ఇంటర్నెట్ ఎంతగా విశ్వవ్యాప్తమైనా కూడా భారత్ లో ఇంకా పూర్తిస్థాయిలో అందరికీ చేరలేదు. మొబైల్ ఫోన్ కనెక్షన్లతో పోల్చినప్పుడు భారత్ లో నెట్ వినియోగం చాలా తక్కువగానే ఉంది. ముఖ్యంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ అసమానత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాజా అధ్యయనాల ఈ విషయం వెల్లడిస్తున్నాయి. ఐటీరంగంలో శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం చేశారు. తాజా అధ్యయనం ప్రకారం అల్పాదాయ వర్గాల్లో 82 శాతం మంది ఇంకా నెట్ వినియోగానికి దూరంగానే ఉన్నారు. 56 శాతం కుటుంబాల్లో ఇంటర్నెట్ వాడుతున్నవారు ఒక్కరు కూడా లేరు. 16 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కుల్లో 43 శాతం మంది ఇంటర్నెట్ వినియోగానికి దూరంగా ఉన్నారట. బెంగళూరు, ఢిల్లీ, పుణె వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. పెద్దగా అభివృద్ధి చెందని నగరాలు, పట్టణాల్లో నెట్ వాడకం మరింత తక్కువగా ఉంది. - అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చి సెంటర్ లెక్కల ప్రకారం భారతీయ వయోజనుల్లో 22 శాతం మందే నెట్ వాడుతున్నారు. ఈ విషయంలో ప్రపంచ సగటుకు మనం చాలా దూరంలో ఉన్నాం. ప్రపంచంలో వయోజనుల్లో సగటున 67 శాతం మంది నెట్ వినియోగిస్తున్నారు. - నైజీరియా, కెన్యా, ఘనా, ఇండోనేసియా వంటి దేశాలు కూడా ఈ విషయంలో మన కంటే ఎంతో ముందున్నాయి. పలు దేశాల్లో వయోజనుల ఇంటర్నెట్ వాడకం ఇలా..
శాతం పరంగా ఇండియా ఇంటర్నెట్ వినియోగంలో వెనుకబడినా సంఖ్యాపరంగా మాత్రం రోజురోజుకూ ముందంజవేస్తోంది. 2016లో 40 కోట్ల మంది ఇంటర్నెట్ వాడకందార్లతో ఇండియా అమెరికాను దాటి రెండో స్థానానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 60 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులతో చైనా అగ్రస్థానంలో ఉండగా అమెరికా రెండు, ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి. డిజటల్ అసమానత.. ఇండియాలో ఇంటర్నెట్ వినియోగంలో స్త్రీ, పురుషుల మధ్య తీవ్ర అంతరం ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. పురుషుల్లో 42 శాతం మంది ఇంటర్నెట్ వినియోగానికి దూరంగా ఉండగా మహిళల్లో ఇది 74 శాతంగా ఉంది. మొబైల్ వినియోగంలో ఉన్న వివక్ష, వ్యత్యాసాలే దీనికి కారణమని చెబుతున్నారు. సాధారణంగా అనేక కుటుంబాల్లో పురుషులే మొదటి ప్రాధాన్యంగా స్మార్టు ఫోన్లను ఉపయోగిస్తున్నారు. వారు వాడి వదిలేసిన ఫోన్లను మహిళలు ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా స్మార్టు ఫోన్ల వినియోగంలోనే పురుషులు, మహిళల మధ్య భారీ అంతరం కనిపిస్తోంది. అలాగే పిల్లల విషయంలోనూ తల్లిదండ్రులు స్మార్లు ఫోన్లను ఎక్కువగా అబ్బాయిలకే కొనిస్తున్నారు. వారు తమ పాకెట్ మనీ నుంచి మిగుల్చుకుని మొబైల్ ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఈ కారణంగా ఇంటర్నెట్ వాడకం విషయంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇటీవల గుజరాత్ లో ఓ గ్రామంలో ఆడపిల్లలు ఫోన్ వాడడాన్ని నిషేధించారు. ఇలాంటి కారణాలు కూడా మహిళల ఇంటర్నెట్ వాడకంపై ప్రభావం చూపుతున్నాయి. విద్యతోనే మార్పు... దేశంలో 14 శాతం కుటుంబాల్లో కనీసం పదో తరగతి చదివినవారు కూడా లేరు. ఆ కుటుంబాల్లో చాలావరకు ఇంటర్నెట్ వాడకానికి దూరంగా ఉన్నాయి. ప్రాథమిక విద్య మాత్రమే ఉన్నవారు, లేదంటే అసలు చదువుకోని వారు ఉన్న కుటుంబాల్లో కేవలం 3 శాతం కుటుంబాలే ఇంటర్నెట్ వాడుతున్నాయి. సెకండరీ, హైస్కూలు స్థాయి విద్యావంతులు ఉన్న ఇళ్లలో57 శాతం.. ఇంటర్మీడియట్ స్థాయి విద్యావంతులు ఉన్న ఇల్లలో 65, డిగ్రీ చదివినవారు ఉన్న ఇళ్లలో 83 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. కుర్రాళ్లే కనెక్టవుతున్నారు.. ఇంటర్నెట్ వినియోగంలో కుర్రాళ్లే ముందుంటున్నారు. ముఖ్యంగా టీనేజర్లు ఇంటర్నెట్ ను కాచివడపోస్తున్నారు. 16 నుంచి 20 ఏళ్లవారిలో 64 శాతం... 21 నుంచి 25 ఏళ్లవారిలో 39 శాతం... 26 నుంచి 30 ఏళ్ల వారిలో 26 శాతం.. 31 నుంచి 35 ఏళ్ల వారిలో 15 శాతం.. 35 ఏళ్లు దాటినవారిలో 7 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. - ఇంటర్నెట్ వాడనివారిలో 27.5 శాతం మంది తమకు దానిపై అవగాహన లేక వాడడం లేదని చెబుతున్నారు. - వాడుతున్నవారిలో 35 శాతం మంది పురుషులు, 24 శాతం మంది మహిళలు అది తమ ఆత్మవిశ్వాసాన్ని, నాలెడ్జిని పెంచిందని చెబుతున్నారు. - ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవడానికి సహాయపడుతోందని 8 శాతం మంది చెప్పారు. |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||