• తాజా వార్తలు

ప్రపంచంలో ఫస్ట్ 5జీ వీడియో కాల్‌ని  ప్రదర్శించిన ఎరిక్సన్‌

 దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా 4జీతో దేశం అబ్బురపడిపోయింది. 4జీ సేవలను వాడుతున్న యూజర్లు అయితే దాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. ఇంకా దేశంలో 4జీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకుండానే ఇప్పుడు 5జీ స్టార్టయింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2019లో స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్‌ 5జీ లైవ్‌ వీడియో కాల్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రదర్శించింది. భారత్‌లో తొలి 5జీ వీడియో కాల్‌ అని, క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్‌ హెడ్‌(సౌత్‌ ఈస్ట్‌ ఏషియా, ఓషియానియా, ఇండియా) నున్‌జో మిర్టిల్లో చెప్పారు. 5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్‌(ఎమ్‌ఎమ్‌వేవ్-28 గిగాహెట్జ్, 38 గిగాహెట్జ్‌ స్పెక్ట్రమ్‌ బాండ్స్‌) స్పెక్ట్రమ్‌ ద్వారా అందుతాయని వివరించారు. 5జీ, 4జీ మొబైల్‌ నెట్‌వర్క్స్‌కు ఎమ్‌ఎమ్‌వేవ్‌ స్పెక్ట్రమ్‌ కీలకమైందని అన్నారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ), మెషీన్‌ టు మెషీన్‌ కమ్యూనికేషన్స్‌ వంటివి 5జీలో కీలక పాత్రను పోషిస్తాయని తెలిపారు. 5జీ ఇండియాలో శరవేగంగా ముందుకు వస్తుందని , 2020 నాటికి 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు పెరుగుతాయని క్వాల్‌కామ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజెన్‌ వగాడియా తెలిపారు. ఇంటర్నెట్‌ స్పీడ్‌ అధికంగా ఉండే 5జీ సర్వీస్‌లు  భారత్‌లో ఇంకా ఆరంభం కాలేదు. ఈ సర్వీసులు ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాల్లో లభిస్తున్నాయి. 5జీ సర్వీసులకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేలం వేయనున్నామని ప్రభుత్వం  ప్రకటించిన విషయం తెలిసిందే. 5జీ టెక్నాలజీని టార్గెట్ చేస్తూ సాగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2019 ఈవెంట్లో 500 టెలికాం సంస్థలు, 250 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. తమ నూతన సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించాయి. 

జన రంజకమైన వార్తలు