ఐరోపా సమాఖ్య (EU)పరిధిలో తన యాప్స్‌ను వాడుకునే పరికరాలను తయారీ హార్డ్‌వేర్ కంపెనీల నుంచి ప్రతి డివైజ్‌పైనా 40 డాలర్లదాకా రుసుము వసూలు చేయాలని గూగుల్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం EU అమలు చేస్తున్న లైసెన్సింగ్ వ్యవస్థ పోటీతత్వం లోపించినదిగా భావిస్తున్నందున దాని స్థానంలో కొత్త చట్టం రంగప్రవేశం చేయనుంది. ఈ నేపథ్యంలోనే గూగుల్ తాజా నిర్ణయం తీసుకున్నదని అభిజ్ఞవర్గాల సమాచారం. తదనుగుణంగా ఐరోపా ఆర్థిక ప్రాంతంలో అక్టోబరు 29 నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలయ్యే ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ మోడల్స్ ధరపై అదనంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది కనిష్ఠంగా 2.5 డాలర్ల నుంచి ఆయా దేశం, డివైజ్ సైజ్, వ్యక్తులనుబట్టి పెరుగుతుందని సంబంధిత అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. అయితే, తయారీదారుల విషయంలో ఇది ప్రామాణికంగా 20 డాలర్ల వరకూ ఉంటుందట. గూగుల్ ప్లే యాప్‌స్టోర్, జీమెయిల్, గూగుల్ మ్యాప్స్‌సహా కొన్ని యాప్స్‌తో కూడిన ప్యాకేజీని ఎంచుకోవడంతోపాటు గూగుల్ సెర్చ్, క్రోమ్ బ్రౌజర్ తదితర ఫీచర్లను డివైజ్‌లలో ప్రముఖంగా చూపడానికి అంగీకరించడంద్వారా ఈ రుసుమును కంపెనీలు భర్తీ చేసుకోవచ్చు. ఈ మేరకు అంగీకారానికి వస్తే సెర్చ్, క్రోమ్ బ్రౌజర్‌ద్వారా గూగుల్ తనకు లభించే ప్రకటనల ఆదాయంలో కొంత భాగాన్ని సదరు పరికరాల తయారీ కంపెనీలకు బదలాయిస్తుంది. ప్రముఖ సాంకేతిక వార్తా పత్రిక ‘ది వెర్జ్’ ఇటీవలి తన కథనంలో ఈ విషయం తెలిపింది.
గూగుల్ నిర్ణయానికి దారితీసిన కారణాలేమిటి?
ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ను వాడుకునే EUలోని తమ భాగస్వామ్య హార్డ్‌వేర్ కంపెనీలపై గూగుల్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని ఐరోపా కమిషన్ అభిప్రాయపడింది. ఈ మేరకు తమ పరిధిలోని కంపెనీల ఉత్పత్తులలో గూగుల్ సెర్చ్, క్రోమ్ బ్రౌజర్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసేలా గూగుల్ ఒత్తిడి తెస్తున్నదని ఈ ఏడాది జూలైనాటి సమావేశంలో తీర్మానించింది. ఈ ఏకపక్ష ఆధిపత్యానికి చెక్ పెడుతూ రికార్డు స్థాయిలో 500 కోట్ల డాలర్ల జరిమానా విధించడమేగాక చట్టవిరుద్ధ విధానాలకు స్వస్తి చెప్పకపోతే అదనపు జరిమానా తప్పదని హెచ్చరించింది (ఈ ఆదేశాలపై గూగుల్ అప్పీల్ చేసింది). మరోవైపు తమ లైసెన్సింగ్ వ్యవస్థలో పోటీతత్వం లేనందువల్ల గూగుల్ ఆటలు సాగుతున్నాయని నిర్ణయానికొచ్చిన EU కమిషన్ కొత్త చట్టాన్ని తెచ్చింది. దీనివల్ల EUలోని కంపెనీలతో భాగస్వామ్యం దిశగా గూగుల్ ప్రత్యర్థులైన మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వంటి సంస్థలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. తద్వారా వాటి సెర్చ్ ఇంజన్లు, బ్రౌజర్లు తదితర యాప్‌లను డిఫాల్ట్‌గా EU తయారీ పరికరాల్లో ఇన్‌స్టాల్ చేసే వీలుంటుంది. గూగుల్ తీరును విమర్శించే ఫ్రాన్స్‌కు చెందిన ఓ చిన్న సెర్చ్ కంపెనీ ‘క్వాంట్’ ఈ పరిణామాలపై హర్షం వ్యక్తం చేసింది. ఐరోపా కమిషన్ చర్య ఫలితంగా EU తయారీ కంపెనీలు తమ వినియోగదారులకే ఎంపికను వదిలివేసే అవకాశం ఇచ్చే దిశగా గూగుల్ దిగిరాక తప్పలేదని అది వ్యాఖ్యానించింది.