• తాజా వార్తలు

కొత్త ఫోన్ కొన‌గానే త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన ప‌నుల‌కు గైడ్‌

కొత్త ఫోన్ కొన‌గానే సంబ‌రంగా ఉంటుంది. అందులో ఏమేం ఫీచ‌ర్లు, ఎలా ప‌ని చేస్తుంది?  కెమెరా ఎలా ఉంది?  సెల్ఫీ ఎలా వ‌స్తుంది వంటివ‌న్నీ చూసేయాల‌ని ఆత్రుత స‌హ‌జం. అయితే వీట‌న్నింటికీ ముందు ఫోన్ కొన‌గానే చేయాల్సిన త‌ప్ప‌నిస‌రి ప‌నులు కొన్ని ఉన్నాయి. అవేంటో చెప్పే ఈ గైడ్ మీ కోసం..

క్షుణ్ణంగా ప‌రిశీలించండి 
* ఫోన్ బాక్స్ ఓపెన్ చేయ‌గానే ఫోన్‌తోపాటు ఇస్తామ‌న్న యాక్సెస‌రీస్ (ఛార్జ‌ర్‌, ఇయ‌ర్ ఫోన్స్‌, డేటా కేబుల్‌, సిమ్ ఎజెక్ట‌ర్, వారంటీ కార్డు లాంటివి) అన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకోండి.  డైలీ లైఫ్‌లో యూజ్ చేయాల్సిన ఛార్జ‌ర్‌, ఇయ‌ర్‌ఫోన్స్ త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ ఎక్క‌డైనా ఓ చోట గుర్తుండేలా భద్ర‌ప‌రుచుకోండి. 

* ఫోన్‌ను మొత్తం ఓసారి పైనుంచి కింది వ‌ర‌కూ పూర్తిగా ప‌రిశీలించండి. ఎక్క‌డైనా గ్లాస్ ప‌గిలిందా?  స్క్రీన్ మీద లేదా కేస్ మీద గీత‌లు గానీ ప‌గుళ్లు గానీ ఉన్నాయేమో చెక్ చేసుకోండి.  స్క్రీన్ మీద ప‌గుళ్ల‌లాంటివి పెద్ద‌గా ఉంటే సెల్ల‌ర్‌కు కంప్ల‌యింట్ చేయండి. వాటిని ఫోటోలు తీసి కంప్ల‌యింట్‌కు యాడ్ చేసి మెయిల్ చేయండి. లేదంటే ఆ ప‌గుళ్లు పెద్ద‌వై స్క్రీన్ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. 

*  బ్యాట‌రీ కూడా బ‌య‌టికి తీసే అవ‌కాశం ఉంటే ఒక‌సారి తీసి చూడండి. 

* సిమ్ కార్డులు, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్‌లు క‌రెక్ట్‌గా ఉన్నాయా లేదా స‌రి చూసుకోండి.
* పైవాటిలో ఏవైనా స‌రిగా లేవ‌ని మీకు అనిపిస్తే కంప్ల‌యింట్ చేయ‌డానికి వెనుకాడ‌కండి. 

8 గంట‌లు ఛార్జింగ్ పెట్టండి
ఫోన్‌ను పైన ప‌రిశీలించ‌డం పూర్త‌య్యాక దాన్ని 8గంట‌ల‌పాటు ఛార్జ్ చేయండి. ఆలోగా ఫోన్‌ను ఆన్ చేయ‌వ‌ద్దు.  8 గంట‌ల ఛార్జింగ్ పూర్త‌య్యాకే ఫోన్‌ను ఆన్ చేయండి. ఫుల్ ఛార్జింగ్ పెట్ట‌మ‌ని ఎందుకు చెబుతారంటే ఫోన్ కంప్లీట్ సెట‌ప్‌కు చాలా ప‌వ‌ర్ అవస‌ర‌మ‌వుతుంది.  యాప్స్ డౌన్‌లోడ్ చేయ‌డం, ఇన్‌స్టాల్ చేయ‌డం, పాత బ్యాక‌ప్ డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఇవ‌న్నీ చేసేట‌ప్పుడు మ‌ధ్య‌లో ఫోన్ స్విచ్ఛాఫ్ కాకుండా ఉండాలంటే ఫ‌స్ట్ టైం 8 గంట‌ల ఛార్జింగ్ త‌ప్ప‌నిస‌రి. 

ఫోన్ సెట్ చేసుకోండి
8గంట‌ల ఫుల్ ఛార్జింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఫోన్‌ను ఆన్ చేసి సెట‌ప్ ప్రొసీజ‌ర్ మొద‌లుపెట్టండి. సెక్యూరిటీ సెట్ చేసుకోండి. ప్యాట్ర‌న్ లాక్‌, నెంబ‌ర్ లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్స‌ర్ ఇలా ఉన్న ఆప్ష‌న్ల‌న్నీ వాడుకోండి.  కొన్ని ఫోన్లు కొత్త ఫోన్ వాడ‌కం ప్రారంభించ‌గానే ఓఎస్‌కు అప్‌డేట్ ఇస్తాయి. ప‌నిలోప‌నిగా దాన్ని కూడా అప్‌డేట్ చేసుకోండి. కొన్ని ఫోన్లు మీ జీమెయిల్ అకౌంట్‌తో సింక్ అయి ఉన్న డేటాను కొత్త ఫోన్‌లో డౌన్లోడ్ చేయాలా అని అడుగుతాయి. బ్యాక‌ప్ తీసుకోండి.  ఇక్క‌డితో ఫోన్ ఫిజిక‌ల్ ప‌రిశీల‌న పూర్త‌వుతుంది. 

మ‌రింత లోతుగా ప‌రిశీలించండి
ఇప్పుడు ఫోన్‌ను మ‌రింత లోతుగా ప‌రిశీలించాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. ఫోన్ ఎలా ప‌ని చేస్తుందనేది ఈ ప‌రిశీల‌న‌లో తేల్చుకోవాలి.  

సెల్యూల‌ర్ క‌నెక్ష‌న్ 
సెల్యుల‌ర్ క‌నెక్ష‌న్ క‌రెక్ట్‌గా సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఇది స‌రిగా లేకుంటే కాల్ డ్రాప్ అవ‌డం, మొబైల్ డేటా స్లో కావ‌డం వంటివి జ‌రుగుతాయి. ఇప్పుడు వ‌చ్చేవ‌న్నీ డ్యూయ‌ల్ సిమ్ ఫోన్లు కాబ‌ట్టి రెండు సిమ్స్‌లోనూ సెల్యుల‌ర్ క‌నెక్ష‌న్‌, మొబైల్ డేటా క‌రెక్ట్‌గా సెట్ అయ్యాయో లేదా ప‌రిశీలించండి. 

స్క్రీన్ ఫంక్ష‌న్ 
పిక్సెల్స్ స‌రిగా ఉన్నాయా లేదా చూడండి. స్క్రీన్ అంతా ఒకే బ్రైట్‌నెస్ ఉందా లేక‌పోతే కొన్నిచోట్ల డ‌ల్‌గా కొన్ని చోట్ల మ‌రీ ఎక్కువ బ్రైట్‌నెస్‌తో ఉందా చూడండి. అలా ఉంటే డిస్‌ప్లే లేదా స్క్రీన్‌లో ఏదో తేడా ఉన్న‌ట్లు. వెంట‌నే కంపెనీని సంప్ర‌దించండి. 
ట‌చ్ స్క్రీన్ కాబ‌ట్టి స్క్రీన్‌లో ఎక్క‌డ ట‌చ్ చేసినా ఫోన్ ప‌ని చేయాలి. అలా చేస్తుందా లేదా చూడండి. 

పోర్ట్ ఫంక్ష‌న్  
హెడ్‌ఫోన్స్ పెట్టుకోవ‌డానికి ఇచ్చిన పోర్ట్ స‌రిగా ప‌ని చేస్తుందా లేదా చూడండి. ఆ పోర్ట్ ఏదైనా కాస్త తేడాగా ఉన్నా మీ ఇయ‌ర్‌ఫోన్ లేదా హెడ్‌ఫోన్ జాక్ ప‌ట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ప‌ట్టినా సౌండ్ స‌రిగా రాక‌పోవ‌చ్చు. అందుకే ముందే చెక్ చేసుకోండి. ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా స‌రిచూసుకోండి. ఛార్జ‌ర్ లేదా డేటా కేబుల్‌తో ఛార్జింగ్ పెట్ట‌గానే వెంట‌నే ఛార్జ్ అవుతుందా లేదా చూడండి.  

కెమెరా టెస్ట్ 
మీ ఫోన్‌లో ఉన్న అన్ని కెమెరాల‌తో ఫోటోలు తీయండి. అన్ని ర‌కాల మోడ్స్‌లో (నైట్ మోడ్‌, ప‌నోర‌మా, వీడియో, స్లోమోష‌న్‌, సూప‌ర్ స్లో మోష‌న్‌, బొకే ఎఫెక్ట్ ఇలా అన్ని ప‌ద్ధ‌తుల్లో)   ఫోటోలు, వీడియోలు తీసి చూడండి. పిక్ స‌రిగా వ‌స్తుందా లేదా చూడండి.  స్క్రీన్‌మీద లేదా ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌ను టాప్ చేస్తే ఫోటో క్యాప్చ‌ర్ అవుతుందా లేదా స‌రి చూసుకోండి. 

కనెక్ష‌న్ల‌న్నీ చూసుకోండి. 
వైఫై, బ్లూటూత్ అన్నీ స‌రిగా ప‌ని చేస్తున్నాయో లేదో చెక్ చేయండి. మ‌ధ్య‌లో ఎలాంటి గోడ‌లు లేక‌పోతే బ్లూటూత్ క‌నీసం 30 అడుగుల దూరం నుంచి ప‌ని చేయాలి. జీపీఎస్ క‌నెక్ష‌న్ కూడా చెక్ చేయండి. ఫోన్ సెన్స‌ర్లు కూడా స‌రిగా ప‌ని చేస్తున్నాయో లేదో చూడండి. 

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్  ప‌ని చేస్తుందా? 
ఇప్పుడు ఫోన్‌కు ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్ అత్యంత కీల‌కం కాబట్టి ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్ స‌రిగా ప‌ని చేస్తుందా లేదా చెక్ చేయండి. స‌రిగా ప‌ని చేయ‌క‌పోతే ఫోన్లో ప్రాబ్లం ఉన్న‌ట్లే.  

పైన చెప్పిన వేటిలో ఏది స‌రిగా ప‌ని చేయ‌క‌పోయినా కంపెనీ క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేసి కంప్ల‌యింట్ చేయండి.లేదా స‌ర్వీస్ 
సెంట‌ర్‌కు వెళ్లి సెట్ చేయించుకోండి. మీ ఫోన్‌లో ఏదైనా ప్ర్రాబ్లం ఉంద‌ని స‌ర్వీస్ సెంట‌ర్‌లో చెబితే వెంట‌నే ఫోన్‌ను రీప్లేస్ చేయ‌మ‌ని కంపెనీని సంప్ర‌దించండి. 
 

జన రంజకమైన వార్తలు