• తాజా వార్తలు

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్, ఏముంది అందులో ?

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో దుమ్మురేపింది. శాంసంగ్‌ ఇటీవల  లాంచ్‌ చేసిన లగ్జరీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఫోల్డ్‌ విక్రయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.  ప్రీ బుకింగ్‌లు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే  ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ హాట్‌ కేకుల్లా బుక్‌ అయిపోయింది. అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-బుకింగ్‌లు  మొదలు పెట్టిన 30 నిమిషాల వ్యవధిలో మొత్తం 1,600 యూనిట్ల గెలాక్సీ ఫోల్డ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ కంపెనీ విక్రయించింది. బుకింగ్ లు అంతకంతకు పెరుగుతుండటంతో దీని  ప్రీ-బుకింగ్స్‌ను మూసివేసింది. కాగా ఫోన్‌లను ముందే బుక్ చేసుకున్న కొనుగోలుదారులు మొత్తం రూ. 1,64,999 ముందస్తుగా చెల్లించి మరీ వీటిని సొంతం చేసుకోవడం విశేషం.  అక్టోబర్ 20న  ఇవి వినియోగదారుల చేతికి రానున్నాయి. అయితే ధర ఆపిల్ లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 11 కన్నా ఎక్కువగా ఉన్నప్పటికీ వినియోగదారులు ఈ ఫోన్ కోసం ఎగబడ్డారు. మరి అంతలా ఏముంది ఈ ఫోన్లో ఓ సారి పరిశీలిస్తే..

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ ఆరు కెమెరాలతో వస్తుంది. అలాగే 4.6-అంగుళాల సింగిల్‌ ఫోల్డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఇది విప్పినప్పుడు 7.3 అంగుళాల వరకు డిస్‌ప్లే విస్తరిస్తుంది. బయటి 21: 9 స్క్రీన్ 840x1960 రిజల్యూషన్ , మరో స్క్రీన్ 1,536 x 2,152 రిజల్యూషన్ కలిగి ఉంటుంది.  ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఛార్జింగ్ చాలా వేగంగా అందుకుంటుంది. 

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్‌ ఫీచర్లు
7.3 అంగుళాల ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లే, 12 జీబీ రామ్‌, 512 జీబీ  స్టోరేజ్‌, కవర్‌ డిస్‌ప్లేపై 10 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఇంటర్నల్‌ డిస్‌ప్లేపై 10 ఎంపీ,,8 ఎంపీ కెమెరాలు, వెనుకవైపు 16 ఎంపీ, 12 ఎంపీ,, 12 ఎంపీ ట్రిపుల్‌ కెమెరాలు, 4380 ఎంఏహెచ్‌ బ్యాటరీ