుండా.. జేబులో కరెన్సీ పెట్టుకుని తిరిగే అవసరం లేకుండా అత్యంత సులభంగా లావాదేవీలు సాగించడానికి ఆస్కారమున్న డిజిటల్ మనీ ట్రాన్జాక్షన్లపై అంతా మొగ్గు చూపుతున్నారు. మనకంటే ఎంతో పేద దేశాలైన కెన్యా, సూడాన్ వంటివన్నీ మొబైల్ తోనే లావాదేవీలన్నీ చక్కబెట్టేస్తున్నాయి. ప్రజలందరికీ వీటిపై అవగాహన కల్పించడంతో గ్రామీణ మహిళలు కూడా ఫోన్ పైనే మొత్తం లావాదేవీలుసాగించేస్తున్నారు. ఒక్క రోజులో ఈ మార్పు సాధ్యం కాకపోయినా ఆ మార్పు కోసం తొలి అడుగు ఎప్పుడో ఒకప్పుడు పడాల్సిందే. అలాంటి విప్లవాత్మక అడుగే ఇప్పుడు పడింది. ఇంటర్నెట్ పెనెట్రేషన్.. స్మార్టుఫోన్ అడాప్షన్ దేశంలో మూలమూలకూ చేరితే ఇదేమీ అసాధ్యం కాదు, అందుకు ఎంతో సమయమూ పట్టదు. ప్రస్తుతం క్యాష్‌లెస్ ఎకానమీలో కింగ్ గా నిలబడిన స్వీడన్ కూడా ఒక్కరోజులో ఆ ప్రగతి సాధించలేదు. అంతేకాదు... ఇప్పటికీ నూరు శాతం క్యాష్ లెస్ గానూ మారలేదు. నిరంతర చొరవతోనే ఇది సాధ్యం.. ప్రభుత్వ పరంగా సాంకేతిక మౌలిక వసతులు కల్పిస్తే ప్రజలు క్రమంగా దీనికి అలవాటు పడడం ఖాయం.

పెద్దనోట్ల రద్దు తరువాత దేశంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది.. ఆన్ లైన్ లావాదేవీలు అనివార్యమవుతున్నాయి. దీంతో ఇప్పటివరకు ఎన్నో భయాల మధ్య క్యాష్ లెస్ ట్రాంజాక్షన్లకు దూరంగా ఉన్న వర్గాలన్నీ ఇప్పుడు క్రమంగా తమ భయాలను వీడుతున్నారు. సామర్థ్యాలను పెంచుకుంటున్నారు... అవసరాలకు అనుగుణంగా మారుతున్నారు. మౌలిక వసతుల లేమి, సంప్రదాయ అలవాట్లు, నిరక్షరాస్యత, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో లేకపోవడం... దేశంలో ఫోన్ కనెక్షన్లు 100 కోట్లు దాటినా స్మార్టు ఫోన్లు అందరి వద్దా లేకపోవడం.. అందరికీ బ్యాంకు ఖాతాలు లేకపోవడం వంటి ఎన్నో ప్రతికూలతలను చూపిస్తూ భారత్ వంటి సువిశాల దేశం పూర్తిగా నగదు రహితం కావడం అసాధ్యమన్న నిరాశావాదుల మాటలో కొంత నిజం ఉన్నా సాంకేతికత తెచ్చే ఏ మార్పయినా తొందరగా వ్యాపిస్తుందన్న సత్యం, గత అనుభవాలే పెన్నిధిగా ఇండియా క్యాష్ లెస్ కావడం అసాధ్యమేమీ కాదని అంగీకరించక తప్పదు.

ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తే మన కళ్ల ముందే ఎన్నో మార్పులొచ్చాయి. దూర ప్రాంతాలకు ఫోన్ చేయాలంటే 20 ఏళ్ల కిందట టెలిఫోన్ ఎక్స్చేంజిలకు వెళ్లి చేయాల్సి వచ్చేది. ట్రంకాల్ మాట్లాడాలంటే ఊరు అదిరిపోయే గొంతుతో మాట్లాడాల్సి వచ్చేది. ఆ తరువాత పబ్లిక్ టెలిఫోన్ బూత్ లు వచ్చాక సులభమైంది. కాయిన్ బాక్సులు వచ్చాక ఇంకా సులభమైంది... మొబైల్ ఫోన్లు వచ్చాక ప్రపంచమే మారిపోయింది. స్మార్టు ఫోన్లు వచ్చాక సర్వం మారిపోయింది. స్మార్టు ఫోన్ల రాకతో చివరకు కంప్యూటర్ల విక్రయాలు కూడా సగానికి తగ్గిపోయి మైక్రోసాఫ్టు వంటి సంస్థలకే వ్యాపారం తగ్గిపోయింది. ఇక స్మార్టు ఫోన్లలో తీసుకుంటే ఆండ్రాయిడ్ ఒక్కో వెర్షన్లో కొత్తకొత్త ఫీచర్లు వస్తుండడం.. డాటా వేగం పెరుగుతుండడంతో రోజురోజుకీ మార్పులొస్తున్నాయి. 2జీ... 3జీ.. నుంచి 4జీ వేగంలోకి రావడానికి ఎంత కాలం పట్టింది? యుగాలేమీ పట్టలేదు. అంతా రెండుమూడేళ్లలోనే జరిగిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా యాక్సెస్ చేయని కుర్రకారు ఇండియాలో ఏమూల వెతికినా కనిపించరు. ఫేస్ బుక్, వాట్సాప్ లలో కనిపించని వారు ఉండనే ఉండరు. వాటితో విసిగిపోయి దూరం జరిగినవారు ఉన్నారేమో కానీ... వాటి గురించి ఏమాత్రం తెలియనివారు మాత్రం ఉండరేమో. టెక్నాలజీ ఇంతగా ఆకర్షిస్తూ... ఇంతగా ప్రపంచ సమాచారాన్ని అందిస్తూ.. వినోదం కలిగిస్తూ ఉన్నప్పుడు అది కల్పించే నగదు రహిత్య సౌలభ్యాన్ని మాత్రం ప్రజలు ఎందుకు వదులుకుంటారు. కావాల్సిందంతా కొత్తవారికి అది ఒకసారి అలవాటు కావడమే... అందులో నష్టమేమీ లేదన్న భరోసా దొరకడమే. ఈ భరోసా కల్పించాల్సింది ప్రభుత్వాలు, ఆర్థిక లావాదేవీలకు మాధ్యమంగా ఉపయోగడపడే బ్యాంకులు, వ్యాలట్ సర్వీసులు, ఇతర వేదికలు. పెద్ద నోట్ల రద్దుతో నగదు కొరత ఏర్పడిన సమయంలోనే మన సామాజిక ఆర్థిక వ్యవస్థ డిజిటల్ టర్ను తీసుకునేలా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఇంటింటికీ ఇంటర్నెట్ అందుబాటులోకి తేవాలి. స్మార్టుఫోన్ల ధరలు తగ్గాలి. వీలైతే రాయితీలపై ప్రభుత్వాలు పేద వర్గాలకు అందివ్వగలగాలి. డిజిటల్ లావాదేవీలపై రుసుములు ఎత్తేయాలి. ఇవన్నీ చేసినప్పుడు క్యాష్ లెస్ ఎకానమీ కల తొందరలోనే నెరవేరుతుంది.

ప్రపంచంలో 100 శాతం క్యాష్‌లెస్ ఎకానమీకి కొద్ది దూరంలోనే ఉన్న దేశమేదైనా ఉందంటే అది స్వీడన్. అక్కడ 92 శాతం క్యాష్ లెస్సే. నగదు వాడకం అతి స్వల్పం 2020 నాటికి నూటికి నూరుశాతం క్యాష్‌లెస్ ఎకానమీగా మారడానికి స్వీడన్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ దేశంలో ఆరు లీడ్‌బ్యాంకులు క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ను నిరాకరిస్తున్నాయి. 1600 బ్యాంకు శాఖల్లో 900 చోట్ల నగదు చెల్లింపులు లేవు. ఏటీఎమ్‌ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తున్నారు. 2009లో దేశంలో 106 బిలియన్ల స్వీడిస్ క్రోన్లు ఉంటే 2014 నాటికి బిలియన్లకు తగ్గించారు. ఇప్పటికే డిజిటల్ మనీలో ప్రపంచం మొత్తానికి తలమానికంగా ఉన్న స్వీడన్ 2019 నాటికి జీడీపీలో నగదు శాతాన్ని 0.5కి తగ్గించడానికి చర్యలు చేపడుతోంది. స్వీడన్ లో క్యాష్ లెస్ ఎకానమీ వల్ల దొంగతనాలు, దోపిడీలు తగ్గిపోయాయి. ఒకప్పుడు బ్యాంకు దొంగతనాలకు స్వీడన్ ప్రసిద్ధి. కానీ.. ఇప్పుడు బ్యాంకుకు కన్నం వేయాలన్న ఆలోచన దొంగలకు కలలో కూడా రావడం లేదట. ఎందుకంటే నగదు రూపంలో ఎక్కడా డబ్బు ఉండడం లేదు. ఇళ్లలోనూ కార్డులే తప్ప క్యాష్ అన్నది లేక దొంగతనాలు పూర్తిగా ఆగిపోయాయి.

కెన్యాలోనూ అంతే.... జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నదైన కెన్యాలో చిన్నపిల్లలు తినే చాక్లెట్ల నుంచి ఎంత పెద్ద వస్తువునైనా నగదు ఇవ్వకుండానే కొనుగోలు చేస్తారు. వారు బ్యాంకుల ముఖం చూడరు. మౌలిక సదుపాయాల లేమితో బాధపడుతున్న కెన్యాలో ఈ డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది మన దగ్గర ఉన్న వొడాఫోన్ సంస్థే. ఎం-పెసా పేరుతో తీసుకొచ్చిన మొబైల్ మనీ విధానం ఇప్పుడు కెన్యాను క్యాష్ లెస్ కంట్రీగా మార్చేసింది. దీనిపై అవగాహన లేనివారికి అన్నీ వివరించి ట్రాన్జాక్షన్లు ఎంత సులభంగా చేయొచ్చో వివరించడానికి... నేర్పించడానికి ఎం-పెసా ఏజెంట్లే ఇంటికొచ్చి మరీ సేవలందిస్తారు. ఒక్క కెన్యాయే కాదు ఆఫ్రికాలోని నైజీరియా, సూడాన్ వంటివీ ఎం-పెసా అండతో క్యాష్ లెస్ పరుగులు తీస్తున్నాయి.

మనదేశంలో నల్లధనాన్ని నిరోధించేందుకు, నల్ల కుబేరుల భరతం పట్టేందుకు కేంద్రం ప్రభుత్వం అమలు చేసిన పెద్దనోట్లను రద్దు నిర్ణయం నెమ్మదిగా నగదురహిత ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు వేసేందుకు తోడ్పడుతోంది. ప్రజలు ఈ నెల రోజుల్లోనే నగదు రహితానికి మానసికంగా సిద్ధమైపోయారు. ఇక సాంకేతికంగా సిద్ధం కావడమే తరువాయి. ప్రజలు ఎవరికి వారు సాంకేతికంగా సిద్ధం కావడం ఒకెత్తయితే ప్రభుత్వాల పరంగా వారిని సమాయత్తం చేయడమూ అవసరమే.. ఇది అవగాహన, మౌలిక వసతుల మార్గంలో ఉండాలి.

125 కోట్ల జనాభాతో ఉన్న భారత్‌లో ఇంతవరకు 95 శాతం నగదు వాడకమే ఉంది. ఆ అయిదు శాతం ఆన్ లైన్ చెల్లింపులు కూడా గత రెండుమూడేళ్లలో పెరిగినవే. అయితే... పెద్ద నోట్ల రద్దు తరువాత ఈ ఆన్ లైన్ లావాదేవీలు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో ప్రజలు ఆన్ లైన్ షాపింగ్ కు అలవాటు పడినా అందులోనూ క్యాష్ ఆన్ డెలివరీకి ప్రిఫరెన్సు ఇచ్చేవారు. అంటే షాపింగ్ ఆన్ లైన్ అయినా చెల్లింపు నగదుతోనే సాగేది. అందుకే ఆన్ లైన్ షాపింగ్ శాతం పెరిగినా క్యాష్ లెస్ ఎకానమీ అంతగా కనిపించేది కాదు.. కానీ, ఇప్పుడా ధోరణి మారుతోంది. చేతిలో నగదు లేకపోతే అవసరాలకు తగ్గట్లు ప్రజలు మారుతారని తేలింది.

ఇప్పుడు క్యాష్‌లెస్ విధానానికి అలవాటు పడేలా చేయాలన్నది కేంద్రం ఆలోచన. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అందుకు సై అంటున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ కార్యకలాపాలు, స్వల్పస్థాయిలో మొబైల్ ఫోన్లలో చెల్లింపులు జరుపుతున్నప్పటికీ దీనిని విస్తృతం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ పల్లెలను తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు కూడా యుద్ధ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లిటరసీ పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. స్వచ్ఛంధ సంస్థలూ అందుకు సహకరిస్తున్నాయి.

ఇదే ఊపు కొనసాగితే భారత్‌లో నగదు మాయం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు. స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నమ్మకం ఏర్పడుతోంది. 2020 నాటికి 500 బిలియన్ డాలర్ల మొత్తం డిజిటల్ చెల్లింపులద్వారా సాగుతుందని గూగుల్, ద బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలో తేలింది. ఇంటర్నెట్ పర్సనల్ బ్యాంకింగ్‌కు ఇప్పటికే చాలా ఇళ్లలోకి వచ్చింది. దాదాపుగా ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒకరికిస్మార్టు ఫోన్ ఉంటోంది. నగదు చెల్లింపులకు కొత్తగా యాప్స్ రావడం, వాలెట్ విధానాలను వివిధ టెలికమ్ కంపెనీలు తీసుకురావడంతో మరిన్ని సౌలభ్యాలు వచ్చాయి. పేటిఎమ్, మొబిక్విక్, ఆక్సిజన్ వంటి వ్యాలెట్లూ జోరందుకున్నాయి. చిన్నచిన్న దుకాణాల్లో, ఆటోల్లో వీటితో పేమెంట్లు తీసుకుంటున్నారు. 4జీ కనెక్టివిటీని పెంచేందుకు అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంకేముంది... అన్నీ మంచి శకునములే... నగదు రహితానికి సూచనలే.

బ్యాంకింగ్‌ విస్తరణే పునాదిగా..

* గత దశాబ్ద కాలంలో దేశంలో బ్యాంకింగ్‌ రంగం అనూహ్యంగా విస్తరించింది. దీనికి తోడు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గత రెండేళ్లలో 25 కోట్లమంది కొత్తగా ఖాతాలు తెరిచారు.

* జనధన్‌ యోజన, నగదు బదిలీ తదితర కార్యక్రమాలు ఇందుకు వీలుకల్పించాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకూ బ్యాంకింగ్‌ రంగం దగ్గర కావటం ప్రత్యేకత.

* ఆర్‌బిఐ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1.32 లక్షల బ్యాంకు శాఖలు ఉండగా, ఇందులో 50,500 శాఖలు (దాదాపు 38 శాతం) గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

* దేశంలో ఇప్పుడు ప్రతి పదివేల జనాభాకు ఒక బ్యాంకు శాఖ ఉంది. ప్రతి 5,000 మందికీ ఒక ఏటీఎం కేంద్రం ఉంది.

* దేశంలో డెబిట్‌ కార్డులు వారి సంఖ్య గత నాలుగేళ్లలో రెట్టింపు అయింది. కార్డు స్వైపింగ్‌ మెషీన్లు (పీఓఎస్‌- పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ మెషీన్లు) రెట్టింపు కంటే మించి పెరిగాయి.

* ఆన్‌లైన్‌ లావాదేవీల సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. నెఫ్ట్‌ (నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్సఫర్‌) ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలు 2009-10లో రూ.4 లక్షల కోట్లు నమోదు కాగా, 2015-16 నాటికి ఇది రూ.83 లక్షల కోట్లకు పెరిగింది.

* మొబైల్‌ వ్యాలెట్‌ సదుపాయాన్ని బ్యాంకులు, కొన్ని ప్రైవేటు రంగ సంస్థలు విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి.