మీరు బీఎస్ఎన్ఎల్ ప్రిపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ మొబైల్ నంబర్ ఉపయోగిస్తున్నారా? అయితే మీ ఫోన్‌కు అస్తమానం పాపప్ మెసేజ్ వస్తూనే ఉన్నాయా?.. నిజానికి ఈ మెసేజ్‌లు ప్రతి 15 నుంచి 30 నిమిషాల గ్యాప్‌లో తమ వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ ఈ ఫ్లాష్ మెసేజ్‌లను పంపుతూ ఉంటుంది. పాపప్ నోటిఫికేషన్ల రూపంలో ఈ ఫ్లాష్ మెసేజ్‌లు మనకు వస్తూ ఉంటాయి. ఈ ఫ్లాష్ మెసేజ్‌లలో సాధారణంగా ప్రొమోషనల్ కంటెంట్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, ఫన్, కాంటెస్ట్‌లు, లైఫ్ స్టయిల్ లాంటి మనకు అవసరం లేని విషయాలన్నీ ఉంటాయి. మనకు ఈ స్టఫ్ అవసరం లేకపోయినా బీఎస్ఎన్ఎల్ వాటిని పంపుతూ ఉంటుంది. కొన్నిసార్లు డునాట్ డిస్టర్బ్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు కూడా ఈ ఫ్లాష్ మెసేజ్‌లు వస్తూ ఉంటుంది. మీరు పొరపాటున ఏదైనా ఒకే బటన్ ప్రెస్ చేస్తే మీకు తెలియకుండానే రూ.30 ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. మరి ఫ్లాష్ మెసేజ్‌లను ఆపే మార్గమే లేదా?
బీఎస్ఎన్ఎల్ తాను పంపుతున్న ఫ్లాష్ మెసేజ్‌లకు బీఎస్ఎన్ఎల్ బజ్ అనే పేరు పెట్టింది. ఇందుకోసం సిలిటెక్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను మన ఫోన్‌లో యాక్టివేట్ చేయగానే డిఫాల్ట్‌గా ఈ బజ్ కూడా యాక్టివ్ అయిపోవడం! అయితే మీరు కొన్ని సింపుల్ స్టెప్స్‌తో ఈ ఫ్లాష్ మెసేజ్‌ల నుంచి తప్పించుకోవచ్చు.
1. మీ ఫోన్లో యాప్ విభాగంలో సిమ్ టూల్ కిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి
2. ఈ సిమ్ టూల్ కిట్‌ను ఓపెన్ చేసిన తర్వాత బీఎస్ఎన్ఎల్ సిమ్‌పై ట్యాప్ చేయాలి
3. ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ బజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
4. ఆ తర్వాత యాక్టివేషన్ లేదా డియాక్టివేషన్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో మీరు డియాక్టివేట్ మీద ట్యాప్ చేయాలి
5. ఆపై ఒకే బటన్ ప్రెస్ చేయాలి. అంతే మీకు బీఎస్ఎన్ఎల్ ఫ్లాష్ మెసేజ్‌ల బాధ తొలగినట్లే.