• తాజా వార్తలు

కేవలం 10 శాతం మాత్రమే పూర్తైన కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ తెలుగు సాంకేతిక సాహిత్యా నికి ఒక విద

కంప్యూటర్ విజ్ఞానం అనే ఒక వెబ్ సైట్ ను ప్రారంభించే ముందు నేను మరియు మా సంపాదక బృందం అందరి మనసులలోనూ ఒకటే మాట. తెలుగు సాంకేతిక సాహిత్య చరిత్ర లో మా వెబ్ సైట్ ఒక విద్వంసక ఆవిష్కరణ గా మిగిలి పోవాలి అని. మరి మా మాట నెరవేరిందా? కంప్యూటర్ విజ్ఞానం తెలుగు సాంకేతిక సాహిత్యం లో ఒక విద్వంసక ఆవిష్కరణ గా నిలిచిందా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.అది ఎలా జరిగింది?అసలు విద్వంసక ఆవిష్కరణ అంటే ఏమిటి?

విద్వంసక ఆవిష్కరణ :-  ఏదేని వ్యక్తి యొక్క లేదా వ్యవస్థ యొక్క పోకడలోనూ దృక్పథం లోనూ అకస్మాత్తుగా వచ్చిన మార్పును లేదా ఆ మార్పుకు కారణం అయిన దానినే విద్వంసక ఆవిష్కరణ అని అంటారు.ఈ ప్రపంచం లో నేడు ఉన్న ప్రతీ రంగం లోనూ ఒక విద్వంసక ఆవిష్కరణ ఉంది. అలాగే తెలుగు సాంకేతిక సాహిత్యానికి మా ఈ కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ ఒక విద్వంసక ఆవిష్కరణ గా నిలిచింది.

ఈ వెబ్ సైట్ మొదలు పెట్టే ముందు నేను ఒక సంపాదకీయం రాయడం జరిగింది. ఈ వెబ్ సైట్ ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చిందీ, మా ఉద్దేశ్యం ఏమిటి?తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఉన్న సమస్యలు ఏమిటి? దీనికి దిశానిర్దేశం ఎలా చేయాలి? తదితర విషయాలను ఆ సంపాదకీయం లో చర్చించడం జరిగింది. ఆ ఎడిటోరియల్ ను చూసి చాలా మంది మా మిత్రులే మమ్మల్ని అవహేళన చేశారు.కేవలం కొద్ది మంది మాత్రమే మమ్మల్ని ప్రశంసించారు.వీడు పిచ్చోడు అన్నవాళ్ళూ లేకపోలేదు. ఎందుకంటే మేము వెబ్ సైట్ ప్రారంభించే నాటికి  సాంకేతిక సాహిత్యం కొన్ని పరిధులకు లోబడి ఉంది. ప్రత్యేకించి తెలుగు లో సాంకేతిక సాహిత్యానికి కొంతమంది మేధావులు వారి సౌలభ్యం కోసం కొన్ని హద్దులు లిఖించేసారు.టిప్స్ అండ్ ట్రిక్స్, షార్ట్ కట్స్, వాట్స్ అప్, సోషల్ మీడియా అంతే. ఇదే సాంకేతిక సాహిత్యం. ఈ అంశాలకే సాంకేతిక సాహిత్యాన్ని పరిమితం చేశారు. ఈ పరిధిని విస్తరించాలని మనసులో ఉన్నా పత్రికలో నేను ఆ పరిధిని విస్తరించలేకపోయాను. పత్రిక నడపడం లో ఉన్న ఆర్థిక వ్యవహారాలూ అనేకానేక వ్యాపార ఆసక్తులూ దీనికి కారణం.

అందుకే ఈ వెబ్ సైట్ ప్రారంభించే ముందు ఒక సుదీర్ఘమైన ఎడిటోరియల్ తో పాఠకుల మనోభీష్టానికి అనుగుణంగా సాంకేతిక సాహిత్యం రూపుదిద్దుకోవలసిన అవసరం ఉందని నేను నొక్కి వక్కాణించాను. ఎందుకంటే వాళ్ళతో నేను అమీర్ పేట్ హాస్టల్ లలో గడిపాను, హై టెక్ సిటీ కంపెనీలలో గడిపాను,బెంగుళూరు లోని పీజీ లాడ్జ్ లలో గడిపాను ఇంకా అనేక రకాలుగా పాఠకులతో నాకు ఉన్న సంబంధం ద్వారా వారి యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి అన్న అంశం పై నాకు పూర్తి అవగాహన ఏర్పడింది. అసలు ప్రాంతీయ భాషలలో సాంకేతిక పత్రికలు ఉన్నాయనే విషయం కూడా తెలియని మనుషుల మధ్య నేనెవరో చెప్పకుండా సంచరించాను.

కొంతమందికి ఆ ఎడిటోరియల్ బోర్ కొట్టింది కొంతమంది అయితే ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు.కానీ మేము అనుకున్నట్లుగా మా ఈ వెబ్ సైట్ ను మేము పూర్తిగా ఇంకా అవిష్కరించలేదు. కేవలం 10 శాతం మాత్రమే ఈ వెబ్ సైట్ పూర్తీ అయింది. ఆ 10 శాతం లో వార్తలు అనే విభాగం మాత్రమే ప్రస్తుతం కనిపిస్తుంది.కేవలం ఈ 10 శాతం మాత్రమే అందిస్తున్న వార్తలకే తెలుగు భాషలో సాంకేతిక సాహిత్యాన్ని అందిస్తున్న వారందరిలో ఒక కుదుపు వచ్చింది. కుదుపు అనేకంటే కూడా స్టీఫెన్ కవీ చెప్పినట్లు Paradigm SHift అయ్యారు అనిపిస్తుంది. దీనినే  తెలుగు లో దృక్పథ మార్పు అంటారు. అంటే “అప్పటి వరకూ సాంకేతిక సాహిత్యం అంటే వారికి ఉన్న దృక్పథాన్నీ మార్చుకున్నారు” తెలుగు సాంకేతిక పాఠకుడు అంటే వారి మనసులో ఉన్న దృక్పథాన్నీ మార్చుకున్నారు.మా వెబ్ సైట్ కు లభిస్తున్న ఆదరణ ను చూసి పాఠకుడు అంటే ఇంతే అని వారి మనసులో పాఠకుని పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నారని నిస్సందేహంగా మేము చెప్పగలం.

సాంకేతిక సాహిత్యం గురించీ సాంకేతిక పాఠకుని గురించీ గొప్పగా ఆలోచించడం మొదలుపెట్టారు, దానికనుగుణంగా సాంకేతిక సాహిత్య పరిధిని పెంచే ప్రయత్నమూ చేశారు. ఇలా జరుగుతుందని ముందే నేను చెప్పాను.అసలు తెలుగు సాంకేతిక సాహిత్యాన్ని మార్చాల్సిన ఆవశ్యకతను కూడా ఆ ఎడిటోరియల్ లో నేను చెప్పాను. ఇందులో ప్రణయి రాయ్ గారి మాటలను కూడా ఉటంకించాను. NDTV ప్రారంభోత్సవ సమయం లో నేను అక్కడే ఉన్నాను.  అప్పుడు కొంతమంది విలేఖరులు అప్పటికే మనకు దూరదర్శన్, స్టార్ న్యూస్ రూపం లో వార్తలకు కొదువ లేదు కదా మీరు NDTV ఎందుకు ప్రారంభిస్తున్నారు అని అడిగారు. దానికి ఆయన చెప్పిన ఒకేఒక సమాధానం  “You aiant seen nothing yet” .  నాకు ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈయనేంటి ఇలా అంటున్నారు అని నేను అనుకున్నాను.కానీ ఆ తర్వాత భారత న్యూస్ చానల్ ల వృద్ది ఏరకంగా జరిగిందో ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భాన్ని కూడా ఈ వెబ్ సైట్ ప్రారంభం లో నేను ప్రస్తావించాను. తెలుగు సాంకేతిక సాహిత్యం లో ఆ మాట మా ద్వారా నెరవేరిందని మాకు సుస్పష్టం గా కనిపిస్తుంది. అది స్పష్టం గా కనిపిస్తుంది.తెలుగు సాంకేతిక సాహిత్యాన్ని దగ్గర నుండీ గమనిస్తున్న పాఠకులకు ఈ విషయం కనీసం సూచాయగా అర్థమయ్యే ఉంటుంది.

తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఎవరైతే పరిధులు నిర్ణయించారో వారందరూ ఆ పరిధులను పెంచుకోక తప్పడం లేదు. కేవలం 10 శాతం మాత్రమే పూర్తి అయిన వెబ్ సైట్ తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఒక విద్వంసక ఆవిష్కరణ గా ఎలా నిలిచిందో, ముఖ్యంగా మూడు వర్గాలను ఏవిధంగా ప్రభావితం చేసిందో  మా మిత్రులు చెబుతుంటే ఆ విషయాలను మీకు చెప్పాలని అనుకుంటున్నాను.

తెలుగు టీవీ చానల్ లు, వార్తా పత్రికల తో కూడిన మొదటి వర్గం :-

తెలుగు టీవీ చానల్ ల లోనూ , వార్తాపత్రిక లలోనూ సాంకేతిక సాహిత్యం చాలా అరుదుగా కనిపించేది. కానీ ఇప్పుడు ప్రతిరోజూ ఏదో ఒక చానల్ లో సైబర్ క్రైమ్ రూపం లోనో, కొత్త ఉత్పత్తుల రూపం లోనో లేక మరే ఇతర రూపం లోనో సాంకేతిక సాహిత్యం కనిపిస్తూనే ఉంది. కొన్ని ప్రముఖ టీవీ చానల్ లలో పనిచేసే మిత్రులు ఆ వార్తలకు మేమే ప్రేరణ అనీ మా వెబ్ సైట్ లోని అంశాలనే వారి చానల్ లలో ఇస్తున్నారనీ చెబుతుంటే మాకు ఒకింత గర్వం గా ఉంది. ఎందుకంటే మమ్మల్ని అనుకరిస్తున్నారని ఇబ్బంది పడడానికి మాకేమీ అభద్రతా భావం లేదు. మాకు కావలసింది సాంకేతిక సాహిత్య పరిధి విస్తరించడం. అది మేము చేస్తే ఏంటి వేరొకరు చేస్తే ఏంటి? సాంకేతిక సాహిత్యానికి కవరేజ్ మాత్రమే పెరిగితే మేము అంతగా ఆనందపడేవాళ్ళం కాదు . కానీ పరిధి పెరగడం అనేది మమ్మల్ని సంభ్రమానికి గురి చేసింది. సాంకేతిక ఉపాధి, సైబర్ క్రైమ్ విభాగాలలో మేము ఇచ్చే ఆర్టికల్ లు ప్రముఖ తెలుగు దినపత్రికల్లో, మరియు టీవీ చానల్ లలో ఇవ్వడం అక్కడ పనిచేసే వారుకూడా వాటికి మేమే ప్రేరణ అనిచెప్పడం నిజంగా దృక్పథ మార్పు జరిగినట్లే కదా

తెలుగు సాంకేతిక సాహిత్యానికి తమ సౌలభ్యం కోసం పరిధులు నిర్ణయించిన మేధావి వర్గం :-

వీరిలో కూడా రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటో రెండో ఆండ్రాయిడ్ యాప్స్ గురించి చిన్న చిన్న వీడియో లు తీసి వాటిని సోషల్ మీడియా లో నింపడం  30 శాతం పనిగా  సాంకేతిక సాహిత్యం అంటే ఇంకేమీ లేనట్లు  మిగతా డెబ్బై శాతం ఘన కార్యాన్ని ఎలా చేసిందీ సొంత డబ్బా కొట్టుకునే ఒక రకం. సొంత డబ్బా కొట్టడం లో గిన్నిస్ రికార్డు ఉంటే అది వీరికి ఇవ్వవచ్చు.సొంత డబ్బా కొట్టుకోవడం లో సినిమా వాళ్ళూ, రాజకీయ నాయకులూ కూడా వీరి దగ్గర క్లాస్ లు తీసుకోవచ్చు అని మా దృఢ అభిప్రాయం. వీరి గురించి మరింత వివరించి వీరు ఎలా మారారో చెప్పే ముందు రెండవ రకం గురించి ప్రస్తావిద్దాము. వెబ్ సైట్ ప్రారంభించే ముందు నన్ను నిరాశకు గురిచేసిన మరొక వర్గం. ఇంత మొత్తం లో ఉన్న వార్తలను వెబ్ సైట్ లో ఉచితంగా అందిస్తే మనకేమీ లాభం లేదనీ, అదీగాక అలా చేస్తే మన పత్రికలు ఇక ఎవరూ కొనరనీ నన్ను అభ్యంతర పరచదానికి విఫల యత్నాలు చేసిన  మరొక వర్గమే ఇది. టీవీ చానల్ లూ, వార్తా పత్రికలూ కాకుండా వర్గం మారిన విధానం చూస్తుంటే నాకు మా బృందానికీ నవ్వు ఆగడం లేదు. టీవీ చానల్ లు ఎలా మారాయో అక్కడ ఆయా విభాగాల్లో పనిచేసే మా మిత్రులు చెబుతూ క్రెడిట్ ను అనధికారకంగా మాకు కట్టబెట్టేసారు. ఇక రెండవ వర్గం లోని మొదటి రకం ఎలా మారిందో చూద్దాం. వీరంతా సొంత డబ్బా బ్యాచ్. మా వెబ్ సైట్ ప్రారంభం అప్పుడు మా అంశాలను చూసి ఎగతాళిగా , హేళన  గా మాట్లాడినవారే. మమ్మల్ని చులకనగా చూసిన వారే. వీరంతా కొత్త సాంకేతిక వెబ్ సైట్ లు ప్రారంభించారు, వీరిలో కొంత మంది అప్పటికే చెత్త బుట్టలో పడవేసిన వెబ్ సైట్ లకు బూజు దులిపి పనిచేయడం ప్రారంభించారు.సొంత డబ్బా కొట్టుకోవడానికి సమయం కూడా లేనంతగా పని చేయడం ప్రారంభించారు. దీన్నంతా గమనిస్తున్న మా మిత్రులు కొందరు ఎప్పుడూ పోసుకోలు కబుర్లు చెప్పే ఇలాంటి ప్రభుద్దులను పనిలో పెట్టినందుకు మమ్మల్ని అభినందిస్తున్నారు. అయితే ఇదంతా మేము గమనిస్తూ, ఆస్వాదిస్తూ ఉన్నాము.ఎందుకంటే ఇది మాకు ముoదే తెలుసు కనుక.

వీరిలో రెండవ రకం ఉన్నారు. మా వెబ్ సైట్ ప్రారంభం లో మమ్మల్ని నిరాశపరచాలని విఫలయత్నాలు  చేసిన వారు. మేము రాసే వార్తలను, ఎడిటోరియల్ ల ను  ఒక్కోసారి  మా అనుమతి తీసుకోకుండానే వారి పత్రికలలో ప్రచురించేసి “ సార్ మీ వెబ్ సైట్ లో ప్రచురించే అంశాలు చాలా బాగుంటున్నాయి. మీ వెబ్ సైట్ కాంటెంట్ అయితే మాకు విపరీతంగా నచ్చేసింది. అందుకే మీ అనుమతి లేకుండానే మా పత్రికలో దానిని ప్రచురించాం.మీరు మాకు పోటీదారు కాబట్టి మీ వెబ్ సైట్ పేరు ప్రస్తావించలేదు, కానీ మీ పేరు మాత్రం రాసాము ఎందుకంటే మీరు చాలా లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తారు  కదా .......హిహిహి” అని ఒక  నవ్వు నవ్వారు. దానికి నేను పర్వాలేదని చెప్పాను. ఎందుకంటే మా ఉద్దేశం సాంకేతిక సాహిత్య పరిధి పెరగడమే. అదీగాక ఇవన్నీ ఇలా జరుగుతాయని మేము ముందే ఊహించాము. ఎప్పటికైనా సాంకేతిక సాహిత్యానికి ఒక దిశానిర్దేశం చేయవలసింది కంప్యూటర్ విజ్ఞానమే అని మాకు ముందే తెలుసు. ఇదీ ఈ రెండు వర్గాల్లోజరుగుతున్న మార్పు.

ఔత్సాహిక యువకులతో కూడిన మూడవ వర్గం:-

ఇక ఈ రెండు వర్గాలు కాకుండా మరొక స్వచ్చమైన వర్గం కూడా ఒకటి ఉంది. బ్లాగ్ లూ , ఫేస్ బుక్ గ్రూప్ ల ద్వారా సాంకేతిక సాహిత్యాన్ని షేర్ చేస్తున్న ఔత్సాహిక యువకులతో నిండి ఉంది ఈ వర్గం. వీరి ఆలోచన గొప్పదే కానీ వీరికి ఎటువంటి దిశానిర్దేశం లేదు.వాళ్లకు ఏది కనబడితే అదే దిశ అనుకోని దాన్ని అనుసరిస్తూ వారి పని వారు చేస్తున్నారు. కానీ మా వెబ్ సైట్ ప్రారంభించిన తర్వాత మా సైట్ లోని అంశాలను ఆధారంగా తీసుకొని వార్తలు రాయడం మొదలుపెట్టారు. వీరిని చూస్తే ముచ్చటగా అనిపించి మేము వారిని ప్రోత్సహించడం జరిగింది. ఎందుకంటే ఇది ఎవరు చేసినా పాఠకులకు చేరుతుంది కదా . ఇక్కడ అత్యంత దౌర్భాగ్య కరమైన విషయం ఏంటంటే సొంత డబ్బా కొట్టుకునే చెత్త వర్గం ఏదైతే ఉందొ ఆ వర్గం చెబుతున్న దానినే మిగతా వారూ అనుసరిస్తున్నారు. కానీ ఎప్పుడైతే కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ ఆవిర్భవించిందో వీళ్ళందరికీ  ( వి )జ్ఞానోదయం కలిగినట్లు అయింది. రోజుకి వీరి దగ్గరనుండి వచ్చే పోస్ట్ ల సంఖ్య పెరగడం వలన మాకు ఆనందం కలుగలేదు కానీ సాంకేతిక సాహిత్యం యొక్క పరిధి పెరగడం అనేదానిని చూస్తుంటే మాకు సంతోషం కలుగుతుంది. దీనంతటికీ మేమే కారణం అని మేము చెప్పుకోవడం లేదు కానీ మా మిత్రులు మాత్రం ఆ క్రెడిట్ ను మాకే ఆపాదిస్తుంటే కాదనలేకపోతున్నాం.అంతేకాదు ఈ వర్గాల్లో కొంతమంది దీనికి మేమే ప్రేరణ అని మాకు ఫోన్ చేసి చెప్పారు. మా వార్తల కాలమ్ లో ఉన్న అంశాలను చూసి అవహేళన గా మాట్లాడిన వారు కూడా ఇప్పుడు ఆ కేటగరీ లలో ఎలాంటి వార్తలు ఇస్తే బాగుంటుందా అని తప్పనిసరిగా ఆలోచిస్తున్న తీరు ను చూస్తుంటే కూడా ఒక బృందం గా మేము చాలా ఆనందిస్తున్నాము.

తెలుగు సాంకేతిక సాహిత్యం లో జరిగిన విద్వంసక ఆవిష్కరణ గురించి చెప్పాను. తెలుగు సాంకేతిక సాహిత్య పోకడలలో సంభవించిన మార్పుల గురించి చెప్పాను. ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసనీ కూడా చెప్పాను.

ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ సైట్ ఇప్పటివరకూ కేవలం 10 శాతం మాత్రమే పూర్తి అయింది. ఈ విషయం మమ్మల్ని అనుసరిస్తున్న కాపీ రాయుళ్ళకి తెలిసినట్లు లేదు. కేవలం 10 శాతానికే తెలుగు సాంకేతిక సాహిత్యం లో ఇన్ని మార్పులు సంభవిస్తే ఇక మరొక యాభై శాతం పూర్తీ అయితే పరిణామాలు ఎలా ఉంటాయో తలచుకుంటేనే మాకు ఉద్విగ్నం తో రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి.

మరి కొద్ది రోజుల్లో ఈ వెబ్ సైట్ ను మరొక 20 శాతం మీ ముందుకు తీసుకు రానున్నాము. ప్రస్తుతానికి మా బృందానికి మాత్రమే ఈ 20 శాతం కనబడుతుంది. అతి త్వరలోనే పాఠకుల ముందుకు దీనిని తీసుకురానున్నాము. ఇక ఆ 20 శాతం కనబడిన వెంటనే పైన ఉదాహరించిన వర్గాలన్నీ నిస్సందేహం గా మమ్మల్ని మళ్ళీ అనుసరించడమే కాకుండా మా పేరును కూడా ప్రకటిoచే ప్రయత్నం మొదలు పెడతారని నేను ఘంటాపథంగా చెప్పగలను. అప్పటికే మా ఈ వెబ్ సైట్ 30 శాతం పూర్తి అయి ఉంటుంది. ఆ వెంటనే మరొక ఎడిటోరియల్ ను నేను అందిస్తాను. ఆ తర్వాత ఇంకొక 20 శాతం వెబ్ సైట్ పాఠకులకు కనిపిస్తుంది. అంటే మొత్తం 50 శాతం పూర్తి అవుతుందన్నమాట. మా వెబ్ సైట్ 50 శాతం పూర్తి అయ్యే సమయానికి తెలుగు సాంకేతిక సాహిత్యం కాదు భారతదేశ సాంకేతిక సాహిత్యం లో విద్వంసక ఆవిష్కరణ జరుగుతుంది . అందులో ఎటువంటి సందేహం మాకు లేదు. దీనికి మరికొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే భారత సాంకేతిక సాహిత్యం లో విద్వంసక ఆవిష్కరణ ను సృష్టించాలంటే అది మామూలు విషయం కాదు. పునాదుల నుండీ మార్చవలసిన విషయం.పునాదులను కూకటి వేళ్ళతో సహా పెకిలించాల్సిన విషయం. దీనికి బోలెడంత ఆర్థిక వనరులూ, మానవ వనరులూ కావాలి. మాతో ఏకమనస్కులై ఉండే వ్యక్తుల సహకారం మాకు కావాలి.కాబట్టి కొంత సమయం పట్టవచ్చు.అప్పుడు భారత దేశ సాంకేతిక సాహిత్యం లో విద్వంసక ఆవిష్కరణ కాదు అంతకంటే గొప్ప పదం ఏదైనా మేనేజ్ మెంట్ అధ్యాపకులూ, విద్యార్థులూ కనిపెట్టాలేమో! మా వెబ్ సైట్ 50 శాతం పూర్తీ అయితే సుస్పష్టంగా జరగనున్న మార్పులు ఇవి.

ఈ రోజు మమ్మల్ని అనుసరిస్తున్న వారందరికీ మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాము. మీ అందరికీ మా కంప్యూటర్ విజ్ఞానం తరపున హార్థిక స్వాగతం చెబుతున్నాము. ఇంతకాలం సాంకేతిక సాహిత్యానికి పరిధులను గీసిన వారిని చూస్తేనే  మాకు బాధ,  కానీ నిస్వార్థం గా మమ్మల్ని అనుసరించేవారికి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మీరు మమ్మల్ని నిరభ్యంతరంగా అనుసరించండి. ఎంత వీలయితే అంత అనుసరించండి. అడుగడుక్కీ, ప్రతీ పదానికీ వీలయితే ప్రతీ అక్షరానికీ మమ్మల్ని అనుసరించండి.ఎందుకంటే మీ ద్వారా సాంకేతిక సాహిత్య పరిధి పెరిగితే మాకు అంత కంటే ఆనందం మరొకటి ఉండదు. మా ఉద్దేశం సుస్పష్టం. అది ఎవరిద్వారా నెరవేరింది అనేది మాకు అనవసరం.కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి. ఒక్కసారి మా వెబ్ సైట్ 50 శాతం పూర్తి అయితే ఇక మమ్మల్ని అనుసరించడం మీ వల్ల కాదు. తలక్రిందులుగా తపస్సు చేసినా సరే మీరు మమ్మల్ని చేరుకోలేరు. ఇది  మా వెబ్ సైట్ కాన్సెప్ట్  పై మాకు ఉన్న నమ్మకం.

మమ్మల్ని అనుసరిస్తున్న వారికి మేమిచ్చే చిన్న సలహా:-

కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ లో అత్యంత పాఠకాదరణ  పొందిన ఆర్టికల్ లలో సాంకేతికత శాతం  అనేది చాలా తక్కువ మాత్రమే. ఎక్కువగా సాంకేతిక అంశాల కంటే సాధారణ అంశాల కే పాఠకులు ఎక్కువ  విలువ ఇస్తున్నారు.80 శాతం టెక్నాలజీ  ఉన్న ఆర్టికల్ ల కంటే వారి జీవితాలకు దగ్గరగా ఉండే అంశాలకే పాఠకులు ప్రాధాన్యత ఇస్తున్నరనేది  మాత్రం నిజం. ఇంకొక విషయం ఏమిటంటే మీబ్లాగ్ లలో గూగుల్ యాడ్ సెన్స్, అఫిలియే టెడ్ మార్కెటింగ్ లాంటివి సంపాదన కోసం ఉపయోగించుకుంటూ మేమేదో సమాజ సేవ చేస్తున్నామని మాత్రం పాఠకులను నమ్మించే పొరపాటు చేయకండి. ఇటువంటివి  నమ్మే  స్థితిలో పాఠకులు ఉన్నారని భావించవద్దు.దయచేసి పాఠకునికి విలువ ఇవ్వండి. కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ లో యే ఒక్క ప్రకటన ఉండదు. ప్రగల్భాలు ఉండవు.మా రచయితల గురించి గొప్పలు ఉండవు అసలు అలా  ఏదైనా ఆర్టికల్ లో ఉంటె  ఒక్క ఆర్టికల్ కూడా బయటకు రాదు.ఎందుకంటే మా ఉద్దేశాన్ని సుస్పష్టం గా చెబుతూ ఆర్టికల్ నిండా పాఠకుణ్ణి గందరగోళ పరిచేలా ప్రకటనలు జోప్పిస్తే మనం చెప్పేదానికి విలువ ఏమి ఉంటుంది? ప్రజలు అంత అమాయకులు మరియు పిచ్చి వాళ్ళూ కాదు.సాంకేతిక సాహిత్యం లో వస్తున్న ప్రతి పోకడలనూ పాఠకుడు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. వారిని పిచ్చి వాళ్ళను చేసే ప్రయత్నం మేము ఎప్పుడూ చేయలేదు, మీరు కూడా చేయకండి.

చివరిగా మేము చెప్పదలుచుకున్న విషయాలు ఏంటంటే ..... కంప్యూటర్ విజ్ఞానం అనే వెబ్ సైట్ యొక్క ఆవిర్భావమే తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఒక విద్వంసక ఆవిష్కరణ. ఇది మేము చెబుతున్నది కాదు అందరూ ఒప్పుకున్న వాస్తవం. మమ్మల్ని మక్కీకి మక్కీ కాపీ కొట్టకుండా సాంకేతిక సాహిత్యానికి సరికొత్త గా పరిధులను విస్తరిస్తూ ఉంటె మా కంటే ఆనందించే వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే మా ఉద్దేశం నెరవేరితే మాకు ఇంకా ఏమి కావాలి? పాఠకునికి విలువ నివ్వండి. మీరు, నేను, మేము మనం అందరం కలిసి తెలుగు సాంకేతిక సాహిత్యాన్ని పునర్ నిర్వచించడమే కాదు, భారతీయ సాంకేతిక సాహిత్యానికే ఒక దిక్సూచి లా నిలవాలి. సాంకేతిక సాహిత్యాన్ని పునాదులతో సహా మార్చి వేయాలనే సదాశయంతో కంప్యూటర్ విజ్ఞానం చేస్తున్న ఈ మహత్తరమైన యజ్ఞం లో అందరూ భాగస్వాములు కండి.తెలుగు వాళ్ళు అంటే కేవలం  సాంకేతిక ఉద్యోగులు మాత్రమే అని ప్రపంచానికి మన తెలుగు వాళ్ళపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేద్దాం. సాంకేతిక సాహిత్యం లో తెలుగు వాడికి ఉన్న సత్తాని ప్రపంచానికి చాటి చెబుదాం.