• తాజా వార్తలు

2022 నాటికి ఇండియాలో 5జీ వ‌స్తుందంటున్న ప్ర‌భుత్వం.. సాధ్యాసాధ్యాల‌పై ఓ విశ్లేష‌ణ

ఇండియాలో 5జీ ఎప్పుడొస్తుంది.. టెక్నాల‌జీ ప్రేమికులంద‌రిదీ ఇదే మాట‌. ఇప్పుడు జ‌రుగుతున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో దీనిపై కేంద్ర టెలిక‌మ్యూనికేష‌న్ల శాఖ ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చేసింది. 2022 మొద‌ట్లోనే ఇండియాలో 5జీ స‌ర్వీసులు ప్రారంభ‌మ‌వుతాయ‌ని చెప్పింది.

2021 చివ‌ర్లో లేదా 2022 ప్రారంభంలో
రాబోయే ఐదారు నెల‌ల్లో 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం నిర్వహిస్తామ‌ని టెలికం శాఖ పార్ల‌మెంటుకు చెప్పింది. త‌ర్వాత అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈ ఏడాది చివ‌రిలో లేదా 2022 ప్రారంభంలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5జీ స‌ర్వీసులు అందుబాటులోకి తెస్తామ‌ని చెప్పింది.  4జీ దేశంలో మ‌రో నాలుగైదేళ్లు కొన‌సాగ‌నున్న ప‌రిస్థితుల్లో 5జీని దేశ‌వ్యాప్తంగా అందించ‌డానికి ఇంకా చాలా టైమ్ ఉంద‌ని, అయితే ఈలోగా ఒక్కొక్క ప్రాంతంలోనూ స‌ర్వీసులు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించింది. 

ఎంత‌వ‌ర‌కు సాధ్యం? 
  మార్చి 1న దాదాపు 3.92 ల‌క్ష‌ల కోట్ల విలువైన స్పెక్ట్ర‌మ్‌ను టెలికం శాఖ వేలం వేయ‌బోతోంది. అయితే ఇందులో 5జీకి ప‌నికొచ్చే బాండ్ విడ్త్ ఉన్న స్పెక్ట్ర‌మ్ లేదు.  మార్చి 1న వేలం ముగిశాక మ‌ళ్లీ నాలుగైదు నెల‌ల‌కు కానీ 5జీ స్పెక్ట్ర‌మ్ వేలం జ‌రిపే ప‌రిస్థితి లేదు.  అది కూడా అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితేనే. ఒక‌వేళ అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగి జూన్‌, జులై నెల‌ల‌క‌ల్లా స్పెక్ట్ర‌మ్ వేలం జ‌రిగినా దేశంలో 5జీ నెట్‌వ‌ర్క్‌కు సంబంధించిన ఏర్పాట్లు ఆరు నెల‌ల్లో పూర్తి చేసి 2021 చివ‌రికి లేదా 2022 మొద‌టిక‌ల్లా స‌ర్వీసు రావ‌డం అంత ఈజీ కాద‌ని నిపుణులు అంటున్నారు. 2022 చివ‌రికి దేశంలో 5జీ వ‌చ్చినా గొప్పే అని మ‌రికొంద‌రు అంటున్నారు. 

నెట్‌వ‌ర్క్ కంపెనీల ఎంత‌వ‌ర‌కు రెడీ? 
దేశంలో 5జీ నెట్‌వ‌ర్క్‌ను అంద‌జేసే కంపెనీలే ఇంకా పూర్తిగా లెక్క తేల‌లేదు. జియో 5జీ మీద చాలా  ఉత్సాహంగా ఉంది. మ‌రోవైపు 4జీయే ఇంకా పూర్తిగా లాభ‌సాటి కాలేదు అంటూ ఎయిర్‌టెల్ వెన‌కాముందూ ఆలోచిస్తోంది. ఇంకోవైపు వేల‌కోట్ల అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా మేం  రేసులో ఉన్నామ‌ని చెబుతున్నా అది వేలంలో ఎంత‌వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చెప్ప‌డం క‌ష్టం. ఇక 4జీని నిన్న‌నే మొద‌లుపెట్టిన బీఎస్ఎన్ఎల్ 5జీ పోటీలోనే లేదు.  అస‌లు నెట్‌వ‌ర్క్ కంపెనీలు 5జీ ట్ర‌య‌ల్సే ఇంకా పూర్తిస్థాయ‌లో మొద‌లుపెట్ట‌లేదు. ఇవ‌న్నీ పూర్త‌యి మ‌రి మ‌న‌కు 5జీ ఎప్పుడొస్తుందో..  చూద్దాం!!!

జన రంజకమైన వార్తలు