ఇంటర్నెట్‌లో ఎవరికి ఏ అనుమానం వచ్చిన వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తారు. ఎలాంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికైనా గూగుల్‌ను మించిన ఆప్షన్ మరొకటి లేదు. ఇంటర్నెట్ యూజర్లకు అంతగా దగ్గర సంబంధం ఉన్న గూగుల్‌లో ప్రతి విషయం నిజమే అని నమ్మితే తప్పులో కాలేసినట్లే. గూగుల్ సెర్చ్ఇంజన్‌లో మనం సెర్చ్ చేసిన ప్రతి విషయం వాస్తవం అయ్యే అవకాశాలు అసలే లేవు. ఎందుకంటే ఈ సెర్చ్ ద్వారా వచ్చే ఫలితాల్లో 50 శాతం నిజాలు ఉంటే.. మరో 50 శాతం అసత్యాలే ఉన్నాయి. అందుకే ఒకటికి రెండుసార్లు క్రాస్ చేసుకున్న తర్వాతే ఒక విషయంపై అంచనాకు రావడం మంచిది. ఉదాహరణకు గూగుల్ సెర్చ్‌లో ఏదైనా ఒక విషయం గురించి మనం సెర్చ్ చేయగానే ముందుగా వచ్చేది వికీపిడియా! వికీపిడియా సైట్‌లో ఉండే చాలా విషయాలు నిజమై ఉండొచ్చు. కానీ చాలా విషయాలు అసత్యాలు కూడా ఉన్నాయి. దీనికి కారణంగా ఎడిట్ ఆప్షన్ ఉండడమే.
బీబీసీతో టై అప్
యూజర్లు ఎవరైనా తమకు తెలిసిన సమాచారాన్ని వికీపిడియాలో నమోదు చేయచ్చు. దీని వల్ల అసత్యాలు కూడా రికార్డు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక గూగుల్ ఓపెన్ చేయగానే ఉండే న్యూస్‌లో చాలా వరకు అసత్యాలే ఉంటున్నాయట. టాప్ ర్యాంకులో ఉండే సైట్లు కూడా తప్పుడు సమాచారం ఇస్తుండడంతో గూగుల్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో న్యూస్‌లో నిజానిజాల విశ్లేషణకు గూగుల్ నడుం బిగించింది. వార్తల్లో ఉన్న వాస్తవమెంతో తెలుసుకోవడానికి బీబీసీ, అసోసియేటెడ్ ప్రెస్ లాంటి దిగ్గజ న్యూస్ సంస్థలతో టై అప్ చేసుకోవాలని గూగుల్ ప్రయత్నిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 న్యూస్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకోవాలని గూగుల్ అనుకుంటోంది. దీని వల్ల తప్పుడు సమాచారం తగ్గి నిజమైన సమాచారం యూజర్లకు చేరుతుందని భావిస్తోంది. దీని వల్ల గూగుల్‌పై విశ్వాసం కూడా పెరుగుతుందనేది ఆ సంస్థ నమ్మకం.
ట్రూ సెక్షన్.. ఫాల్స్ సెక్షన్
గూగుల్ న్యూస్ సెక్షన్‌లో మోస్ట్‌లీ ట్రూ, ఫాల్స్ అనే ఆప్షన్లను పెట్టాలని గూగుల్ ప్రయత్నిస్తోంది. దీని వల్ల వార్తలపై యూజర్లు ఒక అంచనాకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా వార్త బ్రేక్ అయిన వెంటనే తాను ఒప్పందం చేసుకున్న సంస్థలతో గూగుల్ సంప్రదిస్తుంది. దీంతో అది నిజమైన వార్తే అయితే మోస్ట్‌లీ ట్రూ సెక్షన్‌లో, అబద్ధం అని తేలితే ఫాల్స్ సెక్షన్‌లో ఉంచుతుంది. దీని వల్ల సంచలనం కోసం వార్తలు నెట్లో ఉంచే సైట్లకు అడ్డుకట్ట వేయచ్చనేది ఆ సంస్థ ఆలోచన. స్పాట్ ఫాల్స్ న్యూస్‌పై ఫేస్‌బుక్ ప్రకటన వెలువడిన తర్వాత రోజే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.