టెలికాం రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్ మార్కెట్లో కూడా సంచలనాలను నమోదు చేసేందుకు రెడీ అయింది. రిటెయిల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ద్వారా అమెజాన్, వాల్‌మార్ట్- ఫ్లిప్‌కార్ట్‌లకు పెద్ద సవాల్ విసరనుంది. వచ్చి రావడంతోనే జియో తరహాలోనే రీటెయిల్ మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్ పరిశోధనా సంస్థ ఫోర్రెస్టర్ ప్రకారం 2023 నాటికి భారతదేశంలో ఆన్‌లైన్ రిటైల్ విక్రయాల మార్కెట్ విలువ 85 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 5,90,000 కోట్లు) టచ్ చేయనుంది.
వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్ రిటైల్ సేల్స్ 25.8శాతం వృద్ధిని సాధించనున్నాయి. అలాగే భారత్‌లో 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు, గత డిసెంబర్‌లో ఈ కామర్స్ పాలసీలో మార్పుల రూపంలో ఒడిదుడుకులు ఎదురైనా వృద్ధి కొనసాగుతుందని అంచనా ఫోర్రెస్టర్ సంస్థ వేసింది. 6,600 నగరాలు, పట్టణాల్లో 10,415 స్టోర్లు కలిగిన రిలయన్స్ రిటైల్ ఇప్పుడు 500మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చే రిలయన్స్ స్టోర్లకు ఆదరణ పెరుగుతుందని ఫారెస్టర్ అంచనా వేస్తోంది.
ఇదే జరిగితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లకు రిలయన్స్ రీటెయిల్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. అలాగే భారీ డిస్కౌంట్లతో రిలయన్స్ రిటైల్ మార్కెట్‌లో అడుగు పెడితే ఆన్‌లైన్ రీటైల్ దిగ్గజాలకు నష్టాలు తప్పవని, దాదాపు టెలికాం మార్కెట్‌లోకి జియో ప్రవేశించిన అనంతరం ఏర్పడిన పరిస్థితులే పునరావృతం అవుతాయని ఫారెస్టర్ సీనియర్ ఫోర్‌కాస్ట్ అనలిస్ట్ సతీష్ మీనా అభిప్రాయపడ్డారు.
కాగా 2019 ఏప్రిల్‌లో రిలయన్స్ తన ఎంప్లాయిస్ కోసం ఫుడ్ అండ్ గ్రోసరీ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ ఏడాదిలోనే యాప్‌ను కమర్షియల్‌గా లాంచ్ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తద్వారా రిలయన్స్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ టూ ఆఫ్ లైన్ కామర్స్ ప్లాట్‌ఫాంను అందుబాటులో తేవడంతోపాటు, వినియోగదారులకు భారీ ప్రయోజనాలను అందించనుంది.
టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. చవక ధరలకు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. మార్చి నెలలో జియోకు ఏకంగా 94 లక్షల మంది కొత్త కస్టమర్లు జతయ్యారు. వీరిలో అత్యధిక భాగం ఇతర టెలికం కంపెనీల నుంచి వచ్చిన వారే. వీరి చేరికతో దేశంలో జియో యూజర్ల సంఖ్య 30.7 కోట్లకు చేరింది. మార్చి నెలలో ఎయిర్‌టెల్ 1.51 కోట్లమంది యూజర్లను కోల్పోయింది. ప్రస్తుతం ఆ నెట్ వర్క్‌లో 32.5 కోట్లకు చేరుకుంది. ఇక వొడాఫోన్-ఐడియా గత నెల 1.45 కోట్లమందిని 39.48 కోట్లమందికి పరిమితమైంది. టెలికం రెగ్యులేరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈ గణాంకాలు వెల్లడించింది.