• తాజా వార్తలు

ఆధార్‌తో ఓటర్ ఐడీ లింక్ : ఒకటికన్నా ఎక్కువ ఓట్లు ఉంటే ఏంటి పరిస్థితి ?

 ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు కలిగిన వారికి ఎన్నికల సంఘం చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఇందుకోసం ప్రతి వ్యక్తి ఓటరు కార్డును, వారి ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేసేందుకు తమకు చట్టబద్ధమైన అనుమతి కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) కోరింది.  ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల్లో ఇందుకోసం సవరణలు చేయాలని కోరింది. న్యాయ మంత్రిత్వ శాఖకు ఈ మేరకు లేఖ రాసింది. ఇలా అధికారం కట్టబెడితే కొత్తగా ఓటర్లుగా నమోదయ్యేవారితో పాటు, ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి ఆధార్‌ కార్డుల నంబర్లు తీసుకోవడం సాధ్యమవుతుందని ఈసీ స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘం కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకున్న వారు, అలాగే ఇప్పటికే ఓటు హక్కు కలిగిన వారి ఓటర్ ఐడీ వివరాలను ఆధార్‌తో సరిచూడనుంది. అంటే ఓటర్‌ కార్డుతో ఆధార్ అనుసంధానం జరగనుంది. దీంతో మీకు ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే అప్పుడు ఒకటి మినహా మిగతావన్నీ రద్దవుతాయి. ఇప్పటికే ఓటు హక్కు కలిగిన, లేదా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి ఆధార్ వివరాలు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీ తాజాగా న్యాయ శాఖకు లేఖ రాసింది. కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతి ఇస్తే అప్పుడు ఆధార్-ఓటర్ అనుసంధానం అనివార్యం అవుతుంది. దీంతో ఎక్కువ ఓట్లు కలిగిన వారికి భారీ దెబ్బ తగలనుంది. 

అయితే ఎన్నికల కమిషన్ గతంలోనే ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానానికి ప్రయత్నించింది. అయితే చట్టపరమైన అనుమతి లేకుండా ఏ సంస్థా, ఎవరి ఆధార్‌ కార్డుల వివరాలు సేకరించకూడదని ఆగస్టు, 2015లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దాంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. పోల్ ప్యానెల్ అప్పుడు నేషనల్ ఎలక్ట్రోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథంటికేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఆధార్ వివరాలు సేకరించింది.  

ఓటర్ కార్డులో తప్పులు లేకుండా చూసేందుకు, అలాగే ఎక్కువ కార్డులకు దరఖాస్తు చేసుకోకుండా నియంత్రించేందుకు ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈసీ ఆధార్ వివరాలు తీసుకోవాలంటే ఎలక్ట్రోరల్ చట్టానికి సవరణలు చేయాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే ఒక వ్యక్తి ఒకటికి మించి ఓటరు కార్డులు కలిగి ఉండకుండా నివారించే అవకాశం ఏర్పడుతుంది.  ఈసీ చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఇప్పటికే ఉన్న ఓటర్లతో పాటు కొత్తగా ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలనుకునే వారి నుంచి వారి ఆధార్ నంబర్లను అడిగే అధికారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి సంక్రమిస్తుంది.

జన రంజకమైన వార్తలు