మెసేజింగ్ రూపురేఖలు మార్చేసిన యాప్.. వాట్సాప్ . చదువురానివారు కూడా మెసేజ్ చేయగలిగేలా దీనిలో ఉండే ఐకాన్స్, సింబల్స్, ఫోటో, వీడియో, ఆడియో సపోర్ట్ దీన్ని టాప్ ప్లేస్‌లో నిలబెట్టాయి. టెలిగ్రామ్ లాంటి ఇతర యాప్స్ వచ్చినా వాట్సాప్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇందుకోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మల్టీ డివైజ్ సపోర్ట్, ఛాట్ బ్యాకప్‌కి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వంటి ఫీచర్లను త్వరలో తీసుకొస్తామని చెబుతోంది. వీటికంటే ముందు ‘వ్యూ వన్స్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్లు వేరేవారికి పంపే మెసేజ్‌లను రిసీవర్ (అవతలి వారు) ఒక్కసారి చూడగానే అవి డిలీట్ లేదా అయిపోతాయి. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా వాడుకోవాలి చెప్పే గైడ్ మీ కోసం.
ఉపయోగాలేంటి?
* మీరు ఏదైనా ఫొటో/వీడియో/గిఫ్‌లను వాట్సాప్‌లో ఇతరులకు పంపితే, అవతలి వ్యక్తి వాటిని కేవలం ఒక్కసారే చూసేలా చేయడమే ఈ వ్యూ వన్స్ ఫీచర్ స్పెషాలిటీ. అంటే రహస్యంగా చేరవేయాల్సిన సమాచారం అనుకుంటే ఈ ఫీచర్ వాడుకోవచ్చు. ఎందుకంటే రిసీవర్ చూసిన వెంటనే అది డిలీట్ అయిపోతుంది కనుక ప్రైవసీకి ఢోకా లేదు.
* ‘వ్యూ వన్స్’ ఫీచర్ ద్వారా ఫైల్ పంపితే ప్రివ్యూ కనిపించదు. అవతలి వారు దానిపై క్లిక్ చేసి చూసి చూడాల్సిందే. ఒక్కసారి ఇలా క్లిక్ చేసి చూసి, ఆ ఛాట్ స్క్రీన్ నుంచి బయటికి వచ్చిన వెంటనే రిసీవర్, సెండర్ ఛాట్ స్క్రీన్ల నుంచి ఆ ఫైల్ ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతుంది.
* ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ పంపిన 14 రోజుల్లోగా రిసీవర్ దాన్ని ఓపెన్ చేయకుంటే ఆ డేటా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. వాట్సాప్‌లో బ్యాకప్ తీసే సమయానికి వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా వచ్చిన ఫైల్స్ ఓపెన్ చేయకుంటే అవి బ్యాకప్‌లో స్టోర్ అవుతాయి.
* వ్యూ వన్స్ ద్వారా పంపిన మెసేజ్‌లు ఫార్వార్డ్, సేవ్, స్టార్డ్ మెసేజ్, షేర్ చేయలేరు. అయితే ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ లేదా స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు.
కంప్లయింట్ చేయాలంటే
వ్యూ వన్స్ ద్వారా వచ్చిన మెసేజ్‌లపై ఒకవేళ మీరు వాట్సాప్ కి ఫిర్యాదు చేయాలనుకుంటే మాత్రం వాటికి సంబంధించిన మీడియా ఫైల్స్‌ని వాట్సాప్‌కి తప్పక సమర్పించాలి.
గ్రూప్ చాట్స్‌లోనూ ఉంది
ఈ వ్యూవన్స్ ఫీచర్ గ్రూప్ ఛాట్‌లలోనూ ఎనేబుల్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ద్వారా పంపిన ఫైల్‌ని గ్రూపు సభ్యులు అందరూ చూశాక మాత్రమే డిసప్పియర్ అవుతుంది.
ఎప్పటి నుంచి వాడుకోవచ్చు?
ప్రస్తుతం సెలెక్టెడ్ యూజర్లకే ఈ వ్యూవన్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మరి కొద్ది రోజుల్లో అందరికీ వస్తుందని వాట్సాప్ ప్రకటించింది.