చైనా దిగ్గజం హువాయి సంచలన నిర్ణయంతో అమెరికాకు షాకిచ్చింది. అమెరికాలో భద్రతా పరంగా ముప్పు ఉందని అంచనా వేస్తున్న ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ హువాయి రష్యాతో కీలక ఒప్పందాన్ని చేసుకుంది. రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు గాను రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా అమెరికాలో ఇబ్బందులు కొనసాగుతుండగా మరోవైపు రష్యాలో 5జీ సేవలను అభివృద్ధి చేసేందుకు ఈ కీలక డీల్‌ను కుదుర్చుకుంది.
2019-20 నాటికి 5జీ టెక్నాలజీకోసం రష్యా టెలికాం సంస్థ ఎంటీఎస్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మాస్కోలో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమక్షంలో రెండుకంపెనీలు ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. వచ్చే ఏడాది నాటికి ఈ కంపెనీలు రష్యాలో 5జీ టెక్నాలజీ అభివృద్ధి చేస్తాయి. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును 2019 లేదా 2020లో కానీ ప్రారంభిస్తారని ఎంటీఎస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందంతో రష్యా చైనా దేశాల వ్యూహాత్మక బంధం మరింత బలపడిందంటూ హువాయి అధినేత గువోపింగ్ సంతోషం వ్యక్తం చేశారు.
అమెరికా టెక్నాలజీని ఇతర దేశాలకు అమ్మడంపై ట్రంప్ సర్కార్ నిషేధం విధించడంతో చైనాకు చెందిన హువాయ్ కంపెనీ గత మే నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. . ఇలా అమెరికా టెక్నాలజీ వినియోగించి తమ దేశంపైనే గూఢచర్యంకు కొన్ని దేశాలు దిగుతున్నాయన్న అనుమానం రావడంతో ట్రంప్ అమెరికాలో తయారయ్యే టెక్నాలజీని ఇతర దేశాలకు విక్రయించరాదనే నిర్ణయం తీసుకున్నారు. ఇక మూడునెలల్లో ట్రంప్ నిర్ణయం అమల్లోకి రానున్న నేపథ్యంలో అమెరికాలోని హువాయ్ కంపెనీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తమ ఫోన్ల తయారీకి అమెరికా ఉత్పత్తి చేసే చిప్స్‌నే వాడుతున్నారు. ఇప్పటికే హువాయ్ సంస్థ నుంచి చాలా కంపెనీలు దూరంగా వెళ్లిపోయాయి.ఇక బ్రిటన్‌లో కూడా తన సేవలను విస్తరించాలని భావించింది హువాయ్ కంపెనీ. అయితే బ్రిటన్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా దానిపై థెరిసా మే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇప్పటి వరకు టెలికం పరికరాలను ఉత్పతి చేయడంతో మేటి సంస్థగా ఉన్న చైనాకు చెందిన హువాయి 5జీ టెక్నాలజీలో ముందుంది. దీంతో చైనాకు ఈ రంగంపై పట్టు వస్తే అమెరికా పై నిఘాపెట్టే అవకాశం లభిస్తుంది. అందుకే ఇటీవల ట్రంప్ హువాయి పరికరాలు వినియోగంపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు తాజాగా హువాయి అమెరికా బద్ధ విరోధి అయిన రష్యాకు 5జీ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. ఈ ఒప్పందం సైబర్‌వార్‌ఫేర్‌లో రష్యాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే రక్షణ పరంగా చైనా, రష్యాలు అమెరికాకు వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో ఏకమయ్యాయి. ఇప్పుడు 5జీ రంగంలో ఈ రెండు జట్టుకట్టడం అమెరికాకు కచ్చితంగా ఒక షాకేనని చెప్పవచ్చు.