మీరు విండోస్ 7 వాడుతున్నారా, అయితే మీరు వెంటనే దాన్నుంచి లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు మారండి. లేకుంటే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్ డేట్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి సెక్యూరిటీ, టెక్నికల్ అప్‌డేట్స్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. 2020 జనవరి 14 నుంచి అప్‌డేట్స్‌ను నిలిపేస్తామని, యూజర్లు మెరుగైన లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌కు మారాల్సి ఉంటుందని పేర్కొంది.
యూజర్లు సులభంగా కొత్త ఓఎస్‌కు మారేలా బైబ్యాక్, ఎక్సే్చంజ్ ఆఫర్లు ప్రకటించడంతో పాటు చౌకగా డివైస్‌లను తయారు చేసేలా డెల్, హెచ్‌పీ వంటి కంప్యూటర్స్ తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు మైక్రోసాఫ్ట్ వివరించింది.‘2020 జనవరి 14 నుంచి విండోస్ 7కు సపోర్ట్ నిలిపివేస్తున్నాం.ఆ తర్వాత నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి సెక్యూరిటీ, టెక్నికల్ అప్‌డేట్స్ లభించవు. కాబట్టి ఈ ఓఎస్‌పై నడిచే కంప్యూటర్ డివైజ్‌లకు రిస్కులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని లేటెస్ట్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ కావడం శ్రేయస్కరం‘ అని మైక్రోసాఫ్ట్ ఇండియా గ్రూప్ డైరెక్టర్ ఫర్హానా హక్ తెలిపారు.
వినియోగదారులు విండోస్ 10 ఆధారిత పీసీ, ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్‌లను కొనుగోలు చేయొచ్చని, వీటిల్లో మరింత సురక్షితమైన, అప్‌డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయని వివరించారు. టెక్‌ఐల్ నివేదిక ప్రకారం దేశీ చిన్న తరహా సంస్థలు నాలుగేళ్ల క్రితం నాటి కంప్యూటర్ నిర్వహణపై సగటున రూ. 93,500 ఖర్చు చేస్తున్నాయని, ఇది దాదాపు మూడు కొత్త తరం కంప్యూటర్స్ రేటుకు సరిసమానమని హక్ పేర్కొన్నారు.