జియో ఫీచర్ ఫోన్‌లోకి ఇప్పుడు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి గూగుల్ మ్యాప్స్ యాప్ ఈ ఫోన్‌లో పనిచేయనుంది. జియో ఫోన్లలో ప్రవేశపెట్టబోయే ఫీచర్ల గురించి ఆసక్తికరమైన విషయాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సాధారణ సమావేశంలో ముఖేష్ అంబానీ ఇటీవలే ప్రకటించారు. త్వరలోనే గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్, జీమెయిల్ వంటి యాప్స్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. వీటితో పాటు క్వర్టీ కీ ప్యాడ్‌తో జియో ఫోన్‌ను కూడా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇక ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాట్సాప్ ఫీచర్ కూడా ఆగస్టు 15 నుంచి రాబోతోంది. ప్రస్తుతం జియో ఫీచర్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ప్రవేశపెట్టారు.
ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లానే
జియో యాప్ స్టోర్ నుంచి ఈ గూగుల్ మ్యాప్స్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే.. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఉన్నట్లే ఆప్షన్లు కనిపిస్తాయి. మనకు నచ్చిన ప్రదేశాన్ని టైప్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే.. అక్కడికి ఎలా వెళ్లాలనే డైరెక్షన్లతో పాటు ఇతర ఆప్షన్లు కూడా వస్తాయి. డైరెక్షన్ కరెక్టుగా చూపెడుతోందా? లేదా? అనే సందేహాలే అవసరం లేదు. ఇవన్నీ పనిచేయాలంటే ముందుగా GeoLocation ఫీచర్‌ని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.
గూగుల్.. నో కాంప్రమైజ్
ఫీచర్ ఫోన్ అయినా.. గూగుల్ మ్యాప్స్‌కు సంబంధించిన ఏ విషయంలోనూ గూగుల్ రాజీపడలేదు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో ఉండే డ్రైవింగ్, టూ-వీలర్ మోడ్, వంటి అన్ని ఆప్షన్లు ఇందులోనూ ప్రవేశపెట్టింది. ట్రైన్‌లో వెళితే ఎంత సమయం పడుతుంది, బస్‌లో వెళితే ఎంత సమయం పడుతుంది, ఎలా వెళ్లాలి వంటి ఆప్షన్లన్నీ సులువుగా ఉపయోగించవచ్చు. అయితే ఇందులోనూ ఒక చిన్న మైనస్ ఉంది. అదేంటంటే.. 2.4 అంగుళాలు గల స్క్రీన్‌లో గూగుల్ మ్యాప్స్‌ని చూడటం! స్మార్ట్ ఫోన్లో పెద్ద స్క్రీన్‌లో గూగుల్ మ్యాప్స్ అలవాటు పడిపోయిన వారికి.. ఈ చిన్న స్క్రీన్‌పై మ్యాప్స్ చూడటం కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ముఖ్యంగా డ్రైవింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రం సమస్యలు తప్పవు. అయితే యూజర్ల కోసం కొన్ని సూచనలు వివరంగా వస్తాయి. వీటిని ఫాలో అవుతూ ఉంటే గమ్యాన్ని చేరుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్లలో ఎప్పటికప్పుడు వాయిస్ కమాండ్ రూపంలో సూచనలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ జియోఫోన్‌లో మాత్రం ఇటువంటి వాయిస్ నావిగేషన్ సిస్టమ్ లేదట.