• తాజా వార్తలు

తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఆద్యుడు పాలకొడేటి సత్యనారాయణ గారి అనుభవాలు

తను ఉద్యోగినే ఆద్యుడు రామోజీరావు గారు అంటున్న ఆయనకు

మా వినమ్రతా పూర్వక పాదాబివందనం

కంప్యూటర్ విజ్ఞానమే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. ఎవరూ కాదనలేని సత్యమిది. నిత్య జనజీవనం లోని ఏ రంగం లోనైనా కంప్యూటర్ ల పాత్ర అనన్యం. ఎక్కడ ఏ చోట చూసినా మనకు ఏదో ఒక రూపంలో కంప్యూటర్ లు, వాటి రూపాంతరాలూ మనకు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఇకపైనా వీటి ప్రభావం పెరుగుతూనే ఉంటుంది. కన్ను మూసి తెరిసే లోగా కంప్యూటర్ ల రంగం లో ఏదో ఒక కొత్త ఆవిష్కారం మనల్ని అబ్బురపరుస్తూ ఉంటుంది.మానవజాతి వర్తమానాన్నే కాదు, భవితవ్యాన్ని సైతం కంప్యూటర్ విజ్ఞానమే శాసిస్తూ ఉందనేది నిర్వివాదాంశం. అయితే ఒక పాతిక ముప్పై ఏళ్ల క్రిందట కంప్యూటర్ ల ఈ విశ్వ రూపాన్ని ఊహా మాత్రంగానైనా దర్శించగలిగిన వారు అతికొద్దిమందే ఉండేవారంటే అతిశయోక్తి కాదు. అలాంటి ద్రష్ట లలో ఒకరు శ్రీ రామోజీరావు గారు. ‘ఈనాడు’ దినపత్రిక స్థాపకులుగా, సంపాదకులుగా ఆయన చేస్తున్న సేవ అంతా తెలుగుజాతి చేసుకున్న పుణ్యఫలం. రేపటి ప్రపంచాన్ని కంప్యూటర్ రంగమే ఏలుతుందని పసిగట్టి. తమ ఈనాడు దినపత్రికలో ప్రతీ సోమవారం నాడు కంప్యూటర్ విజ్ఞాన ప్రచారం , అవగాహనలకోసం ‘ కంప్యూటర్ చిప్ చాట్’పేరిట ఒక పూర్తి పేజీని కేటాయించి, తెలుగుజాతి, తెలుగు యువత దృష్టిని అటు మళ్లించిన మహానుభావుడాయన. ఈనాడు ప్రపంచం లోని దేశదేశాల్లో కంప్యూటర్ విజ్ఞాన రంగం లో తెలుగుప్రతిభ,ప్రభ వెల్లివిరుస్తుందంటే ........ అప్పుడెప్పుడో వారు వేసిన పునాది కొంతవరకూ కారణమేనని చెప్పాలి.


ముందుచూపుతోనే ముందడుగు :


‘కంప్యూటర్’ విజ్ఞాన రంగం గురించి ఒక స్పెషల్ పేజి ప్రచురించాలని చైర్మన్ గారు (  శ్రీ రామోజీరావు గారు ఈనాడు సంస్థలకు చైర్మన్ అన్నది అందరికీ తెలిసిందే, వారిని సంస్థలోని వారంతా ‘చైర్మన్ గారు’ అని వ్యవహరించడo  ఆనవాయితీ) భావిస్తున్నారని శ్రీ రఘు కిదాంబి  గారు నాకు చెప్పారు. అప్పటికే నేను ‘ఈనాడు’ దినపత్రికలో ‘భూభ్రమణం’ ‘జ్ఞాననేత్రం’ వంటి శీర్షికలతో పాటుగా ‘ఈనాడు ఆదివారం’ పత్రికలో కవర్ పేజి లకు ప్రత్యేక వ్యాసాలు, స్త్రీల ఆరోగ్యం, సైన్సు పేజీ వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని. చెప్పుకోకూడదు కానీ, ‘ఈనాడు’ సంస్థ లో నాకు ఒక ప్రత్యేక స్థానం కూడా ఉండేది. దానికి నా పట్ల చైర్మన్ గారికి గల అవ్యాజా నురగాలే కారణం. ఏ కొత్త పని వచ్చినా, చైర్మన్ గారు నాకు ముందుగా అవకాశం ఇచ్చేవారు. అదేక్రమంలో ‘కంప్యూటర్’ ప్రత్యేక పేజీ అవకాశం కూడా నాకే వచ్చింది. ‘ఈనాడు’ దినపత్రికలో ప్రతీరోజూ నేను ‘జ్ఞాననేత్రం’ శీర్షికను విజయవంతంగా నిర్వహిస్తూఉండడం ఒక కారణమైతే, నేను సైన్సు లో పోస్ట్ గ్రాడ్యుయేట్ (భూ భౌతికశాస్త్రం) కావడం మరో కారణం అయి ఉండవచ్చు. అప్పట్లో శ్రీ రఘు కిదాంబి గారు ‘ఈనాడు’ సంస్థలో అడ్వైజర్ గా, చైర్మన్ గారికి తలలో నాలుకలా పనిచేసేవారు. రఘుకిదాంబి గారు ఈ పేజీ గురించి చెప్పిన తర్వాత, పేజీకి పేరు పెట్టె పనినుంచీ, పేజీలో ఏమేమి రావాలి, పేజీ మేకప్ ఎలా ఉండాలి అనే అనేక అంశాలలో నేను, శ్రీ రఘు కిదాంబి గారు చైర్మన్ గారి ఆదేశాలను, మార్గదర్శకత్వాన్నీ తీసుకున్నాము. పేజికి పేరును ఆలోచిస్తున్న తరుణంలో ‘కంప్యూటర్ చిప్ చాట్’ అనే పేరును నా శ్రీమతి అనూరాధ సూచించింది. వేరే కొన్ని పేర్లతో కలిసి, నేను ‘కంప్యూటర్ చిప్ చాట్’ పేరునూ చైర్మన్ గారి ముందు ఉంచాను. ఆ పేరు చూడగానే చైర్మన్ గారు ‘ఇది బాగుంది కదా.. దీనిని ఫైనలైజ్ చేద్దాం’ అన్నారు. దాంతో పేజికి నామకరణం జరిగింది. ఇక చేయాల్సిందల్లా, పేజిలో ఏ ఏ అంశాలను ఎలా పాఠకులకు అందించాలనే విషయమై చర్చలు సాగాయి. ‘అసలే కంప్యూటర్ లది కొత్త రంగం, మనం ప్రచురించే పేజీ అందరికే ఈ రంగంపై ఆసక్తి కలిగించేలా ఉండాలే తప్ప భయాన్నీ,’ఈ పేజీ మనకెందుకులే’ అన్న భావననూ కలిగించకూడదు.. దీనికోసం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రతా ఏదైనా ఉందీ అంటే, అది ఈ పేజీ లో ఏ వ్యాసమూ వారాల తరబడి సీరియల్ లాగా రాకూడదు.అన్న పరిధిని చైర్మన్ గారు నిర్దేశించారు. పాఠకుల అవసరాలను గుర్తించడంతో పాటు వారి అభిరుచినీ, వారి పరిధులను కూడా ముందే గుర్తించి, వాటిని తమ సంస్థలోని అందరికీ చక్కగా వివరించి చెప్పడం వల్లనే ‘ ఈనాడు’లో ఏ పేజీ అయినా అంతచక్కగా రూపొందుతుందనేది వాస్తవం. ‘ కంప్యూటర్ చిప్ చాట్ ‘ పేజీలో ఏయే అంశాలు ఉండాలనే విషయమై నాకు చైర్మన్ గారితో పాటు శ్రీ రఘు కిదాంబి మార్గ నిర్దేశకత్వం చేశాక, నేను ‘ఈనాడు’ కార్యాలయంలోనే ఉన్న ‘మార్గదర్శి కంప్యూటర్స్’ సంస్థ జనరల్ మేనేజర్ శ్రీ కొల్లూరి సత్యానందం గారిని కలుసుకున్నాను. కంప్యూటర్ ల గురించి వారు నాకు ప్రాథమిక అవగాహనను కలుగజేశారు. దానికితోడు,’కంప్యూటర్ చిప్ చాట్’ పేజీ లకు నిపుణుల చేత కొన్ని వ్యాసాలను ప్రత్యేకంగా రాయించే భాద్యతను కూడా వారు తీసుకున్నారు. ఆ నిపుణులు ఇంగ్లీష్ లో రాసే వ్యాసాలను తెలుగులోనికి సరళంగా అనువదించడంతో పాటు, ఇతర అంశాలను సమకూర్చుకోవడం, తెలుగులో రాయడం, పేజీ ని ఆకర్షణీయంగా రూపొందించడం నా వంతు అయింది.  అదే సమయంలో, పూర్తిగా సాంకేతిక అంశాలతో ఉండే కంప్యూటర్ చిప్ చాట్ పేజీ ని జనసామాన్యానికి ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుతూ, వారి ఆదరణను పొందితే తప్ప కంప్యూటర్  పేజీకి నిలకడ ఉండదనీ,ఆశించిన ప్రయోజనం సిద్ధించదనీ మేం భావించాం. అందుకే మేము ‘ఈనాడు’ దినపత్రికలో ప్రతి రోజు కార్టూన్ లు వేసే శ్రీధర్ కార్టూన్ లను సైతం ప్రతీవారం ఒకటి చొప్పున  గురించి ఆకర్షణీయ వ్యంగ్యాస్త్రలుగా కార్టూన్ లను ప్రత్యేకంగా వేయించాలనే ఆలోచన వచ్చింది. నిత్యం ఎంతో పని ఒత్తిడి లో ఉండే శ్రీధర్ గారు, నా మీద గల ఆదరం తోనూ, మిత్ర ధర్మం తోనూ ఆమోదించారు. ‘కంప్యూటర్ చిప్ చాట్ ‘ పేజీ ప్రచురణకు కావాల్సిన వనరులన్నీ ఇలా సిద్దం చేసుకున్నాక డమ్మీ పేజీని సిద్దం చేసి చైర్మన్ గారి ముందు ఉంచాము.ఏ మార్పులూ లేకుండా, చైర్మన్ గారు ఆమోదించడం తో, పేజీని ప్రచురణకు పంపడానికి చైర్మన్ గారి అనుమతిని తీసుకున్నాం. అలా తెలుగు పత్రికా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి పూర్వ రంగం సిద్ధం అయింది.  కొత్త రంగం అనడం దేనికి అంటే, అంతక్రితం ఎన్నడూ ఏ తెలుగు పత్రికలోనూ ఒక సాంకేతిక రంగానికి ఇంతటి పెద్ద పీటను వేసి, ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయించిన ఘనత మరే పత్రికకూ లేకపోవడమే! ఎప్పుడో ఒకప్పుడు సందర్భానుసారంగానో, ప్రత్యేక అవసరం దృష్ట్యా నో ఒకటి రెండు వ్యాసాలను తెలుగు దిన,వార,పక్ష,మాస పత్రిలు ప్రచురించి ఉండవచ్చేమో కానీ, ఇలా ఒక ప్రత్యేక పేజీని రూపకల్పన చేసి, నిరంతరాయంగా కొన్నేళ్ళపాటు ఒక సాంకేతిక విశేషంఅంశాలతో పేజీని నడపడం తెలుగులో కంప్యూటర్ చిప్ చాట్ తోనే ఆరంభం.ఆ తర్వాత, చాలా దినపత్రికలలో ఇదే ఒరవడిలో కంప్యూటర్ పేజీలను ఆరంభించాయనేది అందరికీ తెలిసిన చరిత్రే! నిజానికి అంతక్రితం లేనిది చేసిచూపడమే శ్రీ రామోజీరావు గారి ఘనత. అదే ఆయన కీర్తి పతాక.తెలుగు పత్రికా రంగంలో అంతటి ఘనచరిత్ర కలిగిన ‘కంప్యూటర్ చిప్ చాట్’ పేజీని సమర్థవంతంగా బహుకాలంపాటు నిర్వహించిన బాధ్యత నా అదృష్టం. అలా తెలుగులో కంప్యూటర్ ల గురించి తోలి వ్యాసాలు రాయడం, తొలిసారిగా ఒక దినపత్రికలో ఒక పేజీని నిర్వహించడం ద్వారా చరిత్రలో ‘నేనుసైతం’ అన్న రీతిలో ఒక స్థానం సంపాదించుకోగలిగాను.


‘కంప్యూటర్ చిప్ చాట్ ‘ ఆవిర్భావం

1991 సెప్టెంబర్ 16 సోమవారం నాటి ‘ఈనాడు’దినపత్రికలో,జిల్లా పేజీలలో కంప్యూటర్ విజ్ఞానం శీర్షిక ప్రచురణ ప్రారంభం అయింది. శీర్షిక ఆరంభం అవుతున్న తరుణం లో ఆ మొదటి రోజున శీర్షిక ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఇలా వివరించాము.   “ నిత్య జీవితం లో కంపూటర్లు నిర్వహిస్తున్న పాత్ర రోజురోజుకీ విస్తరిస్తుంది. వాతావరణ సూచనల నుంచీ ప్రయాణాల వరకూ మనకు కంప్యూటర్ ల సహాయం అవసరం అవుతుంది. ఊహించలేనంత వేగంతో అభివృద్ది చెందుతున్న కంప్యూటర్ రంగం మన జీవితాలను నియంత్రించే రోజులు మరెంతో దూరం లో లేవు. ఈ నేపథ్యం లో కంపూటర్ల గురించిన అవగాహన అందరికీ అవసరమని భావిస్తూ ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాము. ప్రతి సోమవారం నాడు వెలువడే ఈ శీర్షిక మీకెంతో ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వసిస్తున్నాము.” ఈ శీర్షిక పరిచయమే శీర్షిక గురించి చెప్పాల్సిందంతా చెప్పేసింది అనుకోవాలి. మొదటి రోజు పత్రికలో ‘ప్రయోజనాలను బట్టి పలురకాల కంప్యూటర్ లు’ అనే ప్రధాన వ్యాసం తో పాటు,’కంప్యూటర్ ల రంగానికి నిపుణుల కొరత’అనే ఉప వ్యాసాన్ని ప్రచురించాం. కంప్యూటర్ లు అనేక రకాలనీ, ఆ రంగం లో సుశిక్షితులైన నిపుణుల కొరత అధికంగా ఉంది కాబట్టి,కొత్తతరంలో ఎందరో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు వెతుక్కోగల అవకాశం ఉందనీ చెప్పడంతో, అటు శీర్షికల గురించి అవగాహన కలగడమే కాకుండా, ఇటు ఉద్యోగరంగంలోనూ అవకాశాలు అపారంగా ఉన్న రంగం అని చెప్పడంతో యువతకు ఈ శీర్షిక పట్ల ఆసక్తి పెరుగుతుందని భావించాం. అలాగే, ‘కంప్యూటర్ పరిభాష’ అనే శీర్షిక ద్వారా,కొత్త సాంకేతిక పదజాలం అర్థాలను తెలియజేస్తూ ఆ పదాల  వివరణలను తెలియజేసే ప్రయత్నం చేసాం.వీటికి కొన్ని చిన్న బాక్స్ ఐటం లు, పేజికి దిగువగా ప్రత్యేక స్థానంలో శ్రీధర్ కార్టూన్ తో మొదటి రోజు’ కంప్యూటర్ చిప్ చాట్’ ప్రచురితం అయింది. కొత్త చరిత్రకు నాందీగీతాలాపన జరిగింది.’ఈనాడు దినపత్రిక’ అన్ని ఎడిషన్ లలోనూ ఈ శీర్షికకు చోటు కల్పించడంతో దీనికి రాష్ట్ర వ్యాప్త ఆదరణ లభించింది. తమ పత్రికల్లో ప్రచురితం అయ్యే వార్తలు, శీర్షికల గురించి నిత్యం పాఠకుల అభిప్రాయాలను సేకరించడం ‘ఈనాడు’ పత్రిక ఆనవాయితీ. అదే సంప్రదాయం ప్రకారం, ఆ తర్వాత జరిగిన అనేక సర్వే లలో ‘కంప్యూటర్ చిప్ చాట్’ కు పాఠకుల ఆదరణ చాలా బాగుందని తెలియరావడం విశేషం.


విజయానికి దోహదకర్తలు

కంప్యూటర్ చిప్ చాట్ పేజీ నిర్వహణలో మేము చాలా ఆటుపోట్లనే ఎదుర్కొన్నాం. ముఖ్యంగా కంప్యూటర్ లు,సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, లాంగ్వేజెస్ వంటి క్లిష్టమైన అంశాల గురించి సరైన సమాచారం తో కూడిన వ్యాసాల సేకరణ, వాటిని సరళమైన విధంగా తెలుగులోనికి అనువదించడం వంటివి కష్టం గానే ఉండేవి. అయినా, శ్రీ రఘు కిదాంబి, మార్గదర్శి కంప్యూటర్స్ కు సలహాదారు అయిన శ్రీ ఏ.కే వ్యాస్, మార్గదర్శి కంప్యూటర్స్ సంస్థలో పనిచేస్తున్న మిత్రులు శ్రీ సత్యానందం, శ్రీ వి వి ఎన్ రామకృష్ణ, శ్రీ హనుమత్ ప్రసాద్, శ్రీ విజయ సూరి, శ్రీ కంచర్ల ప్రభాకర్ వంటి ఎందరో సహాయ సహకారాలతో పేజీని దిగ్విజయంగా కొనసాగించాం. వీరితోబాటు ఆసక్తికలిగిన కొందర పాఠకులు స్వచ్చందంగా పంపిన చక్కని వ్యాసాలు కూడా మాకు తోడ్పాటును అందించాయి. ఎక్కడ ఏ మాత్రం సందేహం వచ్చినా, ఏ అంశంలో ఇబ్బందిగా అనిపించినా, చైర్మన్ గారి సూచనలూ, మార్గదర్శకత్వం ఉండేది. అదే ప్రోత్సాహంతో ఆ పేజీ నిరంతరాయంగా కొనసాగింది. కంప్యూటర్ ల  ఆవిర్భావం, పరిణామాలు, సాఫ్ట్ వేర్ లు, హార్డ్ వేర్ పరికరాలూ, హాని కలిగించే పలురకాల వైరస్ లూ,వాటిని ఎదుర్కోవలసిన తీరు గురించీ, ప్రపంచ స్థాయి కంప్యూటర్ సంస్థల అధినేతల గురించీ, అప్పట్లో ప్రపంచాన్ని వణికించిన వై2కే సమస్య గురించీ, కంప్యూటర్ శిక్షణ ఇచ్చే సంస్థలు, ఉద్యోగావకాశాలు, కంప్యూటర్ ఎంపిక లోనూ, వాడుకలోనూ తీసుకోవలసిన జాగ్రత్తల గురించీ, కంప్యూటర్ ఆస్ట్రాలజీ, లెక్సికోగ్రఫీ,  వైద్య రంగం లో డాక్టర్ లకు కంప్యూటర్ ల  సహాయం, లాయర్ లకు లీగల్ సాఫ్ట్ వేర్స్, లైబ్రరీ లకు తగిన సాఫ్ట్ వేర్స్ వివరణలు, డేటా వేర్ హౌసింగ్, నెట్ వర్కింగ్ వంటి అనేక అంశాలతో సహా వివిధ రంగాలలో కంప్యూటర్ ల పాత్ర ... ఇలా ఏ ఒక్క  అంశానికీ పరిమితం కాకుండా, కంప్యూటర్ రంగం లో ఉన్నవారికీ కంప్యూటర్ రంగం లో ప్రవేశించదలిచేవారికీ.. కేవలం ప్రపంచ పరిణామాలను అధ్యయనం చేసే పాఠకులకూ... అందరికీ పనికివచ్చేలా ఈ శీర్షికను నిర్వహించడం మా అందరికీ ఆనందదాయకం. ఇప్పుడు చూస్తే వీటిలో కొన్ని అంశాలు చాలా ప్రాథమికంగా అనిపించినా పాతిక ముప్పై ఏళ్ల క్రితం .. తెలుగు నేల ఇంకా కంప్యూటర్ ల గురించి ఆలోచనలు సారించని ఆ రోజుల్లో ఇంత విప్లవాత్మక రీతిలో, కొత్త దారిని నిర్మించడం, తమ పాఠకుల రేపటి గురించి రేఖామాత్రంగా కాకుండా సవివరంగా మార్గదర్శనం కలిగించడం, జీవిత పథాన్ని ఆ రహదారిలో రూపొందించుకుని ముందుకు సాగమని నవతరానికి ఉద్భోద చేయడం పత్రికగా ఒక సామాజిక బాధ్యతే అయినా, అది అద్భుతంగా నిర్వహించడం ‘ఈనాడు’కు ల;అభించిన ఘనత. ఎప్పుడు తలచుకున్నా ఆనందాన్నీ, ఉత్సాహాన్నీ నింపే గతం అది. అదృష్టం అది!!


కొసమెరుపు :-  ఆ రోజుల్లో ‘ఈనాడు’ దినపత్రిక లో కంప్యూటర్ చిప్ చాట్ పేజి కి మంచి ఆదరణ లభించడంతో అప్పట్లో కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తున్న జాతీయ సంస్థ’ ఆప్టెక్’ వారు నన్ను తమ తెలుగు విద్యార్థులు కోసం తాము ఆంగ్లం లో ప్రచురించిన ‘విద్య’ అనే ఒక ఒక కంప్యూటర్ శిక్షణా గ్రంథo వంటి దాన్ని తెలుగులోనికి అనువదించి ఇవ్వవలసినదిగా కోరారు. ఆప్టెక్ హైదరాబాద్ ప్రాంత కార్యాలయం అధిపతిగా ఉన్న శ్రీ బి.ఎస్. మంధా ను , హైదరాబాద్, దిల్ సుఖ్ నగర్ లోని ఆప్టెక్ మల్టీమీడియా విభాగం ఎరీనా అధినేత శ్రీ రాజశేఖర్ తో కూడా వెళ్లి కలిశాక  ఆ పనిని పూర్తిగా నాకే అప్పగించారు. అంటే, ఆంగ్లం లోని ఆ పుస్తకాన్ని సరళ మైన విధంగా తెలుగు లోనికి అనువదించడం, దానిని డి.టి.పి. చేయించడం, పుస్తక రూపం లో సిద్ధం చేయడం.. అన్ని బాధ్యతలు నావేనన్నమాట. అయితే అనువాదం అయిననూ, ఆ అనువాదం చేస్తున్న వాడిగా నా పేరు పుస్తకంలో వేయాలని  నేను షరతు పెట్టాను. దానికి శ్రీ మంథా తమ కేంద్ర కార్యాలయం నుండి అనుమతి కూడా తెచ్చుకున్నారు.అసలు పుస్తకాన్ని రాసిన వారి పేరు ఆ ఆంగ్ల ‘విద్య’ పుస్తకంలో కనపడదు కానీ, అనువాదకుడిగా తెలుగు పుస్తకం లో నా పేరు ఉంటుంది.


ఈ పుస్తక అనువాదం తర్వాత ఉద్యోగ సోపానం పత్రిక వ్యవస్థాపకులు,, ప్రధాన సంపాదకులు శ్రీ సురేష్ తమ వార్షిక ప్రత్యేక సంచికలో కంప్యూటర్ ల గురించి పూర్తి భాగాన్ని నన్నే రాయమని కోరారు. ఇది బహుశా 2004 ఉద్యోగ సోపానం వార్షిక సంచికలో ప్రచురితం అయింది.నిజం చెప్పాలంటే , ఈ అన్ని అవకాశాలూ, నాకు ‘కంప్యూటర్ చిప్ చాట్’ వాళ్ళ లభించినవే! ఆ విధంగా కూడా ఆ అదృష్టం నాదే!! 

                           
                                                                          --- డా. పాలకోడేటి సత్యనారాయణ రావు.
                                                     9848272430