• తాజా వార్తలు

మార్కెట్‌లో నుంచి జియో ఫోన్ గాయబ్.. ఎందుకో తెలుసా?

దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ఫీచర్‌ఫోన్‌ యూజర్‌లే టార్గెట్‌గా రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియో ఫోన్ గుర్తుందా? ఫీచర్ ఫోన్ అయినా కొన్ని స్మార్ట్ ఫోన్ ఫీచర్లు కూడా ఉండడంతో జనం దీన్ని ఆసక్తిగానే చూశారు. స్మార్ట్‌ఫోన్ల‌కు వేలకు వేలు ఖర్చుపెట్ట‌లేనివారు పదిహేను వందల రూపాయలతో జియో ఫోన్ కొని వాడుతున్నారు కూడా. అయితే ఈ ఫోన్ మార్కెట్ నుంచి త్వరలో మాయమవబోతోంది. దీని ప్లేస్‌లో కొత్తగా మరో ఫోను ను జియో తీసుకు రాబోతోంది.

స‌ప్ల‌యి ఆపేసింది
టెలికాం ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం జియో తన ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం 500 రూపాయల‌లోపే మరో ఫీచర్‌ఫోన్ తీసుకురాబోతోంది. అందుకే మార్కెట్లో ఉన్న జియో ఫోన్ సప్లై ఆపేసింది. ఇప్పుడు జియో అవుట్లెట్స్ లో జియో  ఫోన్ దొరకటం లేదు.  ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ ఫోన్ అందుబాటులో లేదు. ఎక్క‌డ‌న్నా ఒక‌టీ రెండూ ఉన్నా అవి ఈ మ‌ధ్య వ‌చ్చిన‌వి కావు. అంటే స‌ప్ల‌యి ఆపేసి చాలాకాల‌మే అయింద‌న్న‌మాట‌.

జియో ఫోన్ లైట్
ఇండస్ట్రీ వర్గాల కథనం ప్రకారం జియో కొత్త ఫీచర్ ఫోన్‌కి జియో ఫోన్ లైట్ అని పేరు పెట్టినట్లు సమాచారం. దీని ధర 399 రూపాయలు ఉంటుంద‌ని  తెలుస్తోంది. అయితే ఇందులో ఫీచ‌ర్లు జియో ఫోన్ మాదిరిగానే ఉంటాయా?  కొన్ని త‌గ్గిస్తారా అనేది క్లారిటీ లేదు.

ఇప్పుడు ఎందుకు?
ట్రాయ్ రూల్స్‌తో జియో ఇటీవల ధరలు పెంచింది. దీంతో ఎయిర్‌టెల్‌, ఐడియా టారిఫ్‌ల‌కు జియో టారిఫ్‌ల‌కు పెద్ద తేడా లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో జియో వినియోగదారులు వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ వైపు మొగ్గుచూపుతున్నారని భావిస్తోంది. అందుకే అతి తక్కువ ఖరీదులో మంచి ఫీచర్లున్న ఫోన్ తీసుకొచ్చి, టారిఫ్ కూడా ఆ స్థాయిలో పెడితే పేదలను కూడా వినియోగదారులుగా మార్చుకోవచ్చని జియో భావిస్తోంది. చూద్దాం జియో ఫీచర్ ఫోన్ లైట్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో.