• తాజా వార్తలు

క్విజ్ పేరుతో 60వేల ఫేస్‌బుక్‌ అకౌంట్లు హ్యాక్ చేశారు 

హ్యాకింగ్.. ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటున్న పదమిది. గుట్టుచప్పుడు కాకుండా వేరొకరి వెబ్‌సైట్లలోకి దొంగలా చొరబడి వారి విలువయిన సమాచారాన్ని తస్కరించడమే హ్యాకింగ్. సమాచార సాంకేతిర రంగంలో పెద్దన్న లాంటి అమెరికాకు చెందిన నాసా, వైట్‌హౌస్ వెబ్ సైట్లు కూడా పలుమార్లు హ్యాకర్ల బారిన పడి, కకావికలమయిపోయాయి. ఇప్పుడు కొత్తగా జరిగిన ఈ హ్యాక్ గురించి తెలుసుకుంటే మీరు మరింతగా ఆశ్చర్యానికి గురి అవుతారు. 

క్విజ్‌ పేరుతో దాదాపు 60వేల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులను ఉచ్చులోకి లాగారు. వారి వద్ద నుంచి వ్యక్తిగత సమాచారం, ఫ్రెండ్స్‌ లిస్ట్‌, ఇతర సమాచారాన్ని సర్వర్ల నుంచి దొంగిలించారు. ఉక్రెయిన్‌లోని ఆండ్రీ గోర్బచేవ్‌, గ్లెబ్‌ స్లుచెస్కీ వెబ్‌సన్‌ గ్రూప్‌ కంపెనీని ఏర్పాటు చేశారు. వీరు ఆన్‌లైన్‌ క్విజ్‌ పేరుతో కొన్ని రకాల బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్లు వినియోగదారుల ఫోన్లు, కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేశారు.

 వినియోగదారులు ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌మీడియా యాప్‌లను వాడినప్పుడు అవసరమైన సమాచారం వారికి కనిపించనీయకుండా చేసి వాణిజ్య ప్రకటనలు కనిపించేవి. వీరి వల్ల దాదాపు 63వేల మంది సమాచారం పక్కదారి పట్టిందని.. 75వేల డాలర్ల నష్టం వాటిల్లిందని ఫేస్‌బుక్‌ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ మేరకు కాలిఫోర్నియాలోని యాంటీ హ్యాకింగ్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఈ చర్యకు పాల్పడినట్లు ఫేస్‌బుక్‌ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా వెబ్‌సన్‌ సంస్థ రష్యా భాషను వాడేవారిని ఎక్కువగా లక్ష్యంగా చేసుకొన్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది.

జన రంజకమైన వార్తలు