• తాజా వార్తలు

సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారికి 3 అలెర్టులు ప్రకటించిన పోలీసులు

స్మార్ట్ ఫోన్లు ఎంత తక్కువ ధరకు  దొరుకుతున్నా ఇంకా సెకండ్  హ్యాండ్ ఫోన్లకు గిరాకి  ఉంది.  ముఖ్యంగా యాపిల్, వన్ ప్లస్, శ్యాంసంగ్ గాలక్సీ సిరీస్ వంటి  ఫ్లాగ్షిప్ ఫోన్లు అందరూ కొనలేరు. ఎందుకంటే వీటిధరలు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆ స్థాయి ఫోన్లు కొనాలనుకునేవారు చాలా మంది సెకండ్ హ్యాండ్ లోనైనా వాటిని కొనుక్కుంటారు. అయితే ఇలా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఢిల్లీ పోలీసులు. లేకపోతే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఎలా  మోసం చేస్తారంటే..
* ఎక్కడో దొంగిలించిన ఫోనెను మీకు అమ్మే ప్రమాదం ఉంది. పోలీస్ విచారణలో దొరికితే మీరు బుక్కయిపోతారు.

* ఫ్లాగ్ షిప్ ఫోన్లకు కాపీ ఫోన్లు మార్కెట్లో 10 వేలల్లోపే దొరుకుతాయి. అలాంటి వాటిని మీకు అంటగట్టి ఎక్కువ డబ్బు గుంజేస్తారు.                                        

ఇవీ ఆ మూడు జాగ్రత్తలు
సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు మూడు జాగ్రత్తలు పాటిస్తే చాలు అంటున్నారు ఢిల్లీ పోలీసులు. ఆ మూడు జాగ్ర‌త్త‌లేమిటో చెబుతూ మార్చి 1న వాళ్లు ఓ ట్వీట్ చేశారు. ఆ జాగ్ర్త్త‌త్త‌లు ఏమిటంటే

  1. ఎవ‌రైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్మ‌డానికి కంగారు ప‌డుతున్నారంటే అనుమానించాల్సిందే.  ఎందుకంటే అది ఎక్క‌డో కొట్టుకొచ్చిన ఫోన్ అయి ఉంటుంది. అలాంటిది కొంటే చిక్కుల్లో ప‌డే ప్ర‌మాదం ఉంది.

2. ఫోన్ కొనాల‌ని మీరు ప్ర‌య‌త్నిస్తే క్యాష్ రూపేణా మాత్ర‌మే ఇవ్వ‌మ‌ని అడుగుతున్నారా? ఆన్‌లైన్ పేమెంట్ వ‌ద్దంటున్నారా? అయితే అవ‌త‌లి వ్య‌క్తి త‌న ఐడెంటిటీ దొర‌క్కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌న్న‌మాట‌. ఇలాంటప్పుడు మీరు కూడా జాగ్ర‌త్త‌ప‌డాలి.

3. క్యూఆర్ కోడ్ పంపి దాన్ని స్కాన్ చేసి మిమ్మ‌ల్ని పే చేయ‌మంటున్నాడంటే సెల్ల‌ర్ మీకు తానెవ‌రో తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నార‌న్న‌మాట‌.

మ‌రేం చేయాలి
* సాధ్య‌మైనంత వ‌ర‌కు అమ్మే వ్య‌క్తి ఎవ‌రో చూసి కొనుక్కోండి.
* ఒరిజిన‌ల్ బిల్లు ఇమ్మ‌ని అడ‌గండి.  అప్పుడు ఆ ఫోన్ అత‌నిదా కాదా తెలిసిపోతుంది.
* క్యాష్ కాకుండా ఆన్‌లైన్‌లో పే చేయ‌డానికే ప్ర‌య‌త్నించండి. రేపు ఏద‌న్నా స‌మ‌స్య వ‌చ్చినా మీ ద‌గ్గ‌ర ఒక ప్రూఫ్ అన్నా ఉంటుంది.

జన రంజకమైన వార్తలు