• తాజా వార్తలు

ఇకపై 112 నంబర్‌కు డయల్ చేస్తే చాలు, సమస్య పరిష్కారమైనట్లే 

ఆపద సమయాల్లో ఇకపై 112 నంబర్‌కు డయల్ చేస్తే అన్ని రకాల అత్యవసర సేవలు అందనున్నాయి. ఇప్పటివరకు ఉన్న పోలీస్ డయల్ 100, ఫైర్ డయల్ 101, అంబులెన్స్ డయల్ 108, ఉమెన్ హెల్ప్‌లైన్ డయల్ 1090 నంబర్లకు బదులుగా.. ఒక్క నంబర్ డయల్ 112 లోనే నాలుగురకాల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ కసరత్తు పూర్తిచేసింది. 
ఏకీకృత అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్‌ ‘112’ను 11 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించారు. పౌరుల భద్రత, ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘112’ను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. సేఫ్‌ సిటీ ప్రాజెక్టు మొదటి దశ అమలు చేయడానికి అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో నిర్భయ ఫండ్‌ కింద రూ.2,919 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

ఆపదలో ఉన్నవారు ఈజీగా ఫిర్యాదు చేసేందుకు.. వీలైనంత తక్కువ సమయంలో అవసరానికి ఆదుకొనేందుకు పోలీస్, ఫైర్, అంబులెన్స్, మహిళా రక్షణ సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చారు. 112 కు డయల్ చేసి సేవల గురించి చెప్పగానే.. సంబంధిత శాఖ అధికారులకు సమాచారం వెళ్లి సహాయం అందించేందుకు వీలు చిక్కనున్నది. గతేడాది హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలుచేసి మంచి ఫలితాలు సాధించారు. తొలివిడతగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కశ్మీర్‌ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని ప్రారంభించారు.

కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన డయల్ 112 నంబర్‌కు ఫోన్ చేసి మన అత్యవసర పరిస్థితి ఏంటి? ఏ సేవలు (పోలీస్, ఫైర్, మహిళా హెల్ప్‌లైన్, అంబులెన్స్) కావాలి? అనేది కాల్‌సెంటర్ సిబ్బందికి చెబితే వెంటనే సంబంధిత విభాగానికి అనుసంధానం చేస్తారు. అప్పుడు మనం ఫిర్యాదు చేసి, అత్యవసర సేవలు పొందవచ్చు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టం (ఈఆర్‌ఎస్సెస్) లో భాగంగా డయల్ 112ను రూపొందించారు. ఈ విధానంలో ఇప్పటికే అమెరికాలో అన్ని అత్యవసర సేవలకు డయల్ 911 నంబర్ అమలులో ఉన్నది. 

స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్‌లో లేదా ఆపిల్ ప్లేస్టోర్ నుంచి 112 ఇండియా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొంటే సరిపోతుంది. అత్యవసర సమయాల్లో యాప్‌లోకి వెళ్లి షౌట్ బటన్‌ను ప్రెస్‌చేసి పట్టుకొంటే దానికదే ఆ పరిధిలోని పోలీసులకు ఫిర్యాదు పంపుతుంది. యాప్ డౌన్‌లోడ్ చేయనట్లయితే ఏ మొబైల్ నుంచైనా పవర్ ఆఫ్ బటన్‌ను వెంటవెంటనే మూడుసార్లు నొక్కితే ఎమర్జెన్సీ కాల్ 112కు వెళ్తుంది. అయితే ఈ సదుపాయం 2017 నుంచి తయారైన మొబైల్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
 

జన రంజకమైన వార్తలు