• తాజా వార్తలు

ఈ.పీ.ఎఫ్‌‌.లో వఛ్చిన ఈ కీలక మార్పులు మీకు తెలుసా?

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌)లో రానున్న కాలంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం కనీస వేతన నిబంధనలు, ఉద్యోగి పింఛను పథకం(ఈపీఎస్‌)లో మార్పులు చేయబోతుంది. ఇందులో భాగంగా ఉద్యోగి అనుమతితో అతని ఇష్టం మేరకు పింఛను పథకం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించబోతుంది.

2015-16 బడ్జెట్ లో ఇచ్చిన హామీల మేరకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ చట్ట సవరణ బిల్లు-2019 ముసాయిదాను కేంద్ర కార్మిక శాఖ రూపొందించింది. ఈ బిల్లుపై కార్మిక సంఘాలు, పీఎఫ్‌ చందాదారులు, యాజమాన్యాలు, ప్రజలు... సెప్టెంబరు 22వ తేదీలోగా అభ్యంతరాలను rahul.bhagat@ips.gov.in, samir.kumar70@nic.in మెయిళ్లకు ఈ-మెయిల్‌ ద్వారా.. లేదా రాహుల్‌ భగత్‌, డైరెక్టర్‌, కేంద్ర కార్మికశాఖ, రూము నం.302, శ్రమశక్తి భవన్‌, ఢిల్లీ చిరునామా పేరుతో పంపాలని కార్మికశాఖ కోరింది. 

EPSతో పాటు NPSను చేర్చాలని చాలా రోజులుగా యోచిస్తున్నారు. గతంలో ఈపీఎస్‌కు బదులు ఎన్పీఎస్ ప్రతిపాదన వచ్చినప్పుడు కార్మిక సంఘాలు మండిపడ్డాయి. అయితే ఇప్పుడు ఎన్పీఎస్‌ను ఐచ్ఛికంగా మాత్రమే చేర్చింది. ఈపీఎస్ కింద వేతనజీవులకు రిటైర్మెంట్ తర్వాత కచ్చిత పింఛన్ వస్తుంది. భవిష్యనిధి చందా మొత్తాన్ని ఒకేసారి పన్ను లేకుండా తీసుకోవచ్చు. ప్రత్యేక సందర్భాల్లో మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు కూడా ఈపీఎస్‌లో ఉంది. ఉద్యోగులు రెండు ఆప్షన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. నిబంధనల మేరకు ఎన్పీఎస్ నుంచి ఈపీఎస్‌కు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

EPF చట్టం ప్రకారం బేసిక్ శాలరీ, డీఏ, ఇతర భత్యం కలిపి శాలరీగా నిర్ణయించి ఉద్యోగి వాటా కింద పన్నెండు శాతం, కంపెనీ వాటా కింద 12 శాతాన్ని ఈపీఎస్ ఖాతాలో జమ చేస్తారు. తాజా బిల్లు ప్రకారం తక్కువ వేతనం కలిగిన ఉద్యోగుల వయస్సు ఆధారంగా చందాను తగ్గించుకునే అవకాశాన్ని కల్పించనుందట. యజమాని వాటా మాత్రం తగ్గదు. ఇది వేతనజీవులకు పెద్ద ఊరట. వారి వారి అవసరాల ఆధారంగా టేక్ హోమ్ శాలరీని పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఈపీఎస్‌లో ఉద్యోగి, యజమాని నుంచి పెన్షన్ నిబంధన ఆధారంగా ప్రతి నెల బ్యాంకులో జమ అవుతుంది. ఈ పెన్షన్ కోసం యజమాని వాటాలోని 12 శాతంలో 8.3 శాతం వాటాను గరిష్టంగా రూ.1250ని ఈపీఎస్‌లో జమ చేస్తారు.

ఉద్యోగి ఎన్పీఎస్ పథకం ఎంచుకుంటే ఇది పీఎఫ్ఆర్డీఏ పరిధిలోకి వెళ్తుంది. ఉద్యోగం మానేసి మొత్తాన్ని తీసుకునేందుకు ఎన్పీఎస్ నిబంధనలకు లోబడి ఉంటుంది. ఉద్యోగికి 60 ఏళ్లు వచ్చాక అరవై శాతం మాత్రమే తీసుకోవచ్చు. ఇందులో 20 శాతంపై పన్ను ఉంటుంది. మిగతా 40 శాతం యాన్యుటీ స్కీంలో ఇన్వెస్ట్ చేసి, సంబంధిత బీమా సంస్థ నిర్ణయించిన వడ్డీ ఆధారంగా నెలవారీ పెన్షన్ పొందవచ్చు.


 

జన రంజకమైన వార్తలు