డేటా ప్రొటక్షన్ పాలసీపై అభ్యంతరాలు సమర్పించాలని కంపెనీలకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చెప్పిన వారం రోజులకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్స్ డేటాకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం బయట డేటా ప్రాసెసింగ్ చేసిన అన్ని పేమెంట్స్ ను 24గంటల్లోపు ఇండియాలో స్టోర్ చేయాలని పేమెంట్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. పేమెంట్స్ డేటాను తప్పనిసరిగా స్థానికంగానే స్టోర్ చేయాలని 2018లోనే ఆర్బీఐ సదరు పేమెంట్స్ ఎంటీటీలకు పలుమార్లు సూచనలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రీక్వెట్లీ ఆస్క్‌డ్ క్వశన్స్ రూపంలో ఆర్బీఐ పలు అంశాలు వెల్లడించింది.
పేమెంట్స్ ఎంటీటీలు విదేశాల్లో ప్రాసెసింగ్ చేసిన పక్షంలో ఆ డేటాను 24 గంటల్లోగా భారత్‌కు తీసుకు రావాలని పేమెంట్ సిస్టం ఆపరేటర్లకు స్పష్టం చేసింది. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం పేమెంట్స్ డేటాను స్టోర్ చేసే విషయంలో పేమెంట్స్ సంస్థలకు మాత్రమే కాదని దేశంలోని అన్ని బ్యాంకులకు కూడా వర్తిస్తుందని ఓ నివేదిక తెలిపింది. వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ ప్రెస్, పే-పాల్, గూగుల్ పే, అమెజాన్ వంటి పేమెంట్ సంస్థలకు ఈ ఆదేశాలు వర్తించనున్నాయి. కాగా స్థానికీకరణ వల్ల తమ వ్యయాలపై ప్రభావం పడుతుందని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పేమెంట్స్ సిస్టమ్ ఆపరేటర్స్ (PSOs) ఇండియా బయట పేమెంట్ లావాదేవీలు ప్రాసెసింగ్ చేయాలనుకుంటే ఎలాంటి అడ్డుంకులు లేవు. ప్రాసెసింగ్ పూర్తి అయిన తర్వాత పేమెంట్స్ డేటా మాత్రం కచ్చితంగా ఇండియన్ సర్వర్లలోనే స్టోర్ కావాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. మొత్తం లావాదేవీల వివరాలు ఆ డేటాలో భాగంగా ఉండాలని తెలిపింది. లావాదేవీలకు సంబంధించిన మొత్తం వివరాలు, సమాచారం అన్నీ కూడా డేటాలో భాగమేనని పేర్కొంది. ఇందులో వినియోగదారు పేరు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్, ఆధార్, పాన్‌కార్డు వంటి సమాచారం, చెల్లింపు సమాచారం, ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్ వంటి చెల్లింపు వివరాలు, లావాదేవీల సమాచారం వంటివి ఉంటాయి.
ఇతర దేశాల్లో పేమెంట్స్ ప్రాసెసింగ్ కు సంబంధించి మొత్తం డేటాను తిరిగి ఇండియాలో స్టోర్ చేసేందుకు సెంట్రల్ బ్యాంకు సదరు పేమెంట్ సంస్థలకు 24 గంటల గడువు ఇచ్చింది. పేమెంట్స్ డేటాను వెనక్కి రప్పించే క్రమంలో ఛార్జ్ చేయడం కానీ, ఇతర రికన్సిలియేషన్ ప్రాసెస్ ఏదైనా ఉంటే అవసరమైతే వెంటనే చేపట్టాలని తెలిపింది. అది కూడా ఇండియాలోని సర్వర్ల నుంచి డేటాను యాక్సస్ చేసుకునేలా ఉండాలి.
కొన్ని సందర్భాల్లో విదేశాల్లో పేమెంట్స్ డేటాను డిలీట్ చేయాల్సిన అవసరం ఉంటే.. ముందుగా ఇండియా సర్వర్లలో డేటాను స్టోర్ చేయాలి. పేమెంట్ ప్రాసెసింగ్ జరిగిన సమయం నుంచి 24గంటలు గడిచిన తర్వాత (వన్ బిజినెస్ డే) డేటాను విదేశాల సర్వర్లలో డిలీట్ చేయాల్సి ఉంటుందని ఖైటాన్ అండ్ కో పార్టనర్, సుప్రటిమ్ చక్రవర్తి తెలిపారు. మరోవైపు విదేశీ బ్యాంకింగ్ డేటాను ఇండియా బయటి సర్వర్లలో స్టోర్ చేసుకోవచ్చునని క్లారిటీ ఇచ్చింది. దేశీయ బ్యాంకుల పేమెంట్స్ డేటా మాత్రమే భారత బ్యాంకింగ్ సర్వర్లలో స్టోర్ చేయాలని సెంట్రల్ బ్యాంకు స్పష్టం చేసింది. అలాగే.. దేశ సరిహద్దుల్లో జరిగే దేశీయ కంపోనెంట్ కు సంబంధించిన పేమెంట్స్ డేటాను విదేశాల్లో స్టోర్ చేసుకోనే అవకాశం ఉంది. కానీ, పేమెంట్స్ డేటాకు సంబంధించిన నకలు డేటా ఒకటి తప్పనిసరిగా ఇండియాలో ఉంచాల్సిన అవసరం ఉంది.