అమెరికాలోని శాన్‌కార్లోస్ నివాసి బ్రెండన్ అలెగ్జాండర్ ‘‘భవిష్యత్ రైతన్న’’ను మీకు పరిచయం చేస్తున్నాడు. ఈ భావితరం రైతు పేరు ‘‘యాంగస్’’... బరువు దాదాపు 454 కిలోలు! ఇంతటి మహాకాయం కాబట్టి కదలికలు కాస్త నెమ్మదిగానే ఉంటాయిగా. అయితేనేం.. ఈ రైతు బలం ఎంతటిదంటే- ఏకంగా 363 కిలోల కూరగాయల కొయ్య తొట్టెను అవలీలగా ఒకచోట నుంచి మరొకచోటకు మోసుకెళ్లగలడు. మానవమాత్రులు ఇంత బరువుండటం.. దాదాపు అంతే బరువును మోయగలగడం సాధ్యమేనా అని సందేహిస్తున్నారు కదూ? మీ అనుమానం నిజమే... యాంగస్ ఒక రోబో! ఈ భారీ రైతురోబోతోపాటు ఇతర చిన్న రోబోల సేవలతో వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు అలెగ్జాండర్. అందునా మెట్రో నగరాల్లో పాలకూర, తులసి, ఇతర కూరగాయలు సాగుచేస్తూ వ్యవసాయంలో ఖరీదైన కార్మిక వ్యయాన్ని తగ్గించడమేగాక జల సంరక్షణకూ ప్రాధాన్యం ఇస్తున్నాడు.
ఎవరీ అలెగ్జాండర్?
గూగుల్ ‘X’గా పేరొందిన ‘‘మూన్‌షాట్’’ లేబొరేటరీ రోబోటిక్స్ విభాగంలో ఇంజనీరుగా అలెగ్జాండర్ పనిచేశాడు. అయితే, అక్కడ అతడి బృందం ప్రధాన బాధ్యత డ్రోన్ల రూపకల్పన.. అక్కడే పనిచేస్తున్న జోన్ బిన్నీతో అతడికి స్నేహం కుదిరింది. అటుపైన వారిద్దరూ మేధోమథనం చేసి, ఐరన్ ఆక్స్ సంస్థకు ఊపిరిపోశారు. ఈ సంస్థకు అలెగ్జాండర్ సీఈవో కాగా, బిన్నీ సహ-వ్యవస్థాపక పాత్రతోపాటు చీఫ్ టెక్నాలజీ ఆఫీసరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కేవలం 33 ఏళ్ల వయసులోనే వీరిద్దరూ కలసి స్వయంచాలిత రోబోలతో వ్యవసాయం కోసం దాదాపు 60 లక్షల డాలర్ల మేర నిధులు సేకరించారు. అటుపైన ‘‘Iron Ox’’ అంకుర సంస్థను ఏర్పాటు చేసి రెండేళ్లపాటు కిందామీదా పడ్డారు. చివరకు ‘‘మూన్‌షాట్’’ లేబొరేటరీ సాధించలేని ఘనతను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రోబోలు సాగుచేసిన కూరగాయల సరఫరాకు సిద్ధమని అలెగ్జాండర్ ప్రకటించాడు. పైగా ‘‘మా రోబోలు పండించిన ఈ కూరగాయలతో చేసిన సలాడ్ మీరెన్నడూ ఎరుగనంత రుచిగా ఉంటుంది’’ అని ఊరిస్తున్నాడు.
ఐరన్ ఆక్స్ కంపెనీ ఏం చేస్తోంది?
కాలిఫోర్నియాలోని శాన్ కార్లోస్ పట్టణ శివారులో ‘‘ఐరన్ ఆక్స్’’ కంపెనీ 8 వేల చదరపు అడుగుల గిడ్డంగి ప్రాంగణంలో రోబో వ్యవసాయ క్షేత్రాన్ని తీర్చిదిద్ది పంటల సాగు చేపట్టింది. ఇక్కడ పండించే కూరగాయల అమ్మకానికి వ్యాపార సంస్థలతో ఎలాంటి ఒప్పందాలూ లేవు. కానీ, శాన్ ఫ్రాన్సిస్కో తీరప్రాంత రెస్టారెంట్లతో అలెగ్జాండర్ సంప్రదింపులు సాగిస్తున్నాడు. వచ్చే ఏడాదికల్లా తన రోబో వ్యవసాయ క్షేత్రం కూరగాయలు సూపర్ మార్కెట్లకు చేరే అవకాశం ఉందని ధీమాగా చెబుతున్నాడు. ఐరన్ ఆక్స్ దీర్ఘకాలిక లక్ష్యాల్లో భాగంగా ప్రకృతి సహజ సూర్యకాంతిపై అధికంగా ఆధారపడే గ్రీన్ హౌజ్‌లలో రోబో వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశానని చెప్పాడు. అత్యంత వ్యయభరితమైన హైపవర్ విద్యుద్దీప కాంతి ఆధారిత ఇన్‌డోర్ సాగుకన్నా ఇది ప్రకృతికి దగ్గరగా ఉంటుందన్నాడు. ఆరంభ దశలో నష్టదాయకమే అయినప్పటికీ తమ దిగుబడిని- మార్కెట్ ధరకన్నా తక్కువకే విక్రయిస్తూ పోటీలో నెగ్గుకొస్తామని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఐదేళ్లలో అమెరికాలోని అన్ని మెట్రో ప్రాంతాల్లో ఐరన్ ఆక్స్ రోబో వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపాడు.
మట్టితో పనిలేని వ్యవసాయం!
అమెరికా వ్యవసాయ రంగంలో పనికి కార్మికశక్తి పెద్దగా మొగ్గు చూపడంలేదు. అందుకే రోబోలతో సాగు, అందునా మట్టిరహిత (హైడ్రోపోనిక్) పద్ధతిలో వ్యవసాయమే మెరుగని అలెగ్జాండర్ అంటున్నాడు. అంతేకాకుండా రోబో క్షేత్రాల్లో జల సంరక్షణకూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాడు. తన ఇన్‌డోర్ రోబో క్షేత్రాల్లో భారీ బరువులెత్తే పనిని అన్ని దిశలకూ కదలగల చక్రాలతో నడిచే యాంగస్ చూసుకుంటుందని చెప్పాడు. పక్వానికి వచ్చిన పంట ఉత్పత్తులను మానవ కార్మికశక్తితో సేకరించినా, భారీ మొత్తంలో వాటిని ఒకచోట నుంచి మరో చోటికి యాంగస్ సునాయాసంగా తరలిస్తుందని తెలిపాడు. మరొక ‘అనామిక’ (ఇంకా పేరు పెట్టని రోబో) చిన్న పాదులలో కాస్త ఎదిగిన మొక్కలను తన యాంత్రిక హస్తంతో ‘సున్నితంగా’ తీసి, పెద్ద పాదుల్లోకి మారుస్తుందట. ఇలా వివిధ చిన్నచిన్న పనులు చేసే రోబోల యాంత్రిక హస్తాల కీళ్లకు రాపిడి సమస్య లేకుండా కూరగాయలకు హాని కలిగించని లక్షణంగల గ్రీస్ వాడతాడట. ఒక్కొక్క తొట్టెలోని సుమారు 250 మొక్కలను పెద్ద పాదుల్లోకి మార్చడం చాలా శ్రమతో కూడిన పనే అయినా అనామిక రోబో అలుపు లేకుండా చేసుకుపోతుంది. ఇప్పడిక పక్వానికి వచ్చిన పంటను గుర్తించి ఉత్పత్తిని సేకరించగల రోబో తయారీలో ఐరన్ ఆక్స్ నిమగ్నమై ఉందని అలెగ్జాండర్ చెప్పాడు. ‘‘రోబోల సాయంతో మానవాళి ఆకలి తీర్చగలిగితే ప్రపంచంపై ప్రభావం చూపగల ఘనకార్యం అంతకన్నా మరొకటి ఏముంటుంది?’’ అంటున్నాడతడు.