ప్రపంచంలోనే అతి భారీ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ‘‘ఆయుష్మాన్ భారత్-జాతీయ ఆరోగ్య రక్షణ పథకం (AB-NHPM)’’ అధికారికంగా ప్రారంభమైంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని 10 లక్షల కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల విలువైన ఉచిత ఆరోగ్య బీమాను అందిస్తుంది. అంటే కుటుంబానికి సగటున ఐదుగురు సభ్యుల వంతున 50 కోట్ల మంది భారతీయులకు దేశంలో ఎక్కడైనా చికిత్స పొందగల సౌకర్యంతో లబ్ధి చేకూరుతుంది. మరి మీరు ఈ బీమా పొందగల అర్హుల జాబితాలో ఉన్నారా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఝార్ఖండ్‌లోని రాంచీలో ఇటీవలే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్ఠాత్మక ఆరోగ్య రక్షణ పథకం కింద దాదాపు 10.74 కోట్ల కుటుంబాలకు ఎంపికచేసిన జాబితాలోగల దేశవ్యాప్త ఆస్పత్రులలో పూర్తి ఉచిత ఆరోగ్య రక్షణ సేవలు లభిస్తాయి.
ఈ ఆరోగ్య బీమా కార్యక్రమ అవసరం ఏమిటి?
మన దేశ ఆరోగ్య రంగం రికార్డు ఏమంత మెరుగైనది కాదు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో 85.9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 82 శాతం, కుటుంబాలకు ఆరోగ్య రక్షణ లేదని జాతీయ నమూనా అధ్యయన సంస్థ (NSSO) నిర్వహించిన 71వ అధ్యయనంలో తేలింది. అలాగే భారతీయులలో 17 శాతం మాత్రమే తమ నెలవారీ ఆర్జనలో కనీసం 10 శాతందాకా ఖర్చు చేయగలుగుతున్నారు. మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే మొత్తం కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయే దుస్థితి ఉంది. అందుకే, కొత్త పథకం కింద 1,350 మెడికల్ ప్యాకేజీలను సృష్టించారు. వీటిలో సర్జరీ, మెడికల్, డే-కేర్ చికిత్సలతోపాటు మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు, రవాణా సదుపాయం కూడా అంతర్భాగంగా ఉంటాయి.
ఆధార్ కార్డు తప్పనిసరా?
ప్రభుత్వం ప్రతిదాన్నీ ఆధార్‌తో ముడిపెడుతున్న నేపథ్యంలో... ఈ పథకం కింద ఆరోగ్య రక్షణ పొందడానికి మాత్రం ఆధార్ కార్డు తప్పనిసరికాదు. దీనితోపాటు ఓటర్ కార్డ్, రేషన్‌కార్డు ఉన్నా లబ్ధి పొందవచ్చు. ఈ పథకం కింద నమోదు కోసం MERA.PMJJAY.GOV.IN (చిన్న అక్షరాల్లో టైప్ చేయాలి) వెబ్‌సైట్ చూడవచ్చు లేదా సహాయ కేంద్రం నంబరు 14555కు ఫోన్ చేయొచ్చు. వెబ్‌సైట్‌లో మన మొబైల్ నంబరు ఎంటర్ చేస్తే వచ్చే ఒన్‌టైమ్ పాస్‌వర్డ్ (OTP)తో మీ గుర్తింపు (KYC) నిర్ధారణద్వారా నమోదు పూర్తవుతుంది. అయితే, ఈ పథకానికి మీరు అర్హులేనా? అన్నది ముఖ్యమైన ప్రశ్న. ప్రధాన మంత్రి జనారోగ్య యోజన (PMJJAY) కింద ఆరోగ్య రక్షణ పొందేవారిని గ్రామీణ (Rural), పట్టణ (Urban) వినియోగదారులనే రెండు కేటగిరీలుగా విభజించారు. మీరు ఈ కేటగిరీల్లో ఉన్నారేమో కింది అర్హత ప్రమాణాలను బట్టి నిర్ణయించుకోండి!
గ్రామీణ కేటగిరీకి అర్హత ప్రమాణాలు:
• ‘‘తాత్కాలిక పైకప్పు, తాత్కాలిక గోడల’’తోగల ఒకే గదిలో నివసించే కుటుంబం
• 16-59 ఏళ్ల మధ్య పురుష వయోజనులు లేని కుటుంబం
• మహిళ ఇంటిపెద్దగా ఉండి... 16-59 ఏళ్ల మధ్య పురుష వయోజనులు లేని కుటుంబం
• కనీసం ఒక దివ్యాంగ వ్యక్తి ఉండి, శారీరక లోపాల్లేని వయోజనరహిత కుటుంబం
• ఎస్సీ, ఎస్టీలకు చెందిన అన్ని కుటుంబాలు
• శరీర కష్టమే ప్రాథమిక జీవనోపాధిగాగల భూమిలేని, వలస కూలీ కుటుంబం
• అశుద్ధం శుభ్రం చేసే పని (SCAVENGER)లో ఉన్న కుటుంబం
• దానధర్మాలపై బతికే నిరాశ్రయు (అనాథ)లు
• చట్టబద్ధంగా విముక్తులైన వెట్టి పనివారు
• ఆదివాసీ గిరిజన కుటుంబం
పట్టణ కేటగిరీకి అర్హత ప్రమాణాలు:
• పట్టణ ప్రాంతానికి చెందిన లేదా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన ఇంటి పనివారు.
• యాచకులు
• చెత్త ఏరుకునేవారు
• వీధి (చిన్న)వర్తకులు/చెప్పులు కుట్టేవారు/హాకర్లు
• నిర్మాణరంగ కార్మికులు/ప‌్లంబర్/మేసన్(తాపీమేస్త్రీ)/కార్మికులు/పెయింటర్/వెల్డర్/సెక్యూరిటీ గార్డ్/రోజుకూలీ
• ఇంటిలోనే పని చేసుకునేవారు/కళాకారులు/చేతివృత్తుల కార్మికులు/టైలర్లు
• స్వీపర్/పారిశుధ్య పనివారు/తోటమాలి
• రవాణరంగ కార్మికులు/డ్రైవర్/కండక్టర్/డ్రైవర్లు-కండక్టర్లకు హెల్పర్/బండి-రిక్షా లాగేవారు
• దుకాణాల్లో పనివారు/సహాయకులు/చిన్న సంస్థల్లో ప్యూన్లు/హెల్పర్లు/డెలివరీ అసిస్టెంట్లు/అటెండెంట్లు/వెయిటర్లు
• ఎలక్ట్రీషియన్/మెకానిక్/అసెంబ్లర్/రిపేర్ వర్కర్
• రజకులు/చౌకీదార్లు
ఆన్‌లైన్‌లో అర్హత నిర్ధారణ ఎలా?
STEP 1: WWW.ABNHPM.GOV.IN/ (అన్నీ చిన్న అక్షరాలు) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
STEP 2: అందులో ‘‘AM I ELIGIBLE’’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
STEP 3: తర్వాత కనిపించే స్క్రీన్‌పై మీ మొబైల్ నంబరు ఎంటర్ చేస్తే OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
STEP 4: అప్పుడు సంబంధిత వివరాలు మీ మొబైల్‌కు వస్తాయి.
గమనిక: ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా కుటుంబం ఈ పథకానికి అర్హులైన పక్షంలో ‘‘సామాజిక-ఆర్థిక కుల జనగణన’’ (SECC) డేటాబేస్ ఆధారంగా వారి పేరు ఆటోమేటిక్‌గా నమోదైపోతుంది.