వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ గ్లోబల్ సీఈఓ విల్ క్యాత్‌కార్ట్‌కు లేఖ రాసిన సంగతి తెలుసు కదా.. దాన్ని వాట్సాప్ పట్టించుకోలేదన్న విషయమూ అందరికీ తెలిసిందే. అంతేకాదు వాట్సాప్ ప్రైవసీ పాలసీ అమలు తేదీని జస్ట్ ఏప్రిల్ వరకు వాయిదా వేసిందంతే. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని చేయకుండా ఆదేశించాలంటూ కేంద్ర ప్రభుత్వం కోర్టు మెట్లెక్కింది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీమీద పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ విచారణలో ఉన్నందున దీనిపై స్టే విధించాలని కోరింది.
ఐటీ నిబంధనలకు వ్యతిరేకం
కొత్త పాలసీలో యూజర్ డేటా సేకరణపై వాట్సాప్ స్పష్టత ఇవ్వలేదని తెలిపింది. అందువల్ల, దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగాలని కోరింది. డాటా ప్రొటెక్షన్, ప్రైవసీ కోసం పకడ్బందీ చర్యలను తీసుకోవాలని సుప్రీం కోర్టు కూడా ఆదేశించిందని సెంట్రల్ గవర్నమెంట్ కోర్టుకు చెప్పింది. అందువల్ల యూజర్ డేటా భద్రతకు ముప్పు వాటిల్లకుండా నిబంధనలు చేర్చే వరకు కొత్త ప్రైవసీ పాలసీని దేశంలో అమలు చేయకుండా చూడాలని హైకోర్టును కోరింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ 2011 ఐటీ నిబంధనలను తూట్లు పొడిచేలా ఉందని, కేంద్రం హైకోర్టుకు అందజేసిన కౌంటర్ అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రస్తుత ఐటీ నిబంధనలను వాట్సాప్ ఎలా ఉల్లంఘిస్తుందో కూడా అఫిడవిట్‌లో ప్రస్తావించింది.
ఇదీ లొసుగు
వాట్సాప్ కొత్త పాలసీని యూజర్లు వాటిని అంగీకరించాలి లేదా యాప్ నుంచి ఎగ్జిట్ కావొచ్చు. కానీ యూజర్ తమ డేటాను ఫేస్‌బుక్ ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి ఇతర యాప్‌లు లేదా థర్డ్ పార్టీ యాప్‌లతో షేర్ చేయవద్దనే ఆప్షన్ యూజర్‌కు ఉండదు. ఇది అనుమానాలు రేకెత్తించడమే కాదు కచ్చితంగా ఐటీ రూల్స్ 5 (7), 6 (4) ఉల్లంఘన కిందికి కిందికే వస్తాయని కేంద్రం హైకోర్టుకు తెలిపింది.
వాట్సాప్ స్పందన ఏమిటి?
ప్రభుత్వం దిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయంపై వాట్సాప్ ప్రస్తుతానికి ఏమీ స్పందించలేదు. అంతేకాదు ప్రైవసీ పాలసీని ఓకే చేయాలంటూ యూజర్లందరికీ మళ్లీ నోటిఫికేషన్లు పంపిస్తోంది.
* కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించాక వాట్సాప్‌ను కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని అడిగే అవకాశాలున్నా యి. అప్పుడు వాట్సాప్ తమ ప్రైవసీ పాలసీ వల్ల యూజర్లకు నష్టం లేదని ఒప్పించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం చెబుతున్న సెక్షన్లన్నీ చూస్తుంటే అదంత ఈజీ ఏమీ కాదు.
* కాబట్టి కోర్టు పూనుకుంటే వాట్సాప్ ప్రైవసీ పాలసీని ఆపడమో లేదా యూజర్ల డేటాకు ఇబ్బంది లేకుండా మార్పులు చేయడమో జరగొచ్చు.