రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా ప్రారంభించిన జియో ఇప్పుడు ఆ కంపెనీకి బంగారు బాతుగా మారింది. సరాసరిన వారానికో డీల్‌తో అంబానీ ఖజానా నింపేస్తోంది. తాజాగా జియో ప్లాట్ ఫామ్స్ లిమిటెడ్.. అమెరికన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కేకేఆర్ అండ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.11,367 కోట్లు కావడం విశేషం. ఇప్పటివరకు ఆసియాలో తాము పెట్టిన అతి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఇదేనని కేకేఆర్ కంపెనీ చెప్పిందంటే జియో దూకుడు ఏ రేంజ్‌లో ఉందో అర్ధమవుతోందని మార్కెట్ ఎక్స్‌పర్ట్‌లు అంటున్నారు. ఈ ఒప్పందంతో కేకేఆర్‌కు జియోలో 2.32% వాటా దక్కుతుంది.
నెలరోజుల్లో 78,562 కోట్లు
ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంటే అంబానీ మాత్రం బిజినెస్ విస్తరణను పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. అందుకే నెల రోజులు తిరిగేసరికి జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో ఏకంగా 78,562 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చిపడ్డాయి. జియోతో ఒప్పందం చేసుకున్న కంపెనీల్లో ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జెనరల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటి టెక్ దిగ్గజాలు ఉండటం విశేషం.
ఏప్రిల్ 22న మొదలు
ఏప్రిల్ 22న జియోలో ఫేస్‌బుక్ భారీ పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత సరిగ్గా నెలరోజులు తిరిగేసరికి మరో నాలుగు బడా కంపెనీలు జియోతో జట్టు కట్టాయి.
1. ఫేస్‌బుక్ - రూ.43,574 కోట్ల పెట్టుబడి
2. సిల్వర్ లేక్ - రూ.5,665.75 కోట్లు
3. విస్టా ఈక్విటీ పార్టనర్స్ - రూ.11,367
4. జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు
5. కేకేఆర్ అండ్ కంపెనీ- రూ.11,367 కోట్లు