ఆండ్రాయిడ్ లేటెస్ట్ అప్ డేట్ ఆండ్రాయిడ్ 11 కావాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే అని గూగుల్ తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీన ఆండ్రాయిడ్11 రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అని గూగుల్ తొలుత ప్రకటించింది. ఆన్లైన్లో ఈ ఈవెంట్ ఉంటుంది అని చెప్పింది. అయితే ఓ పక్క కరోనా ఉద్ధృతంగా ఉండటం, మరోవైపు అమెరికాలో నల్లజాతి వ్యక్తి శ్వేత జాతి పోలీసు చేతిలో చనిపోవడంతో ఆ దేశంలో జరుగుతున్న గొడవలు మధ్య ఈ ఈవెంట్ జరపడం సరికాదని గూగుల్ భావించింది. అందుకే ఈవెంట్‌ను రద్దు చేసింది.
సంబరాలకు ఇది సమయం కాదు
ప్రస్తుత పరిస్థితుల్లో సంబరాలు సరికాదని గూగుల్ వ్యాఖ్యానించింది. అమెరికాలో గొడవలు, కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న పరిస్థితుల్లో తమ ఈవెంట్‌ను రద్దు చేసింది.
జాతి సమానత్వానికి సుందర్ పిచాయ్ మద్దతు
మరోవైపు అమెరికాలో జాతి వ్యతిరేకంగా జరుగుతున్న గోడవలపై గూగుల్ ఆందోళన వ్యక్తం చేసింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ, భారతీయుడైన సుందర్ పిచాయ్ అమెరికాలో నల్ల జాతీయుడిపై తెల్ల జాతి పోలీసు దాడి చేసి చంపడాన్ని పిచాయ్ ఖండించారు. జాతి వ్యతిరేక భావనకు గూగుల్ వ్యతిరేకమని ఆయన ట్వీట్ చేశారు. జాతి సమానత్వాన్ని తాము ఎల్లప్పుడూ కోరుకుంటామని ప్రకటించారు.
గూగుల్ హోం పేజీలో మద్దతు
ఈ విషయంపై గూగుల్ తన మద్దతును బహిరంగంగానే ప్రకటించింది. గూగుల్ హోం పేజీలోనూ, యూట్యూబ్‌లోనూ కూడా చనిపోయిన నల్లజాతీయుడికి మద్దతుగా కామెంట్స్ పెట్టింది.