• తాజా వార్తలు

పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు ఉచితం, ఇవ్వకుంటే ఫిర్యాదు చేయవచ్చు 

పెట్రోల్ లేదా డీజిల్ కోసం మనం పెట్రోల్ బంకుల్లోకి వెళ్తుంటాం. అయితే అక్కడ మనం పెట్రోల్, డీజిల్ మాత్రమే కొట్టించుకుని వెళ్లిపోతాం. అలా కాకుండా అక్కడ కొన్ని రకాల సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో ఈ సేవలు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవసరమవుతాయి. పెట్రోల్ బంకుల్లో ఉచితంగా అందించే సేవలు ఏమిటో తెలుసుకుందాం...

ఫిల్టర్ పేపర్ టెస్ట్
ఏ పెట్రోల్ బంకులో అయినా మీరు పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యతను తెలుసుకునేందుకు ఫిల్టర్ పేపర్ టెస్ట్ అడగవచ్చు. దీనికి ఎలాంటి ఛార్జ్ వసూలు చేయరు. క్వాంటిటీ పైన అనుమానం ఉంటే వెంటనే చెక్ చేయించుకోవచ్చు. ఇది మీ హక్కు. పెట్రోల్ బంక్ యాజమాన్యం దీనిని నిరాకరించరాదు. అలాగే, ఛార్జీ కూడా వసూలు చేయలేరు.

ఫస్ట్ ఎయిడ్
రోడ్డుపై వెళ్లే సమయంలో ఎక్కడైనా ఎవరైనా ప్రమాదం బారినపడితే సమీపంలోని పెట్రోల్ బంకుకు తీసుకువెళ్లి ఫస్ట్ ఎయిడ్ అడగవచ్చు. పెట్రోల్ బంకులు ఫుల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.అలాగే మీరు అత్యవసరమై ఫోన్ కాల్ చేసేందుకు కూడా పెట్రోల్ బంకుకు వెళ్లవచ్చు. అత్యవసర సమయంలో స్నేహితుడికి లేదా ప్రమాదం బారిన పడిన వ్యక్తి కుటుంబ సభ్యులకు లేదా ఎవరికైనా ఫోన్ చేయడానికి పెట్రోల్ బంక్స్ ఉచిత కాల్ సౌకర్యం అందించాలి. 

పరిశుభ్రమైన తాగునీరు
హైజెనిక్ టాయిలెట్స్, మరుగుదొడ్లు పెట్రోల్ బంకుల్లో తప్పనిసరి. దీనికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. టాయిలెట్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి.  మీరు కస్టమర్ కాకపోయినప్పటికీ.. అంటే ఆ సమయంలో మీరు పెట్రోల్, డీజిల్ కొనకపోయినప్పటికీ.. టాయిలెట్స్ ఉపయోగించవచ్చు. అలాగే పెట్రోల్ బంకుల్లో పరిశుభ్రమైన తాగునీరు తప్పనిసరి. మంచి నీరు మీరు అక్కడ తాగవచ్చు లేదా బాటిల్స్‌లో తీసుకు వెళ్లవచ్చు.

ఫ్రీ ఎయిర్
పెట్రోల్ బంకుల్లో మీరు ఉచితంగా మీ వాహనాల్లో గాలిని నింపించుకోవచ్చు. గాలిని నింపినప్పుడు నామమాత్రంగా అయినా డబ్బులు తీసుకుంటే మీరు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో పాటుగా మీరు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసిన తర్వాత బిల్లును కచ్చితంగా అడిగి తీసుకోవచ్చు. సలహా/ఫిర్యాదు పుస్తకాన్ని ఎల్లప్పుడూ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలి. దీన్ని కస్టమర్లకు తెలియజేయాలి.

పనివేళలు, సెలవుల పట్టికను వినియోగదారులకు తెలియజేసేలా బోర్డు ఏర్పాటు చేయాలి. డీలర్, చమురు కంపెనీ సిబ్బంది పేరు, ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలి. శిక్షణ పొందిన సిబ్బందితో పాటు భద్రతా సాధనాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ఈ-సేవలను పెట్రోల్ బంకులు ఖచ్చితంగా అందించాల్సి ఉంటుంది. 

పెట్రోల్ బంక్ యజమాని ఈ నిబంధనలను పాటించకపోతే, వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవచ్చు. మొదటి ఉల్లంఘన కింద 15 రోజుల పాటు ఇందన అమ్మకాలను రద్దు చేయొచ్చు. రెండో నిబంధన కింద పెట్రోలు బంకును 30 రోజుల పాటు ఇందన అమ్మకాలను రద్దు చేయొచ్చు. మూడోసారి నిబంధనలను అతిక్రమిస్తే పెట్రోల్ పంపు డీలర్ షిప్‌ను రద్దు చేయొచ్చు.
 

జన రంజకమైన వార్తలు