• తాజా వార్తలు

చైనా యాప్స్ తొల‌గించ‌మ‌ని ఎలాంటి ఆదేశాలివ్వ‌లేదు...  క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం

స‌రిహ‌ద్దుల్లో మ‌న సైనికులు 20 మందిని చైనా పొట్ట‌న బెట్టుకున్న‌ప్ప‌టి నుంచి చైనా ప్రొడ‌క్ట్స్ మీద మ‌న‌వాళ్ల‌కు కోపం మ‌రింత పెరిగింది. దీంతో చైనా వ‌స్తువుల‌ను మాత్ర‌మే కాదు టిక్‌టాక్, యూసీ బ్రౌజ‌ర్ లాంటి చైనా యాప్స్‌ను కూడా బ్యాన్ చేయాల‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి త‌గ్గ‌ట్లుగానే కేంద్ర ప్ర‌భుత్వం కూడా గూగుల్ ప్లేస్టోర్స్‌, యాపిల్ స్టోర్స్‌లో చైనా యాప్స్ తొల‌గించాల‌ని ఆదేశించిన‌ట్లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా స‌ర్క్యులేట్ అయింది. అయితే దీన్ని సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ కొట్టిపారేసింది. తాము అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వ‌లేద‌ని తేల్చిచెప్పేసింది. 

కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్.. చైనా యాప్‌ల‌ను తొల‌గించాల‌ని గూగుల్ ప్లేస్టోర్‌, యాపిల్ ఐ స్టోర్‌ల‌కు ఆర్డ‌ర్స్ వేసిందంటూ ఒక ఆర్డ‌ర్ కాపీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. టిక్‌టాక్‌, విమేట్‌, విగో వీడియో, లైవ్‌మీ, బిగో లైవ్‌, బ్యూటీ ప్ల‌స్‌, కామ్ స్కాన‌ర్‌, క్ల‌బ్ ఫ్యాక్ట‌రీ, యాప్ లాక్ లాంటి చైనా యాప్స్‌ను తొల‌గించాలంటూ లిస్ట్ కూడా ఇచ్చినట్లు ఆ ఆర్డ‌ర్ కాపీలో ఉంది. ఇంకేముంది ప్ర‌భుత్వం చైనా యాప్స్‌ను బ్యాన్ చేస్తోందంటూ సోష‌ల్ మీడియాలో హోరెత్తిపోయింది. 

ఫేక్ అని తేల్చిన పీఐబీ
ఈ ఆర్డ‌ర్స్ ఏమిటి అని ప్ర‌భుత్వ రంగ వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసింది. అయితే అదంతా ఉత్త‌దేన‌ని, ఆ ఆర్డ‌ర్ కాపీని కూడా ఎవ‌రో క్రియేట్ చేశార‌ని తేల్చేసింది. సో గ‌వ‌ర్న‌మెంట్ ఇప్ప‌టివ‌ర‌కు చైనా యాప్స్ మీద ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదని తేలిపోయింది. ఇదంతా సోష‌ల్ మీడియాలో కొంద‌రు చేసే హంగామా అని క్లారిటీ వ‌చ్చింది.   

జన రంజకమైన వార్తలు