ఫేక్ ఐఫోన్‌ను కనిపెట్టండి ఇలా..
ఐఫోన్.. ఇదంటే యూత్‌లో పెద్ద క్రేజ్ ఇప్పడు. ఎన్ని వెర్షన్లు వస్తున్నా.. ధర ఎక్కువగా ఉన్నా కూడా ఈ ఫోన్‌ను కొనడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ ఫోన్‌లో ఉంటే యూనిక్ ఫీచర్లే ఇందుకు కారణం. అయితే ఐఫోన్ క్రేజ్‌కు తగ్గట్టే నకిలీ ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. చాలామంది తెలియక ఎక్కువ డబ్బులు ఇచ్చి ఇలాంటి ఫోన్లను కొని మోసపోతున్నారు. మరి ఫేక్ ఐఫోన్లను కనిపెట్టడం ఎలా!
మనం వాటిని కొనకుండా ఉండడం ఎలా!
యాపిల్ స్టోర్‌కు వెళ్లండి
మీరు ఐఫోన్ కొనాలనే ఉద్దేశం ఉంటే మొదట స్థానికంగా ఉండే యాపిల్ స్టోర్‌కు వెళ్లాలి. అక్కడ ఐఫోన్ల లుక్ ఎలా ఉంది దాని ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని పట్టుకుని చూడండి.. ధర అడగండి. అప్పుడు ఎవరైనా మీకు పాత ఐఫోన్ తక్కువ ధరకే అమ్ముతామని మీ దగ్గరకు వస్తే అది అసలైన ఐఫోనా కాదా అనేది తెలుసుకోవడం సులభం అవుతుంది. స్టోర్‌కు వెళ్లలేకపోతే యాపిల్ అధికారిక వెబ్ సైట్‌కు వెళ్లి ఫోన్ స్పెసిఫికేషన్లు తెలుకోండి. ఫీచర్ల గురించి అవగాహన పెంచుకోండి.
ఐఎంఈఐ లేదా సీరియల్ నంబర్ చెక్ చేయాలి
అధికారిక ఐఫోన్‌కు తప్పకుండా ఒక ఐఎంఈఐ నంబర్ లేదా సీరియల్ నంబర్ ఉంటుంది. దీన్ని తెలుసుకోవాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత అబౌట్ మీద ట్యాప్ చేయాలి. అలా కిందకి వస్తే ఐఎంఈఐ నంబర్ కనిపిస్తుంది. ఒకవేళ ఐఎంఈఐ నంబర్ లేదా సీరియల్ నంబర్ మీకు కనిపించకపోతే అది పక్కా ఫేక్ ఫోనే.
ఓయస్ డబుల్ చెక్
ఐఫోన్‌లో ప్రత్యేకత ఏంటంటే దాని ఆపరేటింగ్ సిస్టమ్. మిగిలిన ఫోన్ల మాదిరిగా కాకుండా ఇది ఐవోఎస్ ద్వారా నడుస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను యాపిల్ ప్రత్యేకంగా రూపొందించింది. అయితే కొన్ని ఆండ్రాయిడ్ కంపెనీలు ఐఫోన్ మాదిరిగానే కనిపిస్తూ కస్టమర్లను బోల్తా కొట్టిస్తున్నాయి. ఫేక్ ఐఫోన్లు కూడా అంతే. చూడటానికి ఒరిజినల్ మాదిరే ఉంటాయి. అందుకే ఇది కొనేముందు చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. సఫారీ, హెల్త్, కాలిక్యూలేటర్ డిఫాల్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. యాప్ స్టోర్ నుంచి మరిన్ని యాప్‌లు డౌన్‌లోడ్ చేసే ప్రయత్నం చేయండి.
సిరి ఉందో లేదో..
ఐఫోన్‌లో మరో ప్రత్యేకత సిరి. ఈ వాయిస్ అసిస్టెంట్ గూగుల్ అసిస్టెంట్ మాదిరే మీకు పనులు చేసిపెడుతుంది. ఇది కేవలం యాపిల్ డివైజ్‌లలో మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఫేక్ ఐఫోన్ అయితే సిరి వాయిస్ అసిస్టెంట్ మీకు కనిపించదు. అప్పుడు అది ఫేక్ అని క్లియర్‌గా చెప్పేయచ్చు. అలాగే స్టోరేజ్ కెపాసిటీ చెక్ చేసుకోవాలి. ఐఫోన్‌లో మైక్రో ఎస్‌డీ కార్డ్ ఉండదు. ఇంటర్నల్ మెమరీ నాన్ ఎక్స్‌పాండబుల్. పవర్ అడాప్టర్స్, ఛార్జర్స్ కూడా ఒరిజినల్‌నా కాదా అనేది చెక్ చేసుకోవాలి.