• తాజా వార్తలు

ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లాలంటే కావాల్సింది అక్షరాలా రూ.400 కోట్లు మాత్రమే

హెడ్ లైన్ చూడగానే ఆశ్చర్యపోయారా.. మరి నిజంగా జరిగితే ఇంకెంతలా ఆశ్చర్యపోతారు.  నాసా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తోంది.  అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు 2020నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేయనున్నట్లు నాసా ప్రకటించింది. ఈ క్రమంలో 30 రోజుల పాటు ప్రైవేట్‌ వ్యోమగాములు అంతరిక్షంలో గడిపేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టినట్టు వెల్లడించింది. 

అయితే ఇలా ఓ రాత్రి గడపాలనుకునే వారికి ఛార్జీ భారీగానే ఉండబోతోంది. నాసా చెప్పిన వివరాల ప్రకారం కక్షలో తిరుగుతున్న ఉపగ్రహంలో ఒక్క రాత్రి గడపాలనుకునే వారి నుంచి 35 వేల డాలర్లు(రూ.24 లక్షలు) చొప్పున వసూలు చేస్తామని తెలిపింది. మొత్తం రానుపోను చార్జీలతో కలిపి ఒక్కొక్కరికి రూ.400 కోట్ల వరకు ఖర్చవుతుందని నాసా వివరించింది.

అంతరిక్ష కేంద్రం నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ ప్రయత్నం దోహదపడుతుందని నాసా భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఏడాదిలో రెండు సార్లు ప్రైవేట్‌ వ్యోమగాములను అనుమతించేందుకు అవకాశముందని నాసా అధికారులు తెలిపారు. ఈ పర్యటనలను ఏడాదికి 12 వరకు పెంచే అవకాశం ఉందన్నారు. కాగా అమెరికాకు చెందిన వ్యాపారవేత్త డెన్నిస్‌ టిటో మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్లిన యాత్రికుడు. ఇందుకు రష్యాకు టిటో రూ.138 కోట్లు చెల్లించారు. ఇక మానవులను ఐఎస్‌ఎస్‌కు తీసుకువెళ్లేందుకు నాసాతో పాటు స్పేస్‌ఎక్స్‌ కూడా వివిధ ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే.

కాగా ఇప్పటికే చాలా కంపెనీలు తమ టెక్నాలజీలో ISSని కమర్షియల్ గా వాడుకుంటున్నాయి. ఈ కంపెనీలకు ఈ స్పేస్ టూరిజం మీద కూడా పోగ్రాంలు కండెక్ట్ చేసే దిశగా నాసా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను నాసా అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు