• తాజా వార్తలు

నెలరాజు దగ్గరకు చంద్రయాన్ 2- ఎవ్వరికీ తెలియని కొన్ని నిజాలు మీ కోసం 

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైంది. ఇది భారతదేశ చరిత్రలో మరొక గర్వించదగిన క్షణం. ఈ ఉపగ్రహం దాదాపుగా 3 లక్షల కి.మీ.కు పైగా ప్రయానించి చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చేరనుంది. చంద్రయాన్‌-2 చంద్రుని కక్ష్య చేరేందుకు 45 రోజుల సమయం పట్టనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కక్ష్యలోకి ప్రవేశించిన అనంతరం ఉపగ్రహం నుంచి లాండర్‌ వేరుపడనుంది. ఇస్రో వ్యవస్థాపక శాస్త్రవేత్త విక్రమ్‌ సారాభాయ్‌ పేరును లాండర్‌కు పెట్టారు. అయితే దీని వెనుక దాగిన ఎన్నో ఊహించని విషయాలు, కొన్ని నిజాలు దాగి ఉన్నాయి. అవేంటో చూద్దాం. 

గత 60 ఏళ్లుగా చల్లని వెన్నెల కురిపించే నెల రాజు మీద పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. చందమామ విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని ఇప్పుడు దాని చుట్టు కొలత 10,921 కిలోమీటర్లు అని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనిని పరిశోధించడానికి ఇస్రో చంద్రయాన్ 2ని అంతరిక్షంలోకి పంపింది. చంద్రుడు భూమికి మధ్య దూరం పెరిగిపోతోందని, ఏడాదికి సుమారు 15 అంగుళాల చొప్పున చంద్రుడు దూరంగా వెళుతున్నాడని నాసా తెలిపింది. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై ఇస్రో పంపిన చంద్రయాన్ అధ్యయనం చేయనుంది. 

ప్రపంచంలో అంతరిక్ష ప్రయోగాలు చేసే దేశాలు చాలా వరకు ఇప్పటికి 125 ప్రయోగాలు చంద్రుడిపైకి చేపట్టినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 1958 నుంచి అమెరికా చంద్రునిపై 12 ప్రయోగాలు చేయగా అవి సక్సెస్ కాలేదు. ఆ తరువాత 13వ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపించగలిగింది. ఇప్పటిదాకా 58 ప్రయోగాలు చేసి 41 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 

రష్యా 1958 నుంచి చంద్రునిపైకి 53 ప్రయోగాలు చేసింది. అందులో 35 మాత్రమే విజయం సాధించాయి.1990 నుంచి జపాన్‌ ఆరు ప్రయోగాలు సొంతంగా, ఒక్క ప్రయోగం నాసాతో కలిసి చేయగా ఇందులో ఐదు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. 2010 నుంచి చైనా ఏడు ప్రయోగాలు చేయగా ఒక్క ప్రయోగంలో మాత్రమే చంద్రుని దాకా వెళ్లగలిగింది. జర్మనీ 2003లో చంద్రుని మీదకు ఆర్బిటర్‌ను విజయవంతంగా పంపించింది. ఇజ్రాయెల్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో చంద్రునిపైకి ల్యాండర్‌ను పంపించినా అది విజయవంతం కాలేదు. 

2008లో భారత్‌ చంద్రుడి మీదకు చంద్రయాన్‌–1 పేరుతో ఆర్బిటర్‌ ప్రయోగించి విజయం సాధించడమే కాకుండా చంద్రుడిపై నీటి జాడలున్నాయని కనుగొంది. తాజాగా, భారత్‌ రెండో సారి ఆర్బిటర్‌ ద్వారా ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దింపి అందులో అమర్చిన రోవర్‌తో చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు సిద్ధమవుతోంది. చంద్రుడు, అంగారకుడు మీదకు రోవర్లు పంపిన అన్ని దేశాలు పెద్ద పెద్ద బాల్స్‌ వంటి వాటిలో రోవర్లను అమర్చి పంపారు. అయితే భారత్‌ మాత్రం ల్యాండర్‌ను ఎటువంటి బాల్స్ లేకుండా చందమామపై నేరుగా దించనుంది. చంద్రయాన్‌2 మిషన్‌లోని ల్యాండర్‌కు శాస్త్రవేత్తలు ‘విక్రమ్‌’గా నామకరణం చేశారు.  

కాగా 1471 కేజీల బరువున్న ఈ ల్యాండరే ప్రయోగంలో అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు. ఆర్బిటర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌ చంద్రుడిపైకి దిగే 15 నిమిషాలే ఈ ప్రయోగంలో ఉత్కంఠకు గురిచేసే అంశంగా చెప్పవచ్చు. ల్యాండర్‌ ‘విక్రమ్‌’చంద్రుడి వైపు నిమిషానికి 2 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే ప్రక్రియ చాలా సంక్లిష్టమైంది. ల్యాండర్‌ చంద్రుడిపై సురక్షితంగా దిగగలిగితే ఈ ప్రయోగం సక్సెస్‌ అయినట్లే. ఈ ల్యాండర్‌లో శాస్త్రవేత్తలు 3 పేలోడ్స్‌ను అమర్చారు. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ‘థర్మో–ఫికల్‌ ఎక్స్‌ఫర్‌మెంట్‌’ప్లాస్మా సాంద్రతను పరిశోధించేందుకు ‘లాంగ్‌ ముయిర్‌ ప్రోబ్‌’, చంద్రుని మూలాలను తెలుసుకోవడానికి ‘ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సీయాస్మిక్‌ యాక్టివిటి’అనే పరికాలను చంద్రయాన్‌–2లో ప్రయోగించారు.

జీఎస్‌ఎల్వీ మార్క్‌3 రాకెట్‌ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్‌–2 కాంపోజిట్‌ మాడ్యూల్స్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌ ఉంటాయి. ముందుగా ఆర్బిటర్‌ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ అక్కడి సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. అనంతరం కొద్దిసేపటికే ల్యాండర్‌ నుంచి రోవర్‌ బయటకొచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు జరుపుతుంది.ఈ మూడు పరికరాలు సమన్వయంతో పనిచేస్తూ బెంగళూరులోని బైలాలులోని భూనియంత్రిత కేంద్రానికి డేటాను పంపిస్తాయి. ఇందులో ల్యాండర్‌ 14 రోజులే పనిచేస్తుంది. ఆర్బిటర్‌ చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఏడాది పాటు సేవలు అందిస్తుంది. మొత్తంగా ఈ ప్రయోగానికి రూ. 978 కోట్లు వెచ్చించారు.

రోవర్‌ కు ‘ప్రజ్ఞాన్‌’ అని పేరుపెట్టారు. 27 కిలోల బరువుండే ఈ ప్రజ్ఞాన్‌ సౌరశక్తితో ప్రయాణిస్తుంది. సెకన్‌కు ఒక సెంటీమీటర్‌ చొప్పున చంద్రుడిపై రోజుకు 500 మీటర్లు ప్రయాణిస్తూ అక్కడి ఉపరితలంపై ఉన్న అణువులను విశ్లేషించి డేటాను ల్యాండర్‌కు పంపుతుంది. ల్యాండర్‌ ఈ  డేటాను ఆర్బిటర్‌కు చేరవేస్తే, అక్కడి నుంచి సమాచారం బెంగళూరులోని భూనియంత్రిత కేంద్రానికి చేరుతుంది. 

ఈ రోవర్‌కు ముందుభాగంలో మెగా పిక్సెల్‌ సామర్థ్యమున్న రెండు మోనోక్రోమాటిక్‌ నావ్‌ కెమెరాలున్నాయి. ఇవి ప్రజ్ఞాన్‌ ఉన్న ప్రదేశానికి సంబంధించిన 3డీ ఫొటోలను పంపుతాయి. ఈ రోవర్‌లో 2 పేలోడ్స్‌ ఉన్నాయి. ఇందులోని ఆల్ఫా పర్టికల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, లాజర్‌ ఇన్‌డ్యూసెడ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ అనే పరికరాలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? అక్కడి పరిస్థితులు ఏంటి? అనే విషయాలతో పాటు పలు అంశాలపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనుంది. ఈ రోవర్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన లాజర్‌ రెట్రోరెఫ్లెక్టర్‌ అర్రే పరికరాన్ని కూడా అమర్చారు. ఈ పరికరం చంద్రుడి అంతర్భాగంతో ఏముందో పరిశోధించి నాసాకు పంపిస్తుంది. 

భారతదేశ చరిత్రలో మొదటిసారి, ఇస్రో యాత్రకు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారు. చంద్రయాన్‌-2 ప్రయోగానికి ముత్తయ్య వనిత ప్రాజెక్ట్ డైరెక్టర్ కాగా, రితు కరిధల్ చంద్రయాన్ -2 మిషన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రయోగం విజయవంతం కావడంలో మహిళల పాత్ర కూడా కీలకం. దాదాపు 30శాతం మంది మహిళలు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు. భారతదేశపు అంతరిక్ష మిషన్ చరిత్రలో మొదటిసారి మహిళా శాస్త్రవేత్తల నేతృత్వంలో ప్రయోగం జరిగింది. ఈ మిషన్‌ విజయవంతం కావడానికి కృషి చేసిన మహిళా శాస్త్రవేత్తలను యావత్‌ దేశం ప్రశంసిస్తోంది.


 

జన రంజకమైన వార్తలు