మేము చాలా పెద్ద తప్పు చేశాం, మీరు ఆ తప్పును చేయకండి. ఈ మాటలను అన్నది ఎవరో తెలుసా. టెక్ రంగాన్ని శాసిస్తున్న ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. మరి అంత పెద్ద తప్పు అతను ఏం చేశారా అని ఆశ్చర్యపోతున్నారా.. పర్యావరణాన్ని పరిరక్షించడంలో అతను ఫెయిలయ్యాడట. సాంకేతికంగా మానవుడు ఎంతో అభివృద్ధి చెందుతున్నానని అనుకుంటున్నాడు కానీ ఈ క్రమంలో పర్యావరణానికి జరుగుతోన్న నష్టాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నాడని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో తులెన్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న టిమ్ కుక్ అక్కడి యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో మా తరం విఫలమైంది. మేమంతా కేవలం చర్చల పేరిట సమయాన్నంతా వృథా చేశాం. మేం చేసిన తప్పు మీరు చేయకండి, ఈ తప్పు నుంచి గుణపాఠాన్ని నేర్చుకొని పర్యావరణ పరిరక్షణకు ముందడుగు వేయండని పిలుపునిచ్చారు.
భారత్ దీర్ఘకాలికంగా తమకు కీలకమైన మార్కెట్ గా భావిస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా మాత్రం భారత మార్కెట్‌లో చాలా సవాళ్లున్నాయని టిమ్ కుక్ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేయడం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం వంటి చర్యలతో భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భారత్‌లో పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార వ్యూహాల్లో కొన్ని మార్పులు చేశాం.ప్రాథమికంగా అవి కాస్త మెరుగైన ఫలితాలే ఇస్తున్నాయని కుక్ అన్నారు.
భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ సెగ్మెంట్‌లో తీవ్రమైన పోటీ కారణంగా గత నెలలో ఆపిల్ తమ ఐఫోన్ ఎక్స్‌ఆర్ రేటును ఏకంగా 22 శాతం తగ్గించింది. అలాగే దేశీయంగా తయారీ కూడా ప్రారంభించిన ఆపిల్.. క్రమంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. భారత్‌లో రిటైల్ స్టోర్స్ ఏర్పాటు కోసం అనుమతులు పొందేందుకు ప్రభుత్వంతో చర్చిస్తున్నామని కుక్ తెలిపారు. భారత మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధిపత్యం ఉంటుండటంపై స్పందిస్తూ.. తమ సంస్థ ఎదగడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయనడానికి దీన్ని నిదర్శనంగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు.
టెక్ దిగ్గజం ఆపిల్ అమ్మకాలు ఈ గతేడాది భారీగా పెరిగిన నేపథ్యంలో సంస్థ సీఈవో టిమ్ కుక్ జీతభత్యాలు గతేడాది ఏకంగా 22 శాతం పెరిగాయి. 2018లో ఆయన ఏకంగా 15.7 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 110 కోట్లు) ప్యాకేజీ అందుకున్నారు. ఇందులో 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 21 కోట్లు) మూల వేతనం కాగా, 12 మిలియన్ డాలర్ల (దాదాపు 84 కోట్లు) బోనస్, 6,80,000 డాలర్లు ఇతరత్రా భత్యాల కింద చెల్లించినట్లు యాపిల్ పేర్కొంది. 2018లో ఆపిల్ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా టిమ్ జీతభత్యాలు పెంచినట్లు సంస్థ వివరించింది. 2011లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన టిమ్ 2016లో 8.7 మిలియన్ డాలర్లు, 2017లో 12.8 మిలియన్ డాలర్లు వేతనంగా అందుకున్నారు.