ఇప్పుడు మనవాళ్లంతా సాఫ్ట్వేర్ జాబ్‌ల పేరిట అమెరికా విమానం ఎక్కేస్తున్నారు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని అక్కడికే తీసుకెళ్లిపోతున్నారు. కొంతమంది అక్కడే అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటున్నారనుకోండి. ఉద్యోగం, పెళ్లి తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇల్లు కొనుక్కోవడమేగా.. అమెరికాలో ఇల్లు కొనాలనుకుంటే దాని విలువ ఎంతుందో తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఇకపై ఆ చింత అక్కర్లేదు అంటుంది ఎస్టేట్ అనే ఒక సర్వీస్. జస్ట్ మీరు విలువ తెలుసుకోవాలి అనుకుంటున్న రియల్ ఎస్టేట్ అడ్రస్ పంపితే ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్ ఎంతుందో మీకు ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. ఇది పూర్తిగా ఉచిత సర్వీస్ కావడం మరో హైలెట్.
ఎలా తెలుస్తుంది?
ఈ సర్వీసు హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ డేటాబేస్ ఉపయోగించుకుని మెషిన్ లెర్నింగ్ ద్వారా ఆ ప్రాపర్టీ ఎంత విలువ చేస్తుందో లెక్క కడుతుంది. ఎస్టేట్ ప్రస్తుతం రెండు రకాల సర్వీస్ సర్వీసులు అందిస్తోంది. అందులో మొదటిది ప్రాపర్టీ వ్యాల్యూ ఎంతో చెప్పడం. రెండోది కొనేవారిని, అమ్మేవారిని కనెక్ట్ చేయడం.
డిస్కవర్
ఒక ప్రాపర్టీ విలువ ఎంత ఉందో తెలుసుకోవాలంటే (650) 2970792 నెంబర్‌కి ఆ అడ్రస్‌ను ఎస్ఎంఎస్ చేయాలి. కొన్ని సెకన్లలోనే మీకు రిప్లై వస్తుంది. ఆ ప్రాపర్టీ విలువ ఎంత అనే ఎస్టిమేషన్ ఆ ఎస్ఎంఎస్లో ఉంటుంది. దీనికి ఎలాంటి యాప్ లేదా పేమెంట్ అవసరం లేదు. జస్ట్ ఒక్క ఎస్ఎంఎస్తో పనైపోతుంది. సర్వీసు అమెరికాలో ఉన్న అన్ని ప్రాపర్టీలకు పనిచేస్తుంది. ఆ స్థలం లేదా ఇల్లు అమ్మకానికి లేకున్నా ఈ సర్వీస్ వాటి వ్యాల్యూ ఎంతో కూడా చెప్పేస్తుంది.
కనెక్ట్
ఇది ఎస్టేట్ అందిస్తున్న మరో సర్వీస్. సెల్లర్స్‌ను బయ్యర్లను కలుపుతుంది. ఈ సర్వీస్ కావాలంటే ముందుగా మీరు ఎస్టేట్ వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీరు అమ్మాలనుకున్న ప్రాపర్టీకి ఎవరైనా ఆసక్తి చూపిస్తే ఎస్టేట్ వారితో మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. మన ఇండియాలో కూడా త్వరలో ఇలాంటి సర్వీసులు వస్తాయని ఆశిద్దాం. ఎందుకంటే అమెరికాలో ఉన్నా అనకాపల్లిలో ఉన్నా సొంతిల్లు అందరికీ కలే కదా..