• తాజా వార్తలు

స్మార్ట్‌ఫోన్లు వాడే చిన్నారుల్లో మాట‌లు రావ‌డం లేట్ అయ్యే ప్ర‌మాదం!

మీ పిల్ల‌లు ముఖ్యంగా రెండేళ్ల‌లోపు చిన్నారులు ఏడుస్తుంటే స‌ముదాయించ‌డానికి య‌థాలాపంగా సెల్‌ఫోన్ చేతికిస్తున్నారా? మా బాబుకు ఏడాది వ‌య‌సు అప్పుడే ఫోన్‌తో ఆడేస్తున్నాడు అని మురిసిపోతున్నారా? మా పాప‌కు ట్యాబ్‌లో రైమ్స్ పెట్టి ఇచ్చేస్తే ఇక ఏడుప‌న్న‌దే మ‌ర్చిపోతుంది అని గొప్ప‌గా చెప్పుకుంటున్నారా? అయితే మీరిది చ‌ద‌వాల్సిందే. రెండేళ్ళ‌లోపు పిల్ల‌ల‌కు స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్‌తో ఎక్కువ కాలం గ‌డిపితే వారిలో మాట‌లు లేట్‌గా వ‌చ్చే ప్ర‌మాద‌ముంద‌ని ఇటీవ‌ల ఓ రీసెర్చి హెచ్చ‌రించింది.
నాలుగేళ్ల‌పాటు రీసెర్చి
కెన‌డాలోని టొరంటోలో ఆరు నెల‌ల నుంచి రెండేళ్ల‌లోపు వ‌య‌సున్న 894 మంది చిన్నారుల‌పై ఓ సంస్థ రీసెర్చి చేసింది. ప్రాక్టీస్ బేస్డ్‌గా 2011 నుంచి 2015 మ‌ధ్య ఈ రీసెర్చి కండ‌క్ట్ చేసింది. 18 నెలల చెక్ అప్‌లో భాగంగా 28 నిముషాలు స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్ తో గ‌డిపిన చిన్నారుల్లో 20% మందికి మాటలు రావ‌డం కొంత ఆల‌స్య‌మైన‌ట్లు గుర్తించారు. ఈ విష‌యాన్ని ఆ పిల్ల‌ల త‌ల్లిదండ్రులే ధృవీక‌రించిన‌ట్లు రీసెర్చి చెప్పింది.
యూసేజ్ పెరిగితే రిస్కూ పెరిగింది!
స్మార్ట్ గాడ్జెట్ల వాడ‌కం ప్ర‌తి అర‌గంట పెరిగేకొద్దీ ఈ రిస్కు కూడా పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని రీసెర్చి చెప్పింది. ఇలా యూసేజ్ పెరిగేకొద్దీ 49% (అంటే స‌గం మంది ) చిన్నారుల్లో స్పీచ్ లెర్నింగ్ ఆల‌స్య‌మైంద‌ని ప్ర‌క‌టించింది. అయితే డివైస్‌ను చేతిలో ఉంచుకుని చిన్నారి ఆడుకోవ‌డానికి, స్పీచ్ లెర్నింగ్ లేట‌వ‌డానికి మ‌ధ్య రీజ‌నేంటో రీసెర్చి చెప్ప‌లేదు. పేరెంట్స్‌, సిబ్లింగ్స్‌తో ఇంట‌రాక్ష‌న్ లోగానీ, బాడీ లాంగ్వేజ్ లేదా గెస్చ‌ర్‌ల్లోగానీ ఎలాంటి తేడా ఐడెంటిఫై కాలేద‌ని వివ‌రించింది. ఇప్పుడు స్మార్ట్ గాడ్జెట్ల‌తో అంద‌రి ద‌గ్గ‌రా ఉంటున్నాయి. అందుకే చిన్నారుల‌కు వీటిని ఇవ్వ‌డాన్ని బాగా త‌గ్గించుకోవాల‌ని కెన‌డాలోని ద హాస్పిట‌ల్ ఫ‌ర్ సిక్ చిల్డ్ర‌న్ హెచ్చ‌రించింద‌ని కూడా రీసెర్చి ప్ర‌క‌టించింది. 18 నెల‌ల కంటే త‌క్కువ వ‌య‌సున్న పిల్ల‌ల‌కు ఇలాంటి స్క్రీన్డ్ గాడ్జెట్లు ఇవ్వ‌ద్ద‌ని అమెరిక‌న్ అకాడ‌మీ ఆఫ్ పీడియాట్రిక్స్ చేసిన సూచ‌న‌ను ఈ రిపోర్ట్ బ‌ల‌ప‌రిచింది.

జన రంజకమైన వార్తలు