మొబైల్ డాటా చౌకగా దొరకడం ఇండియాలో ఇంటర్నెట్ వినియోగాన్ని అమాంతం పెంచేసింది. అంతకు ముందు ఒక మోస్తరుగా ఉన్న డాటా వినియోగం జియో రాకతో రూపురేఖలే మారిపోయింది. కంపెనీలు పోటీపడి డాటా రేట్లు తగ్గించడం, స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరలో దొరుకుతుండటం ఇంటర్నెట్ యూజర్ బేస్‌ను ఎక్కడికో తీసుకుపోయింది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏ ఎం ఐ ఏ) లెక్కల ప్రకారం 2019 నవంబర్ నాటికి ఇండియాలో ఇంటర్నెట్ వాడేవారు 50 కోట్ల 40 లక్షల మంది వున్నారు. అంతకుముందు నెల రోజుల్లో ఒక్కసారైనా వెబ్‌లోకి వెళ్ళిన వారిని లెక్కలోకి తీసుకుని ఈ సంఖ్యను ప్రకటించింది. ఇందులో 11 ఏళ్ల లోపు పిల్లలు 70 లక్షల మంది ఉన్నారని తెలిసి షాక్ తిన్నారు.
మీవే వాడుతున్నారు
ఇంత చిన్నపిల్లలకు ఇంటర్నెట్ యాక్సెస్ ఎలా సాధ్యమవుతుందని ఐఏఎంఐ ఆరా తీసింది. 7 నుంచి 14 ఏళ్ల వయసున్న 70 లక్షల మంది పిల్లలు ఇంటర్నెట్ ఎక్కడ వాడుతున్నారని వివరాలు సేకరించింది. అమ్మానాన్నలు, ఇంకా ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులకు చెందిన మొబైల్ ఫోన్ గానీ, పీసీ లేదా లాప్టాప్ లో వీళ్ళు ఇంటర్నెట్ వాడుతున్నారని తేలింది. ఇదంతా నవంబర్ నాటి సంగతి. ఇప్పుడు లాక్‌డౌన్‌తో పిల్లలు ఇల్లు దాటి బయటికెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి వీరిలో ఇంటర్నెట్ యూసేజ్ 10 కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
ఎంతవరకు సేఫ్?
ఇంత చిన్నపిల్లలు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నారంటే ముఖ్యంగా యూట్యూబ్ వీడియోలు, టిక్‌టాక్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా యాప్స్‌కు వీరు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా చైనా తీసుకొచ్చిన టిక్‌టాక్ యాప్ పిల్లల్లోనూ బాగా ప్రాచుర్యం పొందింది. దీనిలో అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ లెక్కలను తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి లాక్డౌన్ కదా పిల్లలు అడిగారు కదా అని స్మార్ట్ఫోనో, పీసీనో వారికి ఇవ్వకండి. ఫిజికల్ గేమ్స్ ఆడుకోమనిచెప్పండి. అంతగా స్మార్ట్ డివైజ్ ఇవ్వాల్సి వస్తే వాళ్ల మీద ఓ కన్నేసి ఉంచండి. పిల్లలు దారి తప్పకుండా అవసరమైతే చైల్డ్ లాక్ ఆప్షన్ వాడుకోమని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులూ మీకు అర్ధమవుతోందా?