• తాజా వార్తలు

తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఆద్యుడు ఎవరు? తెలుగు లో మొట్టమొదటి కంప్యూటర్ సాహిత్యాన్ని ప్రార

Who pioneered Telugu technical  literature?

Who is the 1 st person in telugu history, started computer literature ?

1997 వ సంవత్సరం ఆగష్టు లో కంప్యూటర్ విజ్ఞానం మాస పత్రిక మొదలయింది. ఇది తెలుగు లో మొట్టమొదటి సాంకేతిక మాస పత్రిక అయినప్పటికీ మేము 2010 వ సంవత్సరం వరకూ దీని గురించి చెప్పుకోలేదు. 2010 వ సంవత్సరం లో ఈ  పత్రికను నా ఆధీనం లోనికి తీసుకున్న తర్వాత ఈ పత్రికను “తొలి తెలుగు సాంకేతిక మాసపత్రిక” అని రీ బ్రాండింగ్ చేశాము. ఈ నేపథ్యం లో  అసలు తెలుగు లో తొలి సాంకేతిక మాస పత్రిక లేదా సాంకేతిక సాహిత్యాన్ని ప్రారభించిన వారు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి నాకు కలిగింది. అలా తెలుసుకునే క్రమం లో నేను చాలా మంది సీనియర్ పాత్రికేయులను, అనుభవజ్ఞులైన సాంకేతిక రచయితలనూ కలవడం వారితో చర్చించడం జరిగింది. ఆ చర్చల్లో తెలుగు సాంకేతిక సాహిత్యానికి పునాది వేసిన వ్యక్తి ని గురించి తెలుసుకోగానే ఒకింత ఆశ్చర్యం వేసింది. కానీ అప్పటికే  ఒకరిద్దరు స్వయం ప్రకటిత ఆద్యులు తెలుగు సాంకేతిక సాహిత్యం రంగం  లో చలామణీ లో ఉన్నారని మిత్రుల ద్వారా తెలుసుకునేసరికి నాకు కొంచెం బాధ కలిగింది. ఎందుకంటే తెలుగు లో మొట్టమొదటిగా సాంకేతిక సాహిత్యాన్ని మొదలు పెట్టిన వ్యక్తి ఉండగా వీళ్ళేదో ఆ సాహిత్యానికి పునాదులు వేసిన వారిలాగా ప్రకటించుకునే సరికి నేను దిగ్భ్రాంతి కి లోనయ్యాను.ఎందుకంటే ఈ ఘనా పాటీ లైన ఆద్యులను వారి ప్రకటనలను చూస్తుంటే ఇలా అనిపిస్తుంది. చరిత్రను కూడా ఇంత సులభంగా వక్రీకరిస్తారా? అసలు వీళ్ళ కి నైతిక విలువలు అనేవి ఉండవా? వీరి మనస్సాక్షి వీరిని ప్రశ్నించదా?కేవలం ప్రచారం కోసమో లేక మరే ఇతర లాభం కోసమో చరిత్రను మరుగున పడవేసే ప్రయత్నం చేస్తారా?

“మీరే సాంకేతిక సాహిత్యానికి ఆద్యుడనని ప్రకటించుకోవచ్చు కదా! మీ వెనక అంత పెద్ద మనిషి ఉన్నపుడు నిస్సంకోచంగా వాస్తవాలను బయట పెట్టవచ్చు కదా? మరి మీరెందుకు ఆ పని చేయరు?” అని అసలైన ఆద్యుడైన వ్యక్తిని నేను అడిగాను. దానికి ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నారు.” కేవలం ప్రకటించుకోవడం కోసం నేను అదంతా చేయలేదు.అసలు మీరు చెప్పేవరకూ తెలుగు లో సాంకేతిక సాహిత్యానికి నేనే ఆద్యుడననే సంగతి నాకు తెలియదు. ప్రకటించుకోవడం, ప్రచారపు ఆర్భాటం నా ఉద్దేశం కాదు. ఆ సమయం లో నేను పని చేస్తున్న  యాజమాన్యం  నాకు ఆ పని అప్పగించింది. నేను నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాను. అది కేవలం నా బాధ్యత మాత్రమే”. ఆహా ఏమి వ్యక్తిత్వం! ఆయన లోని ఈ నిరాడంబరత ను చూసేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న స్వయం ప్రకటిత ఆద్యుల గురించి నేను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళినప్పుడు వారి గురించి మాట్లాడడమే అనవసరం అన్నట్లు గా ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు.

సరే మీరు సాంకేతిక సాహిత్యాన్ని మొదలు పెట్టడానికి కారణాలు ఏమిటి? అసలు ఆ రోజుల్లో కనీసం ఇంటర్ నెట్ సదుపాయం కూడా లేదు కదా! అంతటి మహా కార్యాన్ని మీరొక్కరే ఎలా నిర్వర్తించగలిగారు? మీ అనుభవాలనైనా మాకు రాసి ఇవ్వండి. అవి ఈ తరం పాఠకులకూ, జర్నలిస్టులకూ ఉపయోగకరంగా ఉంటుంది అని ఆయనను నేను  అడగడం ఆయన సరే అనడం  జరిగింది. ఈ సంభాషణ జరిగింది 2010 వ సంవత్సరం లో. గత ఆరు సంవత్సరాలుగా నేను  ఆయనను అడుగుతూనే ఉన్నాము, ఆయనకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు లేదా ఆయన కొంత కాలం పాటు అమెరికా లో ఉండడం వల్ల కావచ్చు లేదా ఆయనకు ఉన్న నిరాడంబరత వలన కావచ్చు , ఇప్పటివరకూ మాకు ఆయన అనుభవాలను పాఠకులకు తెలియజేసే అవకాశం ఇవ్వలేదు. కానీ నేను మాత్రం అలుపెరుగకుండా ఆయనను అడుగుతూనే వస్తున్నాను. అసలు నేను ఇంతలా ఆయన అనుభవాలను పాఠకులకు తెలియపరచాలని అనుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే నేను తెలుగు సాంకేతిక సాహిత్య  రంగం లో ఒక పత్రికకు సంపాదకునిగా ఉన్నాను. నేడు ఉన్న సాంకేతిక రచయితలలో ఒక వ్యక్తి సాంకేతిక సాహిత్యానికి తానే  పునాదులు వేసినట్లుగా స్వయం ప్రకటిత ఆద్యునిగా  ప్రకటించుకుంటుంటే  నేటి సాంకేతిక సాహిత్యానికి సమకాలీకునిగా ఉంటూ ఆ వ్యక్తి చేస్తున్నది తప్పని తెలిసీ  చూస్తూ ఊరుకోవడం అంటే నేను కూడా చరిత్ర వక్రీకరణను  అంగీకరిస్తున్నానేమో  అనే భావన కలిగింది. సరే జరిగిందేదో జరిగిపోయింది. కానీ ఈ పరిస్థితులలో వాస్తవాలను బయటకు తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది అని భావించి నేను ఆయనను తన అనుభవాలను ఇవ్వవలసిందిగా అడుగుతూ వస్తున్నాను. ఇన్నాళ్ళకు ఆయన నా అభ్యర్థనను మన్నించారు. తెలుగు సాంకేతిక సాహిత్య పాఠకులతో  తన అనుభవాలను పంచుకోవడానికి ఆయన ఒప్పుకున్నారు. ఆయన అనుభవాలను ఒక నాలుగు పేజీల  వ్యాసం రూపం లో మాకు ఇవ్వడం జరిగింది.

ఇంతకీ అసలు తెలుగు సాంకేతిక సాహిత్యానికి ఆద్యుడు  ఎవరు? ఆయన అనుభవాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ శనివారం సాయంత్రం గం 7.34 ని.లకు   వరకూ వేచి చూడండి.ఆయన రాసిన వ్యాసం లో ఒక పేరా ప్రత్యేకంగా మీకోసం.

తెలుగులో సాంకేతిక సాహిత్యం మొట్టమొదటిసారిగా 1991 సెప్టెంబర్ 16 వ తేదీ సోమవారం మొదలయింది.  ఆ తేదీన తెలుగులో మొట్ట మొదటి సాంకేతిక సాహిత్యం మొదలు పెట్టే  ముందు  పరిచయం ఈ విధంగా ఉన్నది.

“ నిత్య జీవితం లో కంపూటర్లు నిర్వహిస్తున్న పాత్ర రోజురోజుకీ విస్తరిస్తుంది. వాతావరణ సూచనల నుంచీ ప్రయాణాల వరకూ మనకు కంప్యూటర్ ల సహాయం అవసరం అవుతుంది. ఊహించలేనంత వేగంతో అభివృద్ది చెందుతున్న కంప్యూటర్ రంగం మన జీవితాలను నియంత్రించే రోజులు మరెంతో దూరం లో లేవు. ఈ నేపథ్యం లో కంపూటర్ల గురించిన అవగాహన అందరికీ అవసరమని భావిస్తూ ఈ శీర్షిక ప్రారంభిస్తున్నాము. ప్రతి సోమవారం నాడు వెలువడే ఈ శీర్షిక మీకెంతో ప్రయోజనకరంగా ఉంటుందని విశ్వసిస్తున్నాము.”

                                                                                                                             మీ

                                                                                                                జ్ఞాన తేజ నిమ్మగడ్డ

                                                                              సంపాదకుడు

కంప్యూటర్ విజ్ఞానం

తొలి తెలుగు సాంకేతిక పత్రిక