స్మార్ట్.. స్మార్ట్.. స్మార్ట్ .. ఇప్పుడు భారత్ జపిస్తున్న మంత్రమిది. ప్రతి నగరంతో పాటు గ్రామం కూడా స్మార్ట్ కావాలని ప్రభుత్వం కూడా సంకల్పించుకుంది. దీనికి తగ్గట్టే కొన్ని పట్టణాలను ఇప్పటికే గుర్తించింది కూడా. ఐతే నగరాలతో పాటు గ్రామాలను కూడా స్మార్ట్‌గా మార్చడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అయితే స్మార్ట్ సిటీకి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత సమయం పడుతుంది? ఏఏ వనరులు కావాలి అనే విషయాలపై ప్రభుత్వం బ్లూఛార్ట్ సిద్ధం చేస్తోంది. అయితే స్మార్ట్ సిటీలకు ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ ఒక సర్పంచ్ కేవలం రూ.15 లక్షలతో తమ గ్రామాన్ని స్మార్ట్‌గా మార్చేశాడు. అదెలాగో చూద్దామా!
ఒక్క గ్రామం.. 23 వైఫై హాట్‌స్పాట్లు!
మన సిటీల్లోనూ బహిరంగంగా వైఫై హాట్‌స్సాట్లు ఉండట్లేదు. హైదరాబాద్ లాంటి మహా నగరంలో ఇప్పుడిప్పుడే వైఫై హాట్‌స్పాట్ సంస్కృతి పెరుగుతోంది. అలాంటిది ఒక మారుమూల గ్రామంలో 23 వైఫై హాట్‌స్పాట్‌లు ఉన్నాయంటే నమ్మగలమా! కానీ ఇది నిజం!! ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్దార్థ్ నగర్ జిల్లా అసున్‌పుర్‌కు వెళితే మనం ఇవన్నీ చూడొచ్చు. వైఫై మాత్రమే కాదు 23 సీసీ టీవీ కెమెరాలు, హైటెక్ కళాశాలలు ఈ గ్రామం సొంతం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రామంలో జనాభా 2000 వేల మంది లేకపోవడం. భారత్-నేపాల్ బోర్డర్‌కు దగ్గరలో ఉన్న ఈ గ్రామం.. 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. పబ్లిక్ అడ్రెసింగ్ కోసం ఎక్కడికక్కడ లౌడ్‌స్పీకర్లు, ఈ విలేజ్ గురించి మొత్తం వివరాలు తెలిపే వెబ్‌సైట్ కూడా ఉన్నాయి.
ప్రతి ఒక్కరి డేటా ఉంటుంది
గ్రామంలో ఏ కుటంబానికి సంబంధించిన డేటా కావాలన్నా, వివరాలు తెలియలన్నా అసున్‌పుర్ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే చాలు. ప్రతి వ్యక్తి గురించిన వ్యక్తిగత వివరాలతో పాటు వారి ఆర్థిక స్థితి గతులు కూడా ఉంటాయి. వారికి లైఫ్ ఇన్సురెన్స్, హెల్త్ ఇన్సురెన్స్‌లు ఉన్నాయా? ఎవరికైనా ఆ ఫ్యామిలీలో పొగ త్రాగే అలవాటు ఉందా? మందు కొడతారా? ఇలా చిన్న చిన్న వివరాలను కూడా ఈ సైట్ అందిస్తుంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, మంచి సౌకర్యాలు ఈ గ్రామం సొంతం. అంతేకాదు ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు, స్మార్టుఫోన్, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి. దాదాపు గ్రామంలో అందరూ ఆన్‌లైన్ ద్వారా ట్రాన్సాక్షన్లు చేయగలరు.
మార్చేసింది అతనే
ఒక గ్రామం ఇంత టెకీగా ఉందంటే కారణం ఆ గ్రామ సర్పంచ్ దిలీప్ కుమార్ త్రిపాఠినే. గతేడాది నవంబర్‌లో సర్పంచ్‌గా ఎన్నికైన ఆయన గ్రామ స్వరూపాన్నే మార్చేశాడు. కేవలం రూ.15 లక్షలు పెట్టి ఆధునాతన సదుపాయాలు సమకూర్చాడు .అందరికి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల మీద అవగాహన కల్పించాడు. గ్రామం చదువుకున్న వారిని చైతన్యవంతం చేసి వారి కుటుంబాలకు కూడా టెక్నాలజీని పరిచయం చేశాడు. గ్రామాన్ని డిజిటలైజ్ చేయాలనే కలను అతను నెరవేర్చుకునే దిశగా సాగుతున్నాడు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించే నిధులను సక్రమంగా వాడి టెక్నాలజీతో సులభంగా ఎలా పనులు చేయచ్చో అందరికి చేసి చూపించాడు.