• తాజా వార్తలు

ఇంటివద్ద నుంచే ఏటీఎం సేవలు పొందడం ఎలా ? 

  • - ఎలా? /
  • 4 సంవత్సరాల క్రితం /

సీనియర్ సిటిజన్లు ఇప్పుడు ఇంటి వద్ద నుంచే నేరుగా ఏటీఎం సేవలు పొందే అవకాశాన్ని కంపెనీలు కల్పిస్తున్నాయి. ఈ మధ్య కొన్ని బ్యాంకులు ఇంటి వద్దకే వచ్చి బ్యాంకింగ్ సర్వీసులు ఆఫర్ చేస్తున్నాయి. క్యాష్ పికప్, ఇన్‌స్ట్రుమెంట్ పికప్, క్యాష్ డెలివరీ, డిమాడ్ డ్రాఫ్ట్ వంటి సేవలు నేరుగా ఇంటికి వచ్చి అందిస్తున్నాయి. అయితే ఈ సేవలు కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్స్ కోసం డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. దీని కోసం ప్రత్యేకమైన బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉంటారు. ఈయనకు ఒక వ్యాన్ ఇస్తారు. ఇందులో మైక్రో ఏటీఎం ఉంటుంది. అకౌంట్ ఓపెనింగ్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్‌లో ఎన్‌రోల్‌మెంట్, పాస్‌బుక్ ప్రింటింగ్ వంటి పలు రకాల సేవలు అందిస్తారు. 

ప్రభుత్వ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా డోర్ స్టెప్ ఫెసిలిటీలను అందిస్తోంది. క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, ఫామ్ 15 హెచ్ పికప్, డ్రాఫ్ట్ డెలివరీ వంటి పలు రకాల సేవలు ఆఫర్ చేస్తోంది. 70 ఏళ్లకు పైన వయసు ఉన్న వారికే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. హోమ్ బ్రాంచ్‌కు 5 కిలోమీటర్లలోపు ఉన్న వారికే ఈ సేవలు వర్తిస్తాయి.

యాక్సిస్ బ్యాంక్ కూడా క్యాష్ పికప్, డెలివరీ క్యాష్ వంటి డోర్ స్టెప్ సౌకర్యాలను అందిస్తోంది. కేవలం ఒక ఫోన్ కాల్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. వీటికి డెబిట్ కార్డు, డెబిట్ కార్డు పిన్ అవసరమౌతాయి. ఇక్కడ కూడా కస్టమర్ హోమ్ బ్రాంచ్‌కు 5 కిలోమీటర్లలోపు ఉండాలి.అప్పుడే ఈ సేవలను అతను పొందేందుకు అవకాశం ఉంటుంది. 

పెద్ద నోట్ల రద్దు తర్వాత మూగబోయిన ఏటీఎంలు ఆ తర్వాత కాలంలో వినియోగంలోకి వచ్చినా కానీ, ఎందుకో గతంలో మాదిరిగా విరివిగా అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తరవాత గత రెండు సంవత్సరాల కాలంలో నగదు లావాదేవీలు పెరిగిపోగా, ఏటీఎంల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టింది. ఆర్‌బీఐ తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. 

బ్రిక్స్‌ దేశాల్లో ఒక్క భారత్‌లోనే లక్ష మంది ప్రజలకు అతి తక్కువ ఏటీఎంలు ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. ఇటీవలి కాలంలో ఏటీఎంల సంఖ్య తగ్గిపోవటానికి అసలు కారణం వాటిపై బ్యాంకులు చేస్తున్న ఖర్చులు పెరిగిపోవటమేనని తెలుస్తోంది. ఆర్‌బీఐ నిర్దేశించిన కఠిన నియమ, నిబంధనలకు తోడు  లావాదేవీలకు అవుతున్న చార్జీలను కస్టమర్ల నుంచి పూర్తి స్థాయిలో రాబట్టుకోలేకపోవడం, ఏటీఎం కేంద్రం నిర్వహణ, సెక్యూరిటీ ఖర్చు వెరసి బ్యాంకులకు ఆర్థికంగా భారం కావడంతో, దాన్ని తగ్గించుకునే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. 

గతేడాది సాఫ్ట్‌వేర్‌, ఎక్విప్‌మెంట్‌ల ఆధునికీకరణ కోసం ఆర్‌బీఐ ఆదేశించడం వల్ల ఏటీఎంల నిర్వహణ వ్యయం పెరిగిపోయింది. దీంతో రానున్న కాలంలోనూ ఏటీఎంల క్షీణత ఉంటుందని అంచనా. ఈ నేఫథ్యంలో బ్యాంకులు ఇంటి వద్దకే ఈ సేవలను అందించడం ద్వారా వారికి కొంత వెసులు పాటు కలిగే అవకాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు