నిన్నా మొన్నటి వరకు పేరుమోసిన కంపెనీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రధాని, ముఖ్యమంత్రులు మాత్రమే వీడియో కాన్ఫరెన్సింగ్‌లు నిర్వహిస్తుండటం చూశాం. లాక్‌డౌన్‌తో ఇల్లు కదిలే పరిస్థితి లేకపోవడంతో క్లాస్ పాఠాల నుంచి ఆఫీస్ మీటింగ్స్ వరకు అన్నింటికీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లే అక్కరకొస్తున్నాయి. వీటిలో మరీ ముఖ్యంగా చైనాకు చెందిన వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్ జూమ్ విపరీతంగా పాపులరయింది. అయితే దీని ద్వారా అపరిచిత వ్యక్తులు హ్యాకర్లు కూడా మన కాన్ఫరెన్స్‌లోకి చొరబడి డేటా కొట్టేస్తున్నారన్న విషయం గగ్గోలు పుట్టించింది. పలువురు కేంద్ర మంత్రులు కూడా హైలెవెల్ మీటింగ్స్ జూమ్ యాప్ ద్వారా కండక్ట్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్టయింది. జూమ్ వాడొద్దంటూ మంత్రులు, ఉన్నతాధికారులకు ఆర్డర్స్ పాస్ చేసేదాకా పరిస్థితి వెళ్లింది. అంతేకాదు ఇలాంటి వీడియోకాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ తయారుచేయాలంటూ స్టార్టప్‌లకు పిలుపునిచ్చింది. దీనికి ఓ పోటీ పెట్టి గెలిచినవారికి కోటి రూపాయల ప్రైజ్‌మనీ కూడా ప్రకటించింది.
50 మందితో ఒకేసారి వీసీ
ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియా లెజెండ్ ఫేస్‌బుక్ అలర్టయింది. ఎక్కువ మందితో వీడియో కాన్ఫరెన్స్ చేసుకోగలిగేలా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫేస్‌బుక్ మెసెంజర్‌లోనే దీన్ని యాడ్ చేసి ఫేస్‌బుక్ రూమ్స్ అని పేరు పెట్టింది. జూమ్‌కు ప్రత్యామ్నాయంగా ఫేస్‌బుక్ దీన్ని ప్రవేశపెట్టి వీడియో కాన్ఫరెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా నిలదొక్కకోవడానికి ఓ పెద్ద అడుగే వేసిందని చెప్పాలి.
అదే పెద్ద అడ్వాంటేజ్
* ఫేస్‌బుక్ మెసెంజర్ రూమ్స్‌తో గరిష్టంగా 50 మందితో వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవచ్చు.
* ఇండియాలో దాదాపు 35 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నాయి. వీరిలో చాలామంది డిఫాల్ట్‌గా మెసెంజర్ యాప్ కూడా వాడుతున్నారు. కాబట్టి కొత్తగా ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేసుకోకుండా వీడియో కాన్ఫరెన్స్ చేసుకునే అవకాశం ఉండటం ఫేస్‌బుక్‌కు పెద్ద అడ్వాంటేజ్ కాబోతోంది.
* ఎఫ్‌బీలో అకౌంట్ లేనివారు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చని చెప్పడం ద్వారా మరింత మంది దీన్ని వినియోగించుకునే అవకాశం దక్కింది .
బ్యాక్‌గ్రౌండ్ మార్చుకోవచ్చు
* మెసెంజర్‌లో ప్రస్తుతం ఉన్న బ్యాక్ గ్రౌండ్‌ను తీసేసి మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకోవచ్చు.
* లైటింగ్ తక్కువగా ఉన్నచోట కూర్చున్నా క్లియర్‌గా కనిపించేలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి వర్క్ ఫ్రం హోం చేసేవాళ్లకు చాలా ఉపయోగంగా ఉంటుంది.
సెక్యూరిటీ ఏర్పాట్లూ ఉన్నాయ్
* మెసెంజర్ రూమ్ క్రియేట్ చేసిన వ్యక్తి అందులో ఉండే పార్టిసిపెంట్స్‌ను కావాలంటే వెంటనే తొలగించవచ్చు. దీనివల్ల కాన్పిడెన్షియల్ మేటర్స్ చెప్పేటప్పుడు ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ఉండేలా చూసుకునే వీలుంటుంది. దానికోసం గ్రూప్ కాల్స్ పూర్తి చేసి మళ్లీ విడిగా చేసుకోనక్కర్లేదు.
* అలాగే ఈ రూమ్స్ వాడుకునేటప్పుడు ఎవరైనా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే ఫేస్‌బుక్‌కి ఫిర్యాదు కూడా చేయొచ్చు. కాబట్టి సెక్యూరిటీ పరంగా ఉన్నంతలో ఇది బాగానే కనిపిస్తుంది. ఇక దీని వినియోగం పెరిగితేనే సమస్యలున్నాయో లేదో ఓ అంచనాకు రావడానికి వీలవుతుంది.